కుక్క బతుకు పార్ట్ 4

కుక్క బతుకు పార్ట్  4

పొద్దున ఒక మటన్ ముక్క దొరికింది కాబట్టి ఎలాగో ఇప్పటి వరకూ ఉండగలిగాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందో పన్నెండు దాటీ ఉంటుందా..

హా ఉండే ఉంటుంది లేకపోతే నా కడుపులో గొకదు కదా.. మళ్ళీ ఎక్కడ వెతుక్కోవాలో ఏమో కనీసం సగం కడుపైనా నిండుతుందో లేదో తెలియదు.

ఏ మహానుభావుడూ ఇంత దయ చూపించక పోతాడా, కనీసం ఒక ముద్ద అయినా వేయకపోతాడా, ఇంతగా ఎదురు చూస్తున్నా, ఒక్కరూ కూడా వేయకుండా పోతారా ఆ మాత్రం జాలి దయ అనేవి మనుషుల్లో కరువై పోయాయా…

అబ్బా ఇంకెంత దూరం నడవాలి.. అయ్యో ఆకలితో పేగులు లుంగ చుట్టుకు పోతున్నాయి. అరే అక్కడేదో బండి కనిపిస్తుంది.

అక్కడికి వెళ్తే అయినా కాస్త ముద్ద పెట్టక పోతారా, వెళ్లి చూద్దాం, అయ్యో అప్పుడే సర్ధేస్తున్నాడు. వెళ్ళి అడుగుతా.. హమ్మయ్య వేస్తున్నాడు.

అయ్యో చాలా ప్లేట్ లలో టిఫిన్స్ సగానికి సగం అలాగే ఉంచేసరు. హమ్మయ్య నా పంట పండినట్టే కడుపు నిండా తినొచ్చు.

అబ్బా ఎంత బాగున్నాయి టిఫిన్స్, ఏప్పుడూ పాచి పోయినవి తినే నాకు ఫ్రెష్ గా వండినవి దొరకడం అంటే అహ ఏమీ నా భాగ్యము.

అబ్బో అబ్బో ఎన్ని రకాలు ఉన్నాయి. తెల్లని రకం ఒకటి, గోధుమ రంగు లో ఒకటి, ఉబ్బిన్నట్టు ఉన్నవి కొన్ని, గుండ్రంగా ఉన్నవి ఒకటి, అబ్బో ఇన్నిన్ని రకాలు ఎవరూ పోటీకి రాక ముందే అన్ని నేనే తినాలి.

అబ్బబ్బా ఒక్కొక్కటి ఒక్కో రుచిగా ఉన్నాయి. హమ్మయ్య ఎవరూ పోటీకి రాలేదు. నా కడుపు నిండింది కానీ మళ్లీ మళ్ళీ దొరకదు కదా ఇలాంటి రుచికరమైన ఆహారం.

బాగా తినాలి పట్టక పోయినా తినాలి లేదా దాచుకోవాలి అవును ఎక్కడ దాచుకోవాలి. అరే అదేంటి అతనన్ని కవర్ లో వేస్తున్నాడు.

ఎవరికీ పెడతాడో ఏమో అయ్యో అన్ని తోసేస్తున్నాడు. అరే నేను దాచుకుందాం అనుకున్నానే, హా పోనిలే ఎంతయినా నా కడుపు నిండింది కదా అది చాలు నాకు..

అతను మిగిలినవి ఎవరికన్నా పెట్టుకొని నాకేంటి మనుషులు ఎవరికీ దానం చేయకుండా డబ్బులు దాచుకున్నట్టు నేను దాచుకోవాలి అనుకోవడం మంచిది కాదు.

వాళ్ళ తో మెలిగి వాళ్ళ బుద్దులే వస్తున్నాయి. అప్పుడు నాకు వాళ్లకు తేడా ఏమిటి.. ఛీ ఛీ వెధవ బుద్దులు.. అతనేం చేస్తున్నాడో చూద్దాం అరరే ఎవరికో ఇస్తున్నాడు.

ఎవరికీ ఆ ఆ మూలన ఉన్న ముసలవ్వకా అబ్బా ఇలాంటి మానవత్వం ఉన్న మనుషులు కూడా ఉన్నారు.

కానీ అతను అందరి ఎంగిలి కాకుండా మంచి ఆహారం ఆ ముసలవ్వకు పెడితే ఇంకా బాగుండేది. కాస్త పుణ్యం అయినా వచ్చేది. ఇలా ఒకరి ఎంగిలి కంచం లొది పెడితే పాపం తప్ప పుణ్యం ఏం వస్తుంది.

