కుక్క బతుకు పార్ట్ 3

కుక్క బతుకు పార్ట్ 3

తూ నా బతుకు, ఎన్నాళ్ళు ఇలా బతకాలి నాకు చావు అయినా రాదే, అది వచ్చినా బాగుండు , అందరిలో అయ్యో అనే జాలి అయినా ఉండేది. నాలుగు రోజులు నా గురించి మాట్లాడుకునే వారు. ఆ విధంగా అయినా అందరి నోట్లో నానే దాన్ని.

ఎంత సేపూ యీ మురికి గుంటల మధ్య బతుకు ఈడుస్తూ, ఈ కంపులో ఉంటూ ఇక్కడ దొరికే నాలుగు మెతుకులు తింటూ అర్ధాకలి తో బతికే ఈ బతుకు ఒక బతుకెనా, నా ఖర్మ కొద్ది ఇక్కడ పుట్టాను.

కనీసం మంచి స్థితిలో ఉన్న వారింట్లో పుట్టినా బాగుండేది. అక్కడ ఎంతో కొంత మంచి తిండి అయినా దొరికేది. ఇలా అర్ధాకలితో ఉండే స్థితి రాక పోయేది.

హా అమ్మా, అబ్బా ఆకలి చంపుతుంది. అదిగో మటన్ ముక్క అబ్బా ఇది అయినా దొరికింది. నాకు ఈ మాత్రం అయినా దొరికింది.

అదిగో దానికి అది కూడా దొరకనట్టు ఉంది. పాపం దానికి కొంచం పెట్టన్నా అమ్మో వద్దు లే, నాకు దొరికిందే తక్కువ .

ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనుకునే రాజకీయ నాయకుణ్ణి కాదు కదా, పంచుకుంటే ఆనందం ఉంటుంది కానీ ఉన్న దాంట్లో దానికి ఇస్తే నేను ఆకలి తో ఉండాల్సి వస్తుంది.

దానికి ఎక్కడో ఒక చోట దొరుకుతుందిలే మనం తినేద్దాం. హమ్మయ్య ఈ పూటకి ఇలా జరిగిపోయింది. వెళ్లి కాసేపు ఒక కునుకు తీసి మళ్ళీ మధ్యాహ్నం గురించి ఆలోచించాలి.

అరే అదేంటి పెద్ద పడవ లాంటి కారు వస్తుంది. అబ్బో చాలా పెద్దగా ఉంది. తెల్లని తెలుపు తో ఎంతో బాగుంది. హా అందులోంచి ఏదో బయటకు చూస్తుంది ఏమిటి.. అరే నాలాగే ఉంది. అచ్చు నాలాగే ఉంది.

కానీ నేను ఇక్కడ ఉన్నాను. అది కారులో ఉంది. అబ్బా ఎంత మెరిసిపోతుంది. ఎంత ముద్దుగా బొద్దుగా ఉందో.. ఏం తింటుందో అంత బొద్దుగా ఉండడానికి వెళ్లి అడుగుతా..

అబ్బా పలకరిస్తే పలకదు ఏంటి ఎంత పోగరే నీకు నాలాంటి వాడితో నువ్వెందుకు మాట్లాడుతావు. వయసులో ఉన్నావు. పొగరు బాగానే ఉందిలే…

కానీ మాట్లాడకు నేను అడిగే వాటికి సమాధానం మాత్రం చెప్పు సరేనా, హమ్మయ్య చెప్తావా సరే గానీ ఇంత అందంగా ముద్దుగా బొద్దుగా ఉన్నావు ఏం తింటావే రోజు ..

ఏమిటేమిటి పొద్దున్నే బాదంపాలు తాగుతావా, నిన్ను నీ యజమాని వాకింగ్ కి తెచ్చాడా? తర్వాత ఏం తింటావు అబ్బో బిర్యానీ నా, మటన్, చికెన్ కానీ పెడతారా?

అహ సాయంత్రాలు మళ్లీ వాకింగ్ కి తీసుకుని వెళ్తారా, రోజూ స్నానం చేయిస్తారా, అబ్బో ఏంటి నీ పడక కూడా వేరే గా ఉంటుందా, అహా ఓహో ఏం రాజ భోగం అనుభవిస్తున్నావే..

