కోరికలే గుర్రాలు అయితే

కోరికలే గుర్రాలు అయితే

 

రాజేష్ కి చాలా కోరికలు ఉన్నాయి. కానీ, అవి తీరే మార్గం మాత్రం తెలియడం లేదు. బాగా డబ్బు సంపాదించాలని, భార్య తో కాకుండా ఒక అందమైన అమ్మాయితో, మంచి అందమైన ప్రదేశంలో కొన్ని రోజులు గడపాలని, ఎంజాయ్ చేయాలని ఇంకా ఏవేవో చేయాలని చాలా పెద్ద, పెద్ద కోరికలు ఉన్నాయి. కానీ, వాటిని తీర్చుకోవాలి అంటే మాత్రం డబ్బులు కావాలి. కానీ, ఆ డబ్బు అతని దగ్గర చాలా తక్కువగా ఉంది.

భార్య తరపున వచ్చిన కట్నంతో ఎదో చిన్న బిజినెస్ మొదలు పెట్టాడు రాజేష్. పేపర్ ప్లేట్స్ తయారు చేస్తారు, వాటిని కిరాణా షాప్ లోనూ, పెద్ద పెద్ద హోల్ సెల్ షాప్స్ లోనూ వేసి కమిషన్ తీసుకుంటూ ఉంటారు. అలా కిరాణా షాపుల్లో వేసేటప్పుడు మల్లేశం పరిచయం అయ్యాడు రాజేష్ కు. అతను కూడా మధ్యతరగతి కన్నా దిగువ స్థాయిలో ఉన్నవాడే, కొందర్ని చూసినప్పుడు, నాకెందుకు ఇలాంటి జీవితం దొరకదు, అని బాధ పడుతూ ఉంటాడు. అయితే రాజేష్, మల్లేష్ ల ఇద్దరి కోరికలు ఒకటే కావడం వల్ల, మాటలు కలిసి తొందరలోనే మంచి స్నేహితులు అయ్యారు.

ఇద్దరికీ కష్ట పడకుండా వచ్చే డబ్బు అంటే చాలా ఇష్టం. అందుకే రాబోయే కాలంలో ఎలా డబ్బులు సంపాదించాలి అని అందరూ పడుకున్న సమయంలో తమ ఫ్యాక్టరీలో మందు తాగుతూ ప్లాన్స్ వేసుకుంటూ ఉండేవారు. అలాంటి ఒక రోజు వాళ్ళు అర్ధరాత్రి మందు తాగుతున్న సమయంలో కాషాయ వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి రాజేష్ ఏయ్ ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇలా వచ్చావు? అంటూ ఆశ్చర్యంగా అడిగాడు మరి తలుపులు అన్ని వేసి ఉండగా అతను ఎలా వచ్చాడో అర్దం కాలేదు. మల్లేశం కూడా బిత్తర పోయి చూస్తున్నాడు.

నాయనా నేను అంతటా ఉంటాను. నాకు తెలియని దారి లేదు, తెలియని విషయం లేదు. నువ్వు బాధల్లో ఉన్నావు. డబ్బు కోసం ఎదురు చూస్తున్నావు. నీ అదృష్టం బాగుంది నీ దగ్గరే కోట్ల డబ్బు పెట్టుకుని డబ్బు కోసం చింతిస్తున్నావా? అంటూ చిద్విలాసంగా నవ్వాడు. ఏంటి నా దగ్గరే ఉందా? నీకు ఏమైనా పిచ్చా? నా దగ్గర డబ్బు ఉంటే ఏది? ఎక్కడుంది? అంటూ చిరాకుగా మొహం పెట్టాడు రాజేష్.

ఇవ్వన్నీ అతనికి తెలియవు నమ్మకం కూడా లేదు. ఎవడో పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ, మల్లేశం ఆ మాటలు వినగానే అయ్యా క్షమించండి. మా వాడికి ఏమి తెలియదు మీరు ఇలా కూర్చోండి అంటూ తన కుర్చీని దులిపి అతని ముందుకు జరిపాడు. ఏ మల్లి ఏంటి ఇది? వాడేదొ వాగితే ఉంటే నువ్వు కూడా అలాగే అంటావు అనగానే, అబ్బా నువ్వు కాస్త నోరు తగ్గించు అతనేం చెప్తాడో విందాం ముందు అంటూ రాజేష్ నోరు మూయించాడు. ఏంటో వీడిగోల అనుకుంటూ గ్లాస్ తీసుకుని కుర్చీలో కూర్చున్నాడు..