ఎంతైనా మనిషే కదా బుద్ధి ఎక్కడికి పోతుందిలే.. మానవత్వం అనుకున్నా చెత్త పారేస్తే డబ్బు కట్టాలని ఇలా ముసలవ్వకి పెడుతున్నాడు. అయినా వీళ్ళకు బుద్ది లేదు.

ఎక్కువ తినాలనే కోరికతో కడుపు నిండాక కూడా ఇంకా పట్టించాలని చూస్తారు. అందుకే ఎక్కువ పెట్టుకుని, ఎక్కువ వండుకుని తినకుండా బయట పారేస్తూ ఉంటారు.

అలా బయట పారేయకుండా ఎవరికన్నా పెడితే ఎంత బాగుంటుంది. అయినా ఇళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో రుచి. ఒక్కో వంటకం కావాలి. మరి ఇంట్లో వండినది అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు.

అవి కంపు వచ్చేదాకా తీసి చూడరు. ఎవరికీ కావాల్సింది వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు ఆ కంపు కొట్టిన ఆహారాన్ని తినలేక ఎప్పుడూ బయట పారేస్తూ ఉంటారు.

మా ఖర్మ కొద్ది తెలియని మేము అవన్నీ తిని కడుపు నొప్పితో బాధ పడతాము. అయినా అంత ఎక్కువ వండుకోవడం, ఆర్డర్ చేసుకున్న దాన్ని మొత్తం తినకుండా ఉండడం ఎందుకో, ఆహారం అంటే వీళ్ళకు విలువ లేకుండా పోతుంది.

డబ్బులు పెట్టీ కొన్న దాన్ని కూడా మొత్తం తినకుండా ఆ ఉడికి ఉడకని పిజ్జాలు బర్గర్లు తెచ్చుకుని తిని పారేస్తారు. తింటే కడుపు నిండిన వాడికి కనరు కనరు అంటారు ఇందుకేనేమో..

అసలు వీళ్ళకు అన్నం విలువ, ఆకలి విలువ తెలియవు. అందుకే ఇలా ఆహారాన్ని వండుకుని తినలేక బయట పార వేస్తారు. అలా బయట పారేసిన వాళ్లను నీళ్ళు, అన్నం దొరకని ఎడారిలో వెయ్యాలి.

అప్పుడు గానీ వాళ్లకు ఆహారం విలువ తెలియదు. తిన్నంత తిని బయట పారేసే వాళ్లను ఇక ముందు అలా పారేయకండి అంటూ చెట్టుకు కట్టేసి కొడితే కానీ వీళ్ళ బుద్దులు మారవు.

ఇంత సంపాదించి తినడానికే పుట్టినట్టు బిల్డప్ లు ఇస్తారు. కానీ మాలాంటి వాళ్లకు పెట్టడానికి మాత్రం చేతులు రావు. ఒకవేళ ఎవరైనా పెడుతున్నారని తెలిసినా వాళ్లను ఎంకరేజ్ చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు.

వీళ్ళ ఆకలికి, స్వార్థానికి అంతు లేకుండా పోతుంది. మా ఆకలి తీర్చిన వాడే మాకు దేవుడితో సమానం కానీ వీళ్ళు ఆకలి తీర్చరా అంటే నాకేం లాభం అని చూస్తారు తప్ప చేతులు విదల్చరు.

ఒక వేళ వాళ్ళు అన్నం పెట్టారు అంటే వారికి ఎంతో కొంత లాభం ఉంటేనే పెడతారు. అన్నదానాలు చేస్తారు. ఫోన్ లలో లైక్ ల కోసమో డబ్బుల కోసము చేస్తారు తప్ప జాలి దయతో కాదు.

ఇంకొందరు ఉంటారు వాళ్ళు మా లాంటి వాళ్ళ పేరు చెప్పి డబ్బులు బొక్కుతారు తప్ప మాకు అసలు పెట్టరు. ఏదో మొదటి రోజు మాత్రం హడావుడి, హంగామా చేసి, ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు.

ఇక రెండో రోజు నుండి తప్పించుకు తిరుగుతారు. అందరి నుండి చందాలు వసూలు చేసి తమ ఖజానా నింపుకుంటారు.. మనుషులు ఇలా చేయకపోతే ఆశ్చర్య పోవాలి కానీ చేస్తే ఎందుకు ఆశ్చర్యం..

హా ఇంతే జనాలు తమ వరకు వస్తె కానీ ఏది తెలియదు..అనుకుంటూ నీడలో పడుకుంది అన్ని తెలిసిన అనుభవమున్న ఆ కుక్క….

-భవ్య చారు

Related Posts

1 Comment

  1. చాలా బాగుంది. మానవ నైజం వివరిస్తూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *