కుక్క బతుకు పార్ట్ 2

కుక్క బతుకు పార్ట్ 2

అయ్యో అమ్మో ఈ బాధ భరించలేను, నాకే ఇది రావాలా? అయ్యో రామా నాకే ఎందుకు ఇలా జరగాలి, దేవుడా నన్ను బ్రతకనివ్వు, బతికే దారి చూపు, అమ్మో అయ్యో అదేంటి నా పైకే వస్తుంది.

అయ్యో నా కళ్ళు కూడా కనిపించడం లేదే, అమ్మో ఎంత ప్రమాదం తప్పింది కస్తయితే లారి నన్ను తినేసేది, దేవుడా నువ్వు ఉన్నావయ్య నన్ను ప్రాణాలతో నిలబెట్టావు.

అదే చేత్తో ఇంకా కాస్త దయ చూపయ్యా, ఈ ప్రాణాలు నిలుపుకోవాలి అంటే కాసిన్ని మెతుకులు దొరికేలా చెయ్యి…

ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా ఇప్పుడు బాధ పడుతున్నా, అయ్యో ఉన్నప్పుడు తినలేక పోయాను. పెట్టిన చేతిని విదిలించి ఉంటాను .

అందుకే నాకిప్పుడు ఇలా అవుతుంది. హే భగవాన్ నన్ను కాపాడు. అయ్యో ఎవరూ లేరెంటి… రోడ్ల పై ఎప్పుడూ గుంపులు గుంపులుగా ఉండే జనాలు ఒక్కరూ కూడా కనిపించడం లేదు.

అయ్యో ఎంతో రద్దీగా ఉండే దారులన్నీ మూసేశారు. ఇంత నిర్మానుష్యంగా ఉందెంటి? భగవాన్ తిరిగి తిరిగి కాళ్ళు లాగుతున్నాయి.

అయ్యో ఎవరన్నా ఉంటే ఎంత బాగుండేది. కాసిన్ని మెతుకులు అయినా దొరికేవి. అదిగో అక్కడ ఏదో ఇల్లు కనిపిస్తుంది అక్కడికి వెళ్తే ఎవరన్నా ఏదైనా పెడతారెమో చూద్దాం.

అయ్యో అదేంటి రోడ్లు ముసినట్టు ఈ ఇంటి గేట్లు కూడా మూసేశారు ఏంటో ఎవరు బయట కనిపించడం లేదు. అయ్యో ఎవరు రావడం లేదు. శక్తి లేకపోయినా వాళ్లను పిలుద్దం..

అమ్మా అమ్మా అమ్మా అయ్యో ఇంత అరిచినా ఒక్కరూ రారేంటి…. అమ్మో అయ్యో నా శక్తి అంతా పోతుంది. నీరసంగా ఉంది. సొమ్మసిల్లి పడిపోతానేమో, ఆకలితో పేగులు అరుస్తున్నాయి.

అమ్మో ఇక నడవ లేకుండా ఉన్నాను. ఎంత దూరం వెళ్ళినా, కనుచూపు మేరలో ఒక్క పిట్ట పురుగు కనిపించడం లేదు.

ఆ నేను రోజు వెళ్ళే చాయి దుకాణం ఉందేమో అది ప్రతిరోజూ తీస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్తే అయినా ఏదైనా దొరుకుతుంది ఏమో అక్కడికి వెళ్తా…

అయ్యో అయ్యో రామా ఇది కూడా మూసే ఉంది. అందరికీ ఏమయ్యింది. అక్కడక్కడ పోలీసులు మాత్రం కనిపిస్తున్నారు. కానీ వారి దగ్గర కూడా ఏమీ లేనట్టు ఉన్నాయి.

పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. వాళ్ళు అయినా తిండి నీళ్ళు లేక ఉన్నట్టు ఉన్నారు. మొహాలు అన్ని వడలి పోయాయి. పాపం వాళ్లకు ఆకలి అవుతున్నట్టు ఉంది. వాళ్ళు మాత్రం ఏమీ చేయగలరు.

అయినా ఎన్నడూ లేని విధంగా ఇలా జనాలు అందరూ ఏం పట్టనట్టు ఇళ్లలో ఉన్నరేమిటో… ఎప్పుడూ ఏదో పనున్నట్టూ హడావుడి పడుతూ తిరిగే జనాలు.

కుక్క బతుకు పార్ట్ 2
                                                                                                  కుక్క బతుకు పార్ట్ 2

రోడ్ల పై ఖాళీ లేకుండా ఒకరినొకరు తోసుకుంటూ, చెత్తా చెదారం పక్కనే ఉన్నా. పాని పూరీలు తింటూ ఒకర్ని ఒకరు తోసుకుంటూ, జనాల్లో ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఫోను చూసుకుంటూ తమలో తామే నవ్వుకుంటూ వెళ్ళే జనాలు.

