లంచగొండితనం (అవినీతి)

లంచగొండితనం (అవినీతి)

1) లంచమిచ్చుకుంటె లక్షణంబుగ పోస్టు
   వచ్చి తీరుతుంది నచ్చినట్లు
   ప్రతిభ గలిగి యున్న పనికి రాడు బీద
   నెహ్రూ కలలుగన్న నేలయందు

2) బడుగు జీవులెన్ని బలియైన సర్కారు
   సొమ్ముకమ్ముడయ్యి కొమ్ముకాయు
   లంచమిచ్చుకుంటె మంచియౌ దోషాలు
   కేసువీగిపోవు కాసువలన

3) వంద మార్కులొచ్చి వాజమ్మగా నిలిచె
   సగము మార్కులొచ్చిచవట గెలిచె
   ప్రతిభ ఉన్నవాన్ని పట్టిచంపుచునుండె
   లంచమివ్వకుంటె వంచనాయె

4) అర్థమందు ఆశ అన్నివిధాలుగా
   నరుని పాతరేసి నష్టపరచు
   లంచగొండితనము లాంచనమయ్యేను
   కవుల గోసగాదు కంఠశోష

5) ఏ ప్రభుత్వమైన నెంతకాలముండు
   అంతమగు నధర్మ మధికమైన
   ప్రజలు ఎదురుతిరిగి పట్టుబట్టిననాడు
   ఘడియలోన రాజు గద్దెదిగును

– కోట

Related Posts