లవ్ జిహాదీ

లవ్ జిహాదీ

 

గాయత్రి, కిరణ్ కుమార్ దంపతులకు ఒక్కగానొక్క కూతురు నీరజ. చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తమ కూతుర్ని. ఒక మంచి డాక్టర్ ని చేయాలని అనుకున్నారు. కానీ నీరజకు డెంటిస్ట్ కావాలని ఉండేది. అదే విషయాన్ని పేరెంట్స్ తో చెప్పింది నీరజ. సరే నీరజ, నీకేం అవ్వాలి అని ఉంటే అదే చదువు అని చెప్పారు తల్లిదండ్రులు.

నీరజ కూడా చాలా పద్ధతిగా ఉండేది. చదువులోనూ, ఆటపాటల్లోనూ బాగా రాణించేది. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా నడిచేది. వాళ్ళు తన పై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ గెలిపిస్తూ ఉండేది. చుట్టాలలోనూ, చుట్టుపక్కలవాళ్ళతోనూ కలివిడిగా ఉండేది నీరజ. నీరజ అంటే అందరికీ చాలా ఇష్టం. అందర్నీ వరుసలు కలుపుతూ పిలుస్తూ ఉండేది.

పెద్దల పట్ల గౌరవంగా, పిల్లల్లో పిల్లగా, తన వయసు వారితో హ్యాపీగా జీవనం సాగిస్తున్న సమయంలో, మెడిసిన్ లో సీటు రావడం వల్ల బెంగుళూరు వెళ్ళవలసి వచ్చింది. తల్లిదండ్రులకు దూరంగా వెళ్తున్నా అనే బాధ ఉన్నా, తన లక్ష్యం కోసం తల్లిదండ్రుల్ని విడిచి వెళ్ళిపోయింది నీరజ.

కూతురు వెళ్తుంటే ఎన్నో జాగ్రత్తలు చెప్పారు తల్లిదండ్రులు. అన్నిటికీ తల ఊపింది నీరజ. జాగ్రత్తగా ఉంటాను అని చెప్పింది. అందర్నీ విడిచి తనకు ఇష్టమైన చదువు నేర్చుకోవడానికి, తన ఆశయం కోసం ముందు అడుగు వేసింది.

****

కాలేజీలో మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యింది నీరజ. హాస్టల్ వాతావరణం చాలా నచ్చింది. అలాగే తన రూం మేట్ ఫాతిమా కూడా ఫ్రీగా ఉండడం వల్ల తొందరగానే కలిసిపోయారు వాళ్ళు ఇద్దరు. పొద్దున్నే కాలేజీకి వెళ్లి రావడం, సాయంత్రాలు గార్డెన్ లో తిరుగుతూ చదువుకోవడం, తినడం, పడుకోవడం రొటీన్ గా మారిపోయింది.

అయితే తన రూం మేట్ అయిన ఫాతిమా కోసం అప్పుడప్పుడు తన కజిన్ బ్రదర్ అయిన అన్వర్ వచ్చేవాడు. తన గురించి క్షేమం తెలుసుకుంటూ అవసరమైన బుక్స్ లాంటివి తెచ్చి ఇస్తూ ఉండేవాడు. అతను నీరజ తో కూడా ఎంతో మర్యాదగా, గౌరవంగా, మీరు ,మీరు అంటూ, మాట్లాడడం నీరజకి చాలా నచ్చింది. అతను అంటే ఒక విధమైన ఆకర్షణ ఏర్పడింది.

నాలుగు రోజులకు ఒకసారి అయినా అతను అక్కడికి వచ్చేవాడు. అలా వారి మధ్య పరిచయం పెరిగింది. ఎంతలా అంటే, ఫాతిమా కోసం కాకుండా నీరజ కోసం వచ్చేవాడు. ఫాతిమాని వదిలేసి వాళ్ళు సినిమాలకి, షికార్లకి వెళ్ళేవారు. అతను నీరజను చదువు విషయంలో చాలా ఎంకరేజ్ చేసేవాడు. కేవలం ఆదివారాలు మాత్రమే బయటకు వెళదాం  అని చెప్పేవాడు.