నోట్లో గుట్కాలు వేసుకుని ఎవరి పైన పడుతుందో కూడా చూడకుండా ఉమ్మేసే జనాలు తిరుగుతూ ఉండే రద్దీ ప్రదేశాలు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే నేను ప్రాణాలతో ఉండగలనా అనిపిస్తుంది.

నా ఈ చిన్ని బొజ్జలోకి నాలుగు మెతుకులు దొరికి, నా ప్రాణాలు నిలబడితే చాలు.. అయ్యో ఇంత దూరం వచ్చినా ఒక్కటంటే ఒక్క కవరు కానీ పాచిపోయిన సమోసా కానీ, విసిరేసిన పిజ్జా కానీ దొరకడం లేదు.

అయ్యో నా ఈ చిన్ని ప్రాణానికి బుక్కెడు బువ్వ కూడా కరువై పోయిందా ఈ లోకంలో… హు అవును మనుషులే కానీ మనుషులు ఉన్న ఈ లోకం లో నాకు బుక్కెడు బువ్వ దొరకడం లేదు… ఇదేదో కలియుగం అంతం లాగా ఉంది.

అవును అంతం అంటే గుర్తొచ్చింది. కలియుగ అంతం అవ్వడానికి కారణం ఇదేదో పెద్ద రోగం వచ్చినట్టు ఉంది. అందుకే అందరూ ఇళ్లలో కూర్చుని ఉన్నారు.

లేదంటే ఇలా ఉండేవాళ్ళా ఏమిటి.. నిజంగానే కలియుగం అంతం అవుతుందా. హా అయితే అవ్వని అందరితో పాటు నేను పోతాను కానీ ఇలా ఆకలితో చావడం కంటే అదే నయం కదా.

అయ్యో ఆకలి అంటే గుర్తొచ్చింది. ఇంతకీ నాకు అన్నం ఎక్కడ దొరకాలి. ఆ అవును ఏదో కారు వస్తుంది ఏంటది అదిగో ఎవరో దిగుతున్నారు. ఏదో తీస్తున్నారు ఏంటది నన్నే పిలుస్తున్నారు.

ఓహో ఏమీ నా భాగ్యం అబ్బా పంచభక్ష పరమాన్నాలు తెచ్చినట్టు ఉన్నారు. అయ్యో అవి లేకపోయినా కనీసం నాలుగు బిస్కెట్ ముక్కలు అయినా చాలు.

అమ్మో పెద్ద గుంపే చేరిందే అయ్యో నాకు దొరికేలా లేదు తొందరగా వెళ్లాలి గుంపుగా ముగారు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారో, నాకు దొరుకుతుందో లేదో అయ్యో హే జరగండి అయ్యో నా నోట్లోకి వెళ్లాల్సిన ముద్ద లాగేస్తున్నాయి.

జై భీమ్ జై హనుమాన్ నాకు దొరకాలి అరేయ్ జరగండి రా నా పిచ్చి బలం ముందు మీరెంత… హేయ్ హమ్మయ్య దొరికింది దొరికింది. హమ్మ రెండు రోజులుగా పిడికెడు అన్నం కోసం చూశాను.

అబ్బా వేడి వేడి గా బాగుంది నాకు బాగా నచ్చింది. ఆహా నా కడుపు నిండి పోయింది. బాగానే తెచ్చి పెట్టారు. అయినా తేకుండా ఎలా ఉంటారులే మనం అంటే అంత భయం మరి. మనకు పెట్టకుండా వాళ్ళు ఎలా తింటారులే ఇక రోజూ తెస్తాము అంటూ చెప్పారు.

అయినా వీళ్ళ సొమ్ము పోయినట్టు ఒక ముద్ద వేశారు. కనీసం ఏ చికెన్ ముక్కో, ఏ మటన్ ముక్కొ పెడితే వీళ్ళ సొమ్మేమైనా పోతుందా ఏమిటి ఏ బిర్యానీ నో ఏ పిజ్జానో తెచ్చి పెట్టొచ్చు కదా.. వాళ్లకు తినడానికే సరిపోదు ఇంకెక్కడ పెడతారు.

వీళ్ళ స్వార్థానికి లెక్కే లేదు. అయినా బిర్యానీ పెడితే ఎంత బాగుండు అబ్బా ఎన్నాళ్ళు అయ్యింది తిని రేపైనా బిర్యానీ తెస్తే ఎంతో బాగుండేది. తేస్తారేమో చూడాలి.

ఏది ఏమైనా ఈరోజుకి కడుపు నిండింది. మళ్ళీ రాత్రికి ఎవరైనా పెడతారో లేదో.. పెట్టక పోతే నేనేంటో చూపిస్తా వీళ్లకు అసలు నేనంటే లెక్కే లేదు.

అనుకుంటూ చెట్టు కింద నీడలోకి వెళ్ళి తోకలు ఊపుతూ వెళ్లి పడుకుంది. ఆకలితో అలమటించే తనకి ఆ కాస్త అయినా దొరికిందని సంతోషపడని ఆ బుద్ది మారని కుక్క … 

-భవ్య చారు

Related Posts

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *