కూతురు

కూతురు

బాల్యపు అమాయకత్వపు ధోరణిలో సాగిపోతున్న నా జీవితంలో..
బాధ్యతలు తెలుసుకోకుండా నా జీవిత సహచరి మనోవేదనను గ్రహించలేని నా జీవితంలో..

బంగారు ఛాయతో..
అత్యంత ప్రసన్న వదనంతో..
మిరుమిట్లుగొలిపే కళ్ళతో..

నా జీవితంలో ఉదయించిన జ్ఞానసూర్యుడిలా ప్రవేశించింది నా బంగారుతల్లి.

తన పుట్టుకతో ప్రపంచాన్ని మైమరచిపోయాను.
తన బాల్యంతో నాలో ఉపాధ్యాయుడి పాత్ర మేల్కొంది.
తన కిశోర వయసులో నాలో ఉత్తమ స్నేహితుడి పాత్ర ఉదయించింది.
తన వయోజన వయసులో పరిపూర్ణ తండ్రిగా మార్పు చెందవలసి వచ్చింది.

ఈ తండ్రి పాత్ర ఎంతటి మహోన్నతమైనదో.. అంతటి దురదృష్టకరమైనది.

సర్వగుణ సంపన్నురాలిగా, అల్లారు ముద్దుగా, చలకీ లేడిపిల్లలా మసలుకున్న నా బంగారు తల్లిని..
ఎవరో అనామకుడి చేతిలో పెట్టాల్సిన అతి బాధాకర సమయం ఆసన్నమైనది.

ఇది ఒక తండ్రికి ఎంతటి నరకయాతననో భగవంతుడు కూడా అంచనా వేయలేడు.

ఈ మానసిక ఆవేదన మనసులో కురుక్షేత్రాన్ని తలపిస్తుంది.
నా నరనరాల్లో తనపై నిక్షిప్తమైన ప్రేమ కూతురు వియోగ క్షణాన నా శరీరంలో తీవ్ర భూకంపాన్ని తలపిస్తుంది.

ఇది వైతరణీ నది ఒడ్డున ఉన్న నరకం కంటే కూడా ఉత్కృష్ఠమైనది.

ఏ సగటు తండ్రీ దీనిని వ్యక్తపరిచలేని దౌర్బల్య స్థితిలో ప్రసవ వేదనను మించిన భావోద్వేగ సముద్రంలో మునిగిపోతున్నాడు.

ఇది కూతురే తన జీవిత కరదీపికగా మారిన తండ్రి “నరకయాతన”.

– శంభుని సంధ్య 

Related Posts