చదువులో అనుమానాలు ఉంటే తీరుస్తూ ఉండేవాడు. ప్రతి విషయంలో తన గురించి కేరింగ్ చూపిస్తూ ఉండేవాడు అన్వర్. నీరజకు తన తల్లిదండ్రుల తర్వాత అంతగా తన గురించి ఆలోచించే వ్యక్తి దొరకడం తన అదృష్టంగా భావించింది.

తనతో ఎంత ఫ్రీగా ఉన్నా, అతను హద్దులు దాటక పోవడం. కనీసం చేయి కూడా పట్టుకోకపోవడం, తన ఇష్టాలకు, అభిరుచులకు పెద్ద పీట వేయడంతో నీరజ తనకు తెలియకుండానే తనను ప్రేమించడం మొదలు పెట్టింది. అలా వాళ్ళ పరిచయం ముందుకు సాగింది. ప్రేమిస్తున్నా అంటూ చెప్పలేదు. కానీ, అతనంటే ఒక రకమైన ఆరాధన భావం ఉంది నీరజకి. అలా మూడేళ్లు మూడు నిమిషాలులా గడిచిపోయాయి. సెలవులకు ఊర్లో ఉన్నా కూడా వాళ్ళు ఉత్తరాల ద్వారా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు.

నాలుగో సంవత్సరంలో నీరజ ముందుగా అన్వర్ కు ప్రేమ విషయం చెప్పింది. కానీ, అన్వర్ మీరు హిందువులు. మీ వాళ్ళు వద్దు అంటారు అందువల్ల ఆశలు పెంచుకోకు అని చెప్పాడు. ఎవరైనా వద్దు అన్నదే మనం చేయాలి అనుకుంటాం , కాబట్టి నీరజ అతన్ని మనసారా ప్రేమించింది కాబట్టి, లేదు నేను నిన్ను వదులుకోలేను అంటూ పట్టుబట్టడంతో అన్వర్ ఒక కండిషన్ పెట్టాడు.

అదేంటంటే నువ్వు ముస్లింగా మారాలి అని, పేరు మార్చుకోవాలి అని అనడంతో పెళ్ళి అయ్యాక ఎలాగూ మార్చుకుంటా ,అంటూ ప్రామిస్ చేసింది నీరజ. తల్లిదండ్రులు తన మాట కాదనరు అనే ధైర్యంతో నాలుగో సంవత్సరం పరీక్షలు అయ్యాక అన్వర్ ని తీసుకుని వెళ్ళింది. నీరజ తన తల్లిదండ్రుల దగ్గరికి.

నీరజ రావడంతో తల్లిదండ్రులు చాలా సంతోషించారు. తమ కూతురు స్నేహితుడు అనుకుంటూ అన్వర్ ని కూడా ఆహ్వానించారు ఇంట్లోకి. రెండో రోజు ఉదయం నీరజ అన్వర్ ఇద్దరు కలిసి తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. కానీ, చదువుకుని ప్రయోజకురాలు అవుతుందనుకున్న కూతురు ఇలా ప్రేమించిన వాడితో రావడం, పైగా వాళ్ళు అన్య మతస్థుడు అయిన అన్వర్ ను చూసి అభ్యంతరం తెలిపారు.

లవ్ జిహాదీ

ఇలాంటివి మన ఇళ్ళలో కుదరవు. నువ్వు ఏది చేసినా సరే , కానీ, పరాయి మతం వాడు మనకు వద్దు , నువ్వు వేరే కులం వాడిని ప్రేమించినా మేము ఒప్పుకునే వాళ్ళం . అంటూ వద్దు అని అన్నారు మేము ఒప్పుకోము అని చెప్పారు.

కానీ, నీరజ వినకుండా నేను అన్వర్ ని తప్ప వేరే ఎవర్నీ పెళ్ళి చేసుకోను. లేదంటే కన్యగా ఉండిపోతా అని తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెప్పింది. ఇక తల్లిదండ్రులు వద్దు అనడంతో, అన్వర్ నీరజతో నేను ముందే చెప్పాను అనవసరంగా నన్ను తీసుకుని వచ్చావు , నన్ను అవమానించారు అంటూ అంతా నీరజ వల్లే జరిగిందని అంటూ , నీకు నేనంటే ఇష్టం, ప్రేమ ఉంటే నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళిపోయాడు.

తల్లిదండ్రులు తమ ప్రేమను ఒప్పుకోకపోవడంతో, నీరజ కంటికి వాళ్ళు శత్రువుల్లా కనిపించారు. వాళ్ళతో మాటలు తగ్గించింది. నీరజ ఇంట్లోంచి కదలకుండా కొంచం కట్టడి చేశారు. ఎన్నో విధాల నచ్చ చెప్పాలని ప్రయత్నాలు చేశారు. తమ పేరు నిలబెట్టాలని అనుకున్న కూతురు ఇలా చేయడం తో వాళ్ళు తట్టుకోలేక పోయారు.

అందుకే కాస్త కటువుగా మాట్లాడడంతో నీరజ మనసు విరిగింది. అన్వర్ ని అనవసరంగా దూరం చేశారు అంటూ బాధపడింది. ఈ లోపు సెలవులు అయిపోవడంతో మళ్లీ కాలేజీకి వెళ్ళాలి అని రెడీ అవ్వసాగింది. ఈసారి తండ్రి వస్తాను అనగానే , నీరజ  మీరు చెప్పింది నిజమే నేను అన్వర్ ని మర్చిపోవడానికి ట్రై చేస్తా అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి, తండ్రి తనతో రాకుండా చేసుకుని, బయలుదేరింది. కూతురు మారిందని అనుకున్న పేరెంట్స్ తనను వదిలేశారు నమ్మకంతో.

కాలేజీకి వెళ్ళాక నీరజ మళ్ళీ అన్వర్ కు ఫోన్ చేసింది. కానీ, అన్వర్ మాత్రం వద్దు నీరజ మన పెళ్ళి జరగదు. జరగనప్పుడు ఎందుకు కలవడం? మీ వాళ్లను బాధ పెట్టకు , అంటూ అనడంతో లేదు అన్వర్ నేను నీ కోసం వచ్చాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీతోనే ఉంటాను. అందుకే నా వాళ్లను కూడా వదిలేసి వచ్చాను. అనగానే నేను వస్తున్న అని ఫోన్ పెట్టేసాడు అన్వర్.

*****

రేయ్ చెప్పింది గుర్తుంది కదా, అందర్నీ ఒకేసారి మీరంతా పెళ్లి చేసుకోవాలి. మీరంతా ఇన్ని రోజులూ నేను చెప్పినట్టు చేశారు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అందరూ మీ ప్రేమను నమ్మి మీ కోసం ఇంట్లో వాళ్లను వదిలేసి వచ్చారు. వాళ్లను మీ ప్రేమతో బంధించారు. మీ కోసం వాళ్ళు ఏదైనా చేసేలా వాళ్లను మార్చాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, నేను నీరజతో ఏమేం చెప్తున్నాను అనేది వింటూ అదే ఫాలో అవ్వండి.

ఎక్కడైనా తేడా జరిగిందో మన ప్రయత్నం అంతా వ్యర్థం అవుతుంది. ఇది మన పవిత్ర సేవ కోసం చేస్తున్నాం. మీరెంత ప్రేమ చూపిస్తే వాళ్ళు అంతగా నమ్ముతారు సమ్జే అన్నాడు అన్వర్. టీక్ హై భయ్యా, నువ్వు చెప్పింది తప్పకుండా చేస్తాము అన్నారు అందరు.  ఆల్లా కోసం చేస్తున్న ఈ పోరాటంలో మనం గెలవాలి అంటూ పిలుపు ఇచ్చాడు అన్వర్.