బాగా ముద్దు చేస్తారా, వాళ్ళ ఒళ్ళో పడుకుంటావా, అబ్బో ఏంటి వాళ్ళ అమ్మాయి నిన్ను ముద్దులు కూడా పెట్టుకుంటుందా అబ్బా ఎంత అదృష్టం నీది .

అంతటి అదృష్టం నాకు అయినా రాలేదు. ఎంత సేపు ఈ కంపులో బతకాలి . అబ్బా ఏం బతుకే నీది దేనికైనా పెట్టీ పుట్టాలి.

ఏంటి అబ్బా అహ నువ్వు అనేది నీ జాతి మంచిదా, నా జాతి చెడ్డదా ఏంటే బాగా నీలుగుతున్నవు హిందూ, ముస్లింలు గొడవ పడ్డట్టు నువ్వు గొడవకు వస్తావా ఏంటి?

ఒక్కసారి మా వాళ్ళు అంతా కుమ్మక్కు అయితే నువ్వు ఎక్కడ ఉంటావో ఆలోచించుకో, మేమంతా నిన్ను నడి బజార్లో నిలబెట్టగలం. ఎలాంటి హంగులూ లేకుండా చేయగలం.

కాని మా సమస్యలతో సతమతమవుతూ నీ గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఒక్కసారి గనక మేమే ఆలోచించడం మొదలు పెడితే నువ్వు అనే దానివి ఉండవు, గుర్తు పెట్టుకో … 

వాళ్లకు అంటే తెలివి లేక అలా అనుకుంటారు. గొడవలు పడతారు. నీకెం అయ్యిందే తెలివి లేదా అంతా ఒకటే నిన్ను కోసినా రక్తమే వస్తుంది. నన్ను కోసినా రక్తమే వస్తుంది.

తేడా మనలో లేదు, మనుషుల్లో ఉంది. చాలులే నువ్వు మనిషిలాగే మాట్లాడుతున్నావు. ఎంతైనా మనుషులతో సహాజీవనం చేస్తున్నావు కదా.. నీ ఆలోచనలు అలాగే ఉంటాయి.

నాలాగా అందర్నీ సమానంగా చూస్తే ఎలాంటి గొడవలు ఉండవు. అయినా నాకన్నా మంచిగా బ్రతుకుతున్నావు.

కనీసం నువ్వు వారిలాగా మారకుండా నీలాగే ఉండు. బతుకు అంటే నీదే ఎన్ని సౌకర్యాలు, ఎన్ని రకాల తిండ్లు, ఎంత రాజ భోగం అహో అనిపిస్తుంది.

సరే అదిగో మీ యజమాని వస్తున్నట్టు ఉన్నాడు. కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఇన్ని రాజ భోగాలను అనుభవిస్తున్న అని మిడిసి పడకు.

ఎంత కాలం మిడిసి పడినా ఎప్పుడో ఒకప్పుడు దిగిపోయే రాజకీయ నాయకుడు లాగా నువ్వు ఏదో ఒక రోజు బయటకు వెళ్లాల్సిన దానివే…

కాబట్టి ఉన్నని రోజులూ నీ యజమాని చెప్పినట్టు విను. అంతే కానీ ఓటర్లు ఏం చెప్పినా వింటారు అని వీర్ర విగే రాజకీయ నాయకుడిలాగా చేయకు, గొర్రెలా బతుకకు, సరేనా..

హా అది నాకు తెలుసు, నువ్వు నా మాటలు వింటావు అని జనాలకు నచ్చేలా ఉండాలి. కానీ నేనే తోపు అంటే మక్కెలు ఇరిగెలా బుద్ది చెప్తారని నువ్వు అయినా గుర్తుంచుకో.. ఉంటాను ఇక టాటా బై బై ..

ఏదైనా దాని బతుకే బతుకు. మనకు ఆరోజు ఎప్పుడు వస్తుందో అనుకుంటూ పెట్రోల్ బంక్ లోని ఒక మూలకు వెళ్ళి నీడలో నిదురపోయింది…. రాజకీయాన్ని వంట బట్టించుకున్న ఆ రాజకీయ కుక్క..

– భవ్య చారు

Related Posts

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress