కృష్ణాష్టమి శుభాకాంక్షలు

కృష్ణాష్టమి శుభాకాంక్షలు

నమస్తే నా పేరు నర్మద. నా జీవితంలో గోపాలుడు లేడు కానీ, చిలిపి దొంగతనాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మితో పంచుకోవాలని ఇలా వచ్చాను. దొంగతనం అనగానే పెద్ద పెద్ద నగలు, డబ్బులే కాదు చిన్న చిన్నవి కూడా దొంగిలించడం కూడా దొంగతనము అవుతుంది.

మా బామ్మ గారు ఒకరు ఉండేవారు నా చిన్న తనంలో ఉమ్మడి కుటుంబం కాబట్టి, చాలా మంది ఉండేవారు. ఇంట్లో అయితే మాకెప్పుడూ చిరుతిళ్ళు కావాలి అని బామ్మ ఏదో ఒకటి చేసేది. కానీ, అవి అయ్యేవరకు ఒక్కటి కూడా ఎవరికీ ఇచ్చేది కాదు. అన్ని అయ్యాక దేవుడికి నైవేద్యం పెట్టే ఇచ్చేది.

మరి నాకేమో అవి పొయ్యి మీద వుండగానే తినాలని అనిపించేది. కానీ, ఎప్పుడు అడిగినా ఇచ్చేది కాదు అలా ఇవ్వడం మంచిది కాదు అని ఒంటికి పట్టవు అని చెప్పేది. అదే నాకు నచ్చేది కాదు. అందుకే ఎలాగైనా వాటిని తీసుకుని తినాలని మిగిలిన వారికి నా గొప్ప చూపించాలని అనుకునేదాన్ని.

ఒక రోజు బామ్మ అలా బోబట్లు చేస్తుంటే, కమ్మని నెయ్యి వాసన రాగానే వేడి వేడి గా తినాలని అనిపించింది. కానీ, బామ్మ ఇవ్వదు ఎలా అని ఆలోచించాను. బామ్మ దగ్గర ఎప్పుడూ ఆకు వక్క ఉన్న పాన్ దాన్ ఉండేది. అది లేకపోతే బామ్మ బండి నడిచేది కాదు. దాన్ని కనిపించకుండా చేస్తే బామ్మ పొయ్యి దగ్గర నుండి వెళ్ళిపోతుంది వెతకడానికి కాబట్టి మెల్లిగా బామ్మ లేని సమయంలో దాన్ని తీసి మేము ఉండే ప్లేస్ లో అంటే పిల్లల అర్రలో ఉన్న సందూకలో దాచాను. తర్వాత ఏమీ తెలియని దానిలా ఆటలోకి వెళ్ళాను.

పాపం బామ్మ దాని కోసం వెతుకుతూ వెళ్ళగానే నేను వెళ్లి బోబట్ల దొంతర లాగేసుకుని వచ్చేశా, ఇంటి వెనకాల ఉన్న మామిడి తోటలోకి వెళ్ళి, ఆబగా వేడి వేడిగా ఉండగనే లగించేసా, చిన్న పిల్లను కాబట్టి నా చేతికి ఆరు ఏడో వచ్చాయి.

కృష్ణాష్టమి శుభాకాంక్షలు

                                                    కృష్ణాష్టమి శుభాకాంక్షలు

అవన్నీ నేనే తినేశాను. అంతా చాలా చాలా బాగున్నాయి. దట్టంగా వేసిన నెయ్యి, బెల్లం, శక్కరితో చాలా రుచిగా అనిపించాయి. అందుకే ఎవరికీ ఇవ్వకుండానే అన్ని గబగబా తినేసాను. తిన్న తరువాత అందరూ గుర్తుకు వచ్చి మళ్ళీ వాళ్ళ కోసం తీసుకుని రావాలని వెళ్ళాను. కానీ, అప్పటికే బామ్మ అక్కడ ఉండడం చూసి మెల్లిగా జారుకున్నాను.

ఆ రోజు రాత్రి ఇక మొదలు అయ్యింది నాకు కడుపు నొప్పి. ఒకటే నొప్పి గిలగిల లాడాను, అది చూసి నాన్న బామ్మ దగ్గరికి తీసుకుని వెళ్లారు. బామ్మ చిట్కా వైద్యం చేయడంలో మంచి పనిమంతురాలు లేండి… ఇక నన్ను చూసిన బామ్మ ఎంటే మనవరాలా? నా పాన్ దాన్ దాచి పెట్టి మరీ తిన్నావ్ కదా… బొబ్బట్లు బాగున్నాయా? నొప్పి కూడా అదిరిపోయింది కదా అంటూ నవ్వేసింది.

నాకు తల గిర్రున తిరిగింది. అంటే, బామ్మకు నా దొంగతనం తెలిసిపోయింది అని దాంతో తల దించుకున్నా.. విషయం ఎంటి అని అన్నారు నాన్న గారు. దాంతో బామ్మ చెప్పేసింది. అది తెలిసి నాన్నగారు అలా చేయకూడదు తల్లి, పెద్దలు ఏది చెప్పినా నీ మంచికే కదా అంటూ మందలిస్తే, బాగుంది రా అసలే నొప్పితో ఉన్న పిల్లను మందలిస్తావా? అంటూ, పర్లేదమ్మా, రుచిగా ఉందని ఏది ఎక్కువ తినకూడదు అంటూ ఏదో మందు నూరి తేనెతో నాలిక పై రాసింది బామ్మ, కాసేపటికి కడుపు నొప్పి మాయం అయ్యింది విచిత్రంగా…

నేను బామ్మను బాధ పెట్టినా, నా కడుపు నొప్పి లేకుండా చేయడంతో నాకు బామ్మ అంటే ఇష్టం పెరిగి పోయింది. ఈ విషయం అందరికీ తెలిసి నన్ను ఆట పట్టించారు. నా పేరు బొబ్బట్ల నర్మద అంటూ పిలిచే వారు. ఇప్పటికీ అదే పేరు అనుకోండి… అప్పటి నుండి బామ్మ చెప్పేవి అన్ని వినేదాన్ని, తను పోయాక తన అడుగు జాడల్లో నడిచాను. ఇప్పుడూ నా పిల్లలకు అదే విషయాన్ని చెప్తూ ఉంటాను…

– నర్మద

Related Posts