సరే ఇక మీరు వెళ్ళండి అంటూ, తను కూడా నీరజ దగ్గరికి బయలుదేరాడు అన్వర్. అందరూ బ్లూ టూత్ లు సరి చేసుకుని బైక్ ల మీద ఎవరి స్థలాలకు వాళ్ళు వెళ్లారు. అక్కడ నీరజ అన్వర్ కోసం చూస్తుండగా, అన్వర్ బైక్ దిగి రావడం కనిపించింది. వెంటనే పరుగెత్తుకుని వెళ్లి అన్వర్ ని గట్టిగా కౌగిలించుకుంది నీరజ. కానీ, అన్వర్ తనను ముందుకు తోసేశాడు. అది తట్టుకోలేని నీరజ అపనమ్మకంగా చూస్తూ ఏంటి అన్వర్ నన్ను తోసేసావు. నేనంటే ఇష్టం పోయిందా అంది కన్నీళ్ళతో….

లేదు నువ్వంటే ఇష్టం తగ్గలేదు. కానీ, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అన్నాడు అన్వర్. ఏం? ఎందుకు? మా అమ్మనాన్న నిన్ను అవమానించారు అనేనా అంది నీరజ. కాదు, నేను నా పవిత్ర దేశం కోసం పోరాడాలి అనుకుంటున్నా, అక్కడ ఆ దేశంలో నా అక్కలు, అన్నలు, చాలా మంది చనిపోతున్నారు.

వాళ్ళలో నేను ఒకడిని కావాలి, నా దేశం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి వెళ్తున్నా, అందుకే నాకు ప్రేమ వద్దు. ఇన్ని రోజులూ ప్రేమించాను కానీ ఇప్పుడు నాకు నా దేశం ముఖ్యం, నేను నిన్ను పెళ్లి చేసుకుని నా స్వార్థం చూసుకొలేను. యుద్ధంలో నా అన్నను చంపేశారు వాళ్ళు. నా స్వార్థం చూసుకుంటే, నా కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? అందరూ నాపై ఉమ్మెస్తారు. అందుకే, నిన్ను చేసుకోలేను, ఇక్కడితో మర్చిపో నీరజ, నీకూ, నాకూ సెట్ అవ్వదు అన్నాడు అన్వర్.

లవ్ జిహాదీ

ఇన్నేళ్ల మన ప్రేమ అంతా వృధా అవుతుందా? నీ కోసం నేను నా వాళ్లను వదిలేసి వచ్చాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, ఇప్పుడు కాదంటే నాకు చావే శరణ్యం అన్వర్ నీతోనే కలిసి ఉండాలి అని కోరుకుంటున్నా, దయచేసి నన్ను వదిలెయ్యకు. నువ్వు లేకుండా నేను ఉండలేను, నన్ను నీతో పాటు తీసుకుని వెళ్ళు, నువ్వు దూరం అయ్యి బతకడం కంటే నీతో ఉంటూ చావడం మంచిది. నన్ను వదిలేసి వెళ్ళకు అంది ఏడుస్తూ నీరజ .

దానికి అన్వర్ లేదు నీరజ నువ్వు నాతో రావాలి అంటే నువ్వు కూడా మా జిహాద్ లో చేరాలి, నీతో పాటు ఇంకొందరికి చేర్చాల్సి ఉంటుంది. అలా అయితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ, ఇది నీ వల్ల కాదు. అందుకే వదిలేసి వెళ్ళిపో నన్ను బలవంతం చేయకు అన్నాడు అన్వర్.

లేదు అన్వర్ నాకు ఇష్టమే, నేను చేయగలను నన్ను కాదని అనకు, నువ్వు అన్నట్టు నీ కోసం, నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను. నేను జిహాద్ లో చేరతాను. ఇంకా నా స్నేహితులను కూడా చేరుస్తాను. కానీ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నాకు నీ ప్రేమ కావాలి నువ్వు కావాలి, అన్వర్ నన్ను వదిలి వెళ్ళకు , అంటూ అన్వర్ కాళ్ళ పైన పడింది నీరజ. అంటే అన్వర్ తనని అలా అయ్యేలా తన ప్రేమలో ముంచాడు. కాదు, అలా నటించాడు.