ఇక, మల్లేశం ఇప్పుడు చెప్పండి స్వామి అంటూ అడిగేసరికి అతను కళ్ళు తెరిచి నాయనా, నా మాటలు మీకు నమ్మకం కలగనప్పుడు ఏం చెప్పినా వృథానే అవుతుంది అన్నాడు. కానీ, మల్లేశం అయ్యా మా వాడు తెలియక నోరు జారాడు. దయచేసి మనసులో పెట్టుకోకుండా చెప్పండి స్వామి, మా మీద కాస్త దయ చూపండి అంటూ చేతులు కట్టుకున్నాడు. దానికి, స్వామి సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా విను, ఇక్కడికి ముప్పై గజాల దూరంలో ఒక వినాయకుడి గుడి ఉంది. మీరు ముందుగా అక్కడ పూజలు చేయాలి. ఆ తర్వాత, ఇదిగో ఈ ఫ్యాక్టరీలో ముప్ఫై గజాల లోతులో తవ్వండి. మీకు అదృష్టం వరిస్తుంది అన్నాడు.

రాజేశం నవ్వుతూ, ఏమిటి తవ్వితే ఏం వస్తుంది అంటూ ఆత్రంగా అడిగాడు. ముందు నమ్మకంతో తవ్వు నాయనా, ఏం వస్తుందో నీకే అర్దం అవుతుంది అంటూ లేచి నిలబడ్డాడు స్వామి. ఆయ్యా మరి ఆ పూజలు అవి మాకు తెలియదు, ఇప్పుడు మీరు వెళ్తే మేమెలా చేస్తామో మీరు కూడా మాతో పాటు ఉంటే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడు మల్లేష్. సరే నాయన మీరు ప్రొద్దున్నే శుచిగా స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులు ధరించి గుడికి వెళ్ళండి, అక్కడికి నేను వస్తాను, మితో పూజలు చేయిస్తాను అంటూ వెళ్లిపోయాడు ఆ స్వామి.

అతను వెళ్ళాక రాజేష్, మల్లేష్ తో ఎంటి మల్లి అతను ఏదేదో చెప్తే నువ్వు నమ్ముతున్నావే! ఇలాంటి పనులు మనకు వద్దురా నాకు ఇవన్నీ నమ్మకం లేదు, నేను అసలే నమ్మను అన్నాడు రాజేశం. అది కాదు రాజేశం ఇలాంటివి నిజంగా ఉంటాయి. నాకు నమ్మకం ఉంది. పోయేది ఏం ఉంది చెప్పు. ఇందులో ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. రాలేదు అనుకో లైట్ తీసుకుందాం. వస్తే ఇద్దరం పంచుకుని మామూలుగా ఉందాం. పోయేది ఏమీ లేదు కదా! ఇందులో భయం కూడా ఏమీ లేదు. రేపు ఎలాగో సెలవ్ కదా మనం తవ్వుధం అనగానే మరి మన వల్ల అవుతుందా అన్నాడు రాజేష్. మన వల్ల కాకపోతే ఇంకో నలుగురిని తెస్తే వాళ్లకు డబ్బు ఇవ్వాలి కాబట్టి మనమే చేసుకుందాం అన్నాడు మల్లేష్.

Labour at work - Free Image by Suraj on PixaHive.com

అతను అంత బలంగా చెప్తుంటే రాజేష్ కు కూడా నమ్మకం కలగసాగింది. ఎవరో వ్యక్తి ఇలా సడెన్గా రావడం ఏమిటి? తన దగ్గర కోట్లు ఉన్నాయి అని చెప్పడం ఏమిటి అనుకుంటూ ఏదైతే అది అవుతుంది మల్లేశం అన్నట్టు ప్రయత్నించి చూద్దాం అనుకుంటూ సరేలే నీ ఇష్టం అనగానే సంతోషంగా అది చాలు నువ్వే చూస్తావు కదా అన్నాడు మల్లేశం. తెల్లారి అరు గంటలకే గుడి దగ్గర కలుద్దాం అని అనుకుంటూ ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. 

తెల్లారి ప్రొద్దున్నే ఇద్దరు గుడికి వచ్చారు అంతకు ముందే అక్కడికి స్వామీ వచ్చారు. వారితో పూజలు చేయించి కొన్ని సామానులు తెప్పించారు. నిమ్మకాయలు, కొబ్బరి కాయలు, లాంటివి తెప్పించిన తర్వాత అందరూ తిరిగి కంపెనీకి వచ్చారు. ఇక ముగ్గురు అక్కడ శుభ్రం చేసి ముగ్గులు వేసి, స్వామి పూజ చేయడం మొదలు పెట్టాడు. పూజ దాదాపు మూడు గంటలు సాగింది ఇక రాజేష్ కు ఆకలి వేయడం మొదలయ్యింది. అసలే షుగర్ పేషంట్ కావడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గడం మొదలైంది. కానీ, స్వామి గారు ఎలాంటి ఆహారం తీసుకోకండి అని చెప్పడం వల్ల వాళ్ళు ఏమీ తినలేదు.

ఇక అది చూసి మల్లేశం స్వామి దగ్గరికి వెళ్లి అయ్యా మా వాడికి షుగర్ లెవెల్ పడిపోతుంది. ఏదైనా తినమంటారా అని అడగడంతో స్వామి కళ్ళు తెరిచి చూసి అలాగే అంటూ తల ఉపడంతో టిఫిన్స్ తెప్పించుకుని తిన్నారు. అప్పుడు కాస్త నిదనించింది రాజేశం ఆకలి. ఇక మళ్లీ పూజ మొదలైంది. అలా సాయంత్రం వరకు పూజ అయ్యాక స్వామి ఒకసారి కళ్ళు తెరిచి చూసి, నాయన ఇక్కడ మీరు తవ్వాలి అంటే ముఫ్పై వేలు పెట్టాలి దాని వల్ల ధన ఆకర్షణ కలిగి బంగారం పైకి వస్తుంది అనగానే ఇద్దరు మొహాలు చూసుకున్నారు. మల్లేశం రాజేశంతో నా దగ్గర అంత లేదు అన్నాడు ఇక రాజేశం ఆప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి బీరువాలో దాచిన డబ్బును తీసుకుని వచ్చాడు నమ్మకంతో డబ్బు తేగానే మళ్లీ పూజ మొదలైంది..

అలా రాత్రి పన్నెండు వరకు పూజ జరిగాక స్వామి కళ్ళు తెరిచి ఇక్కడ తవ్వండి అంటూ చెప్పాడు. దాంతో ఇద్దరు తవ్వడం మొదలు పెట్టారు అలా ముప్పై గజాలు తవ్వేసరికి వారికి నీరసం వచ్చేసింది. పొద్దటి నుండి ఆహారం లేక పోవడం, నిలబడి ఉండడం బలంగా తవ్వడంతో చాలా నీరసంగా అనిపించి కాసేపు అపారు. కానీ, మల్లేశం మాత్రం ఆశ గా తవ్వుతునే ఉన్నాడు. అలా ముప్పై గజాలు తవ్వితే వారికి కొన్ని కడ్డీలు తగిలాయి. అవి కళ్ళుమంటూ చప్పుడు చేయడంతో ఆనందం పట్టలేక గట్టిగా అరిచి వాటిని తీసుకుని బయట వెలుగులో చూసే సరికి, అవి ఇనుప కడ్డీలు. బంగారం కడ్డీలు కావు.

One man is digging into the turtle's nest to get at the … free public domain image | Look and Learn

దాంతో, ఇద్దరి మొహాలు పాలిపోయాయి. ఆనందం ఆవిరి అయ్యింది. స్వామిని అడగాలని ఇద్దరు కష్టం పడి పైకి వచ్చేసరికి అక్కడ స్వామి లేడు, డబ్బు లేదు, ఫ్యాక్టరీలో ఉండే విలువైన వస్తువులు కూడా లేవు. దాంతో, వారికి అర్దం అయ్యింది తాము మోస పోయామని, ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చారు. ఫ్యాక్టరీ తలుపులు తీసి ఉండడంతో, లోపలికి వచ్చి చూసి ఏంటి ఇది అంటూ అడిగారు. అయితే ఫ్యాక్టరీ లో చప్పుడు విని చుట్టూ ప్రకల జనాలు పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చారు అని తెలుసు. ఇద్దరూ మొత్తం విషయం అంతా వివరించారు.

అప్పుడు పోలీసులు రాజేష్ తో కష్టపడకుండా ఏది రాదు అని తెలియదా మీకు, వాడెవడో కాకమ్మ కబుర్లు చెప్తే నమ్ముతారా అంటూ చివాట్లు పెట్టి, వారికి కొంత ఫైన్ వేసి రెండు రోజులు లాకప్ లో ఉంచి ఇంటికి పంపించారు. మల్లేషం కూడా రాజేష్ తో నాది తప్ప, నన్ను క్షమించి వదిలెయ్యండి అన్నాడు. ఇక భర్త ఇలా చేయడంతో రాజేష్ భార్య పరువు అంతా పోయిందని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు రాజేష్ భార్యను బ్రతిమాలాడుతూ రమ్మని పిలుస్తున్నాడు. రాజేష్ కు ఇప్పుడు డబ్బు తేలికగా రాదని కష్టపడితేనే వస్తుందనే విషయం చాలా బాగా అర్దం అయ్యింది.

 

– కిరణ్ 

Related Posts

1 Comment

  1. అత్యాశకు పోతే ఉన్నవి పోతాయి అని కధలో చెప్పారు.
    మంచి నీతి.

Comments are closed.