కాసేపు ఆలోచించిన అన్వర్ సరే, ముందు నువ్వు నీ పేరు మార్చుకో. నువ్వు జిహాద్ లో చేరిన తర్వాతే మన నిఖా అన్నాడు . అన్నదే ఆలస్యం అన్నట్టుగా నీరజ కళ్ళు తుడుచుకుని లేస్తూ, అలాగే పద ఎక్కడికి అంటే అక్కడికి వస్తాను అంది.

అన్వర్ తనను దగ్గరకు తీసుకుని నిన్ను చాలా కష్ట పెడుతున్నా అన్నాడు ప్రేమగా, లేదన్వర్ ఇదే ప్రేమ నాకు కావాలి నన్ను దూరం చేయకు నువ్వు నాతో ఇంతే ప్రేమగా ఉండాలి అంటూ ఆ నక్క ని నమ్మి ,హృదయంపై వాలిపోయింది ఆ లేడీ.

తర్వాత ఇద్దరు కలిసి మసీదుకు వెళ్లారు. అక్కడ నీరజ చేత ఖురాన్ పై ప్రమాణం చేయించారు. తర్వాత ఇమామ్ అనే అతను నీరజతో, నేను నా ఇష్టంతో ఇందులో చేరుతున్నాను అంటూ చెప్పించి, తర్వాత నీరజ పేరును ఆయేషా బేగం గా మార్చారు.

తర్వాత పెళ్లి చేసుకున్నారు దండలు మార్చుకుని. సంతకాలు చేశారు. ఇద్దరూ మేజర్లే కాబట్టి అక్కడున్న వాళ్ళు సంతకాలు చేశారు. అదే సమయంలో అక్కడున్న మిగతా మసీదుల్లో ఇలాగే ఇరవై జంటల పెళ్ళిళ్ళు కూడా జరిగాయి. పెళ్లి అయి బయటకు వచ్చాక అన్వర్ ఆయేషాతో నువ్వు ఇప్పటి నుండి జిహాద్ లో చేరావు.

కాబట్టి, నీ స్నేహితులను కూడా చేర్చు, అలాగే మీ ఇంటికి కూడా ఉత్తరం రాయి పెళ్లి అయ్యింది అని, ఇప్పటి నుండి నీ చదువు బాధ్యత నాదే, ఇక్కడే ప్రాక్టీస్ పెట్టు, నువ్వు ఎంత తొందరగా నీ స్నేహితులను చేర్పిస్తే అంత మంచిది.

అలాగే హాస్టల్ కూడా ఖాళీ చెయ్యి, మనం కాపురం పెడదాం అని చెప్పాడు. దానికి ఆయేషా కూడా సరే అంది. తనకు చాలా సంతోషంగా ఉంది. తనకు అన్వర్ కు పెళ్లి అయ్యింది. ఇక ఎవరు తమను విడదియ్యలేరు అని ఆనందంగా ఉంది ఆయేషా. అన్వర్ చెప్పినట్టుగా తల్లిదండ్రులకు ఉత్తరం రాసింది.

తనకు పెళ్లి జరిగింది అని, ఇక మీదట డబ్బు పంపవద్దని, అన్వర్ నన్ను చదివిస్తాడు అని రాసింది. అది చూసి తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అయ్యో కూతురు ఇలా చేసింది అని ఒక్కగానొక్క కూతురు ఇలా చేయడం వల్ల వాళ్ళు చాలా కృంగి పోయారు.

నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేక, ఇంటికే పరిమితం అయ్యారు. బెంగుళూరు వెళ్లాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వెళ్ళినా ప్రయోజనం లేదని కూతురు ఆయేషాగా పేరు మార్చుకోవడం, మతం మారడం అసలు నచ్చలేదు. తమ కూతురు మీద విరక్తి భావం కలిగింది.

కానీ, గాయత్రి తన భర్తతో ఒక్క సారి వెళ్లి చూసి వద్దాం అనుకుంటే తన భర్త కిరణ్ అవసరం లేదని అనడంతో నోరు మూసుకుంది. చుట్టాలు అందరికి  తెలిసి, అందరూ సానుభూతి చూపిస్తూ ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. వాటికి తల కొట్టేసినట్టు అయ్యింది దంపతులకు.

ఎవరికి సమాధానం ఇస్తారు , ఏమని ఇస్తారు. కాలం గడిచిపోతుంది, రోజులు కరిగిపోతున్నా వారి జీవితంలో పెద్ద మార్పు రాలేదు. కానీ, ఆయేషా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.

లవ్ జిహాదీ

****

హాస్టల్ నుండి గది ఖాళీ చేశాక ఒక ప్లాట్ తీసుకుని అందులో కాపురం పెట్టారు అన్వర్, ఆయేషా ఇద్దరు. వాళ్ళు చాలా సంతోషంగా గడపసాగారు. ప్రొద్దున కాలేజీకి వెళ్లడం, సాయంత్రాలు సినిమాలకు, షికార్లకు తిరగడం వంటివి చేశారు కొన్ని రోజులు. తర్వాత నుండి అన్వర్ తన మతస్థులను ఇంటికి పిలిచి వాళ్ళతో చర్చలు చేస్తూ ఉండేవాడు.

ఆయేషాకి కూడా అవి చాలా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తూ ఉండేవి. వారితో కలిసి మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండడం వల్ల తొందరలోనే ఆ మతానికి ఆకర్షితురాలు అయ్యింది.

తను అయ్యిందే కాకుండా తన కన్నా జూనియర్స్ ను కూడా తన మాటలతో ప్రభావితం చేయడం మొదలు పెట్టింది. ప్రాక్టీస్ కూడా పెట్టి వచ్చిన పేషoట్స్ ను తన మాటలతో మాయ చేసి తన మతంలోకి వచ్చేలా చేసింది. అలా సంవత్సర కాలం గడిచింది. ఆయేషా తల్లిగా మారింది. అన్వర్ తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు తన ప్రేమలో ముంచాడు.

ఆయేషా అందరినీ మర్చిపోయేలా చేశాడు. ఇంత కంటే ఇంకెక్కువ నన్ను ఎవరు ప్రేమించలేరు అనేలా చేశాడు. అతని ప్రేమ కోసం ఆయేషా ఏదైనా చేసేలా ఎంతకైనా తెగించేలా మారిపోయింది. ఆయేషాకు మూడో నెల నడుస్తున్న సమయంలో అన్వర్ మత పెద్దలు రమ్మన్నారంటూ వెళ్ళాడు. అక్కడ హిందువులకు, ముస్లింలకు గొడవలు అవడం వల్ల ఆ గొడవల్లో అన్వర్ చనిపోయాడు.

విషయం తెలుసుకున్న ఆయేషా బోరున ఏడుస్తూ వెళ్ళింది. కానీ, అక్కడ కనీసం అతని శవం కూడా చూడనివ్వలేదు. పైగా ఇది దేశ రక్షణలో భాగంగా చనిపోయాడు . అతను తన లక్ష్యాన్ని సాధించలేదు . కాబట్టి నువ్వు కూడా తీవ్రవాదిగా మారు అంటూ హెచ్చరించారు. ఎన్నో విధాలుగా తన మనసును మార్చాలని చూసారు.

ఆయేషా కూడా నేను మతం కోసం పోరాడతానని, అన్వర్ ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను అని శపథం చేసి, మూడు నెలల కడుపుతో వెళ్ళింది. కానీ, ఆ గొడవల్లో భాగంగా పోలీసులు ఆయేషాని చుట్టూ ముట్టి అరెస్ట్ చేశారు. తనను తీసుకుని వెళ్ళి ఇంకా మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు.

కానీ, ఆయేషా ఏమీ చెప్పలేదు. పోలీసులు కోర్టుకు తనను తీసుకుని వెళ్లారు అక్కడ జడ్జ్ మానవతా దృక్పథంతో , తను గర్భవతి కాబట్టి జాగ్రత్తగా చూడమని ప్రత్యేకంగా చెప్పారు. దాంతో, చుట్టూ రక్షణ కల్పించి తనను జాగ్రత్తగా హాస్పిటల్ లో ఉంచారు పోలీసులు.

****

నీ కూతురు తీవ్రవాది అని అంటున్నారు. పేపర్లలో టీవీల్లో హోరుమంటూ నీ కూతురి గురించి వస్తున్న వార్తలు చూడు అంటూ బంధువులు, మిత్రులు, చుట్టు ప్రక్కల వారు కిరణ్ దంపతులను తిరస్కార భావంతో చూడసాగారు. ప్రాణం పోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని, ఇల్లు వదిలి, వెళ్ళి, ఇప్పుడు దేశ ద్రోహిగా, తీవ్రవాదిగా మారిందని తెలిసి, అందరూ దేశ ద్రోహిని కన్నావు అంటూ అనే రంపపుకోత మాటలూ, అవమానాలు తట్టుకోలేక , కిరణ్ గారి గుండె ఆగిపోయింది.

గాయత్రి అటు భర్త మరణాన్ని, కూతురు నిర్వాకాన్ని తట్టుకోలేక పోయింది. ప్రాణాలు పోయినంత పని అయ్యింది. అదే దుఖ సాగరంలో భర్త అంత్యక్రియలు చేయాలి అనుకుంది. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. దేశ ద్రోహిని కన్న వాడికి మేము అంత్యక్రియలు చేయము అంటూ నిరాకరించారు.

దాంతో, తానే అన్ని అయ్యి భర్తను సాగనంపింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని స్థితిలో కూడా గాయత్రి, కూతురు గురించి ఆలోచించింది. తను ప్రేమించిన పాపానికి శిక్ష అనుభవిస్తూన్న , కడుపుతో ఉన్న కూతుర్ని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా అందుకోసం కూతురు ఎక్కడ ఉందో కనుక్కుంది నీరజ ఆసుపత్రిలో ఉందని తెలుసుకున్న గాయత్రి లాయర్ ద్వారా పిటిషన్ వేసింది.

లవ్ జిహాదీ

తన కూతురు తప్పు లేదని, కావాలనే ఇందులోకి లాగారు అని, తనని క్షమించి వదిలెయ్యండి అని కోరింది. కూతుర్ని కలిసి మాట్లాడింది. ఆయేషాగా మారిన నీరజ తల్లిని చూసి చాలా బాధపడింది. తాను తప్పు చేశాను అని కాపాడమంటూ అర్ధించింది. ఆయేషా హాస్పిటల్ లో ఉన్న సమయంలో తాను చేసిన తప్పులు అన్ని గుర్తుకు వచ్చి , తాను దేశానికి, తల్లిదండ్రులకు, అన్యాయం చేశాను అని బాధపడుతూ ఉండేది.

తల్లి తనను వెతుక్కుంటూ రావడంతో, మొదటినుండి జరిగినవి అన్ని చెప్పింది. దాంతో, గాయత్రికి నిజం ఏంటి అనేది అర్దం అయ్యింది. అందుకే కూతురుతో నువ్వేం బాధ పడకు, నిన్ను విడిపించి బయటకు తెస్తాను . అంటూ ఓదార్చి జాగ్రత్తగా ఉండు , అంటూ చెప్పి వెనుదిరిగి వెళ్ళింది.

*****

కోర్టులో గాయత్రి వేసిన పిటిషన్ ను చూసిన జడ్జ్ గారు, నీకు తను కన్న కూతురు అయినా, దేశానికి మాత్రం తానొక తీవ్రవాది కాబట్టి నేను బెయిల్ ఇవ్వలేను అంటూ నిరాకరించారు. జడ్జ్ ఒక్కరే కాదు. ఆ వార్త విన్న వారు, చూసిన వారంతా గగ్గోలు పెట్టారు. దేశ ద్రోహికి బెయిల్ ఇవ్వవద్దు అంటూ రిటన్ పిటిషన్ కూడా వేశారు. అందువల్ల కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

అయినా, గాయత్రి దేవి పట్టు విడవకుండా మళ్లీ ప్రయత్నాలు చేసింది. కూతురు కడుపుతో ఉందంటూ , తల్లి అవసరం ఉందని , డెలివరీ అయ్యేవరకు బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ వేసింది. కానీ ఆమెను, ఆమెకు పుట్టబోయే బిడ్డకు తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తామంటూ చెప్పిన కోర్టు మళ్లీ నిరాకరించింది.

ఇది ఇలా కొనసాగుతూ ఉండగానే, నెలలు నిండిన ఆయేషా అంటే నీరజ పండంటి పాపకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న తల్లి వెళ్లి చూడాలి అనుకుంది. కానీ, జైలు అధికారులు ఒప్పుకోలేదు. కనీసం పాపను తనకు ఇవ్వమని పిటిషన్ వేసింది. కానీ, భద్రతా కారణాల వల్ల  ఇవ్వలేమని ఒక స్వచ్చంద సంస్థకి పాప బాధ్యతని అప్పగించారు అధికారులు.

ఆయేషాను విచారణ కోసం తీసుకుని వెళ్లారు. గాయత్రి దేవి మళ్లీ తన కూతురును విడిచి పెట్టాలని పిటిషన్ వేసింది. కోర్టు నిరాకరిస్తూనే ఉంది. ఇప్పటికీ ఇది జరుగుతూనే ఉంది. గత పద్దెనిమిది (18) ఏళ్లుగా గాయత్రి కూతురు కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పుడా పాప పెరిగి పెద్ద అవ్వచ్చు. ఆయేషా నడి వయసులో ఉండొచ్చు.

నేను ఈ కథ రాసే సమయానికి ఆయేషా ఇంకా జైల్లోనే ఉందని, తన తల్లి తనకోసం పోరాడుతూనే ఉందని తెలిసింది. ఈ కథ ఒక నిజరూప సంఘటన, ఒక వార్త ఆధారంగా రాశాను. కొన్ని సున్నితమైన విషయాలు ఇక్కడ చర్చించ లేదు. ముఖ్యమైన విషయం మాత్రం మీకు అందించాను అని అనుకుంటున్నా. ఏదైనా తప్పుగా మీకు అనిపిస్తే క్షంతవ్యురాలిని 🙏🙏🙏🙏

కేరళలో ఇది జరిగింది. పాత్రల పేర్లు మార్చడం జరిగింది. ఇక ముందు ఏం అవుతుంది అన్నది మీ మాటల్లో నాకు తెలియచేయండి. ఇంతకీ ఆయేషా అలియాస్ నీరజ నిజంగానే దేశద్రోహి అంటారా? తనకు శిక్ష పడాలి అంటారా? ఆ తల్లి కోరిక నెరవేరుతుందా? లేదా ఆ పాప కు తల్లిని చూసే అదృష్టము ఉందా? ఇక్కడ మీరు అయితే ఏం చేస్తారు? కథకు ఎలాంటి ముగింపు ఇస్తారు? మతం పేరుతో ఇలా అమాయకమైన అమ్మాయిలను ప్రేమలోకి దింపడం ఎంత వరకు సమంజసం ?  మీ సమీక్షలో చెప్పండి… ధన్యవాదాలు. 

 

 

– భవ్య చారు (గారి రచన)

Related Posts

4 Comments

  1. చాలా బావుంది నిజమే ఇప్పటికీ వయసు రాగానే చాలా మంది అమ్మాయిలు తల్లితండ్రుల మనసులు విరిచేసి వాళ్ళ ఆశలకు సమాధులు కట్టేసి నిజంగా దారుణం కదా

  2. చాలా బాగుంది భవ్య గారు..చాలా బాగా రాసారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *