మా ఇంటి బతుకమ్మ

మా ఇంటి బతుకమ్మ

బతుకమ్మ పండుగ అంటే పువ్వుల పండుగ , పువ్వులన్నీ తీసుకొచ్చి అందంగా ముస్తాబు చేసి ఆడపిల్లలకు ఎలా అలంకరణ చేస్తారో అంతటి ముస్తాబు చేసి, ఆడపడుచు లాగా భావించి పూలను పూజించుకుంటూ వాటి చుట్టూ చేరి సంతోషంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఆమెను కొలుచుకుంటూ పసుపు కుంకుమలతో, అగరు బత్తుల తో పూజించి, గౌరమ్మను చేసి పిల్లాపాపలను తమ పసుపు కుంకుమలను కాపాడమని ప్రార్థిస్తూ చేసుకునే పండగ మన బతుకమ్మ పండుగ.

బతుకమ్మ అంటే మళ్ళీ జీవించు అని అర్థం. పూసే ప్రతి పువ్వు దేవుడి పాదాల చెంతకు వెళ్లదు. కాబట్టి అన్ని రకాల పువ్వులను అందంగా పేర్చుకుంటూ, ప్రతి ఒక్క పువ్వుకు కలిగిన విశిష్టతను తెలియజేస్తూ, సంవత్సరం మొత్తంలో ఏ పువ్వులని అయితే దూరంగా ఉంచుతామో, అలాంటి పువ్వులు అన్ని వెతికి మరీ తీసుకువచ్చి ప్రతి ఒక్క పువ్వు ప్రత్యేకత కలిగినది అని తెలియజేస్తూ బతుకమ్మ అంటూ మా కోసం మళ్ళీ పుష్పించు అంటూ ప్రతి ఒక్క పువ్వును దేవతల లాగా భావిస్తూ కొలుచుకుంటూ ఉంటాం.

అన్ని పువ్వుల లోనూ ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేద ఔషధ గుణాలు పీలుస్తూ, బతుకమ్మను పేర్చినంత సేపు వాటినుండి వచ్చే సుగంధాలకు మైమరచిపోతూ, ఆరోగ్యమే మహా భాగ్యం అన్న చందంగా , ఆటపాటల్లో అలసిపోతూ, ఆరోగ్యాన్ని కాపాడుకునే బతుకమ్మ పండుగ.

అటు సాంప్రదాయ ప్రకారంగా, ఇటూ ఆరోగ్యపరంగా కూడా బతుకమ్మ పండుగ మనకి ఎంతో మేలు చేస్తుంది. బతుకమ్మ పండుగకు వాడే గునుగు, తంగేడు, కట్ల, బంతి, చేమంతి పట్టు, సీతమ్మ జడ కుచ్చులు, గోరింకే పువ్వులు,  తామర పువ్వు, గుమ్మడి, బీర, కాకర, సోర, ఇలా రకరకాల తీరొక్క పువ్వులను తీసుకు వచ్చి ఓపిక సహనంతో, ఒక్కొక్క పువ్వును అందంగా పేర్చుకుంటూ, ఒక ఆకృతి నిచ్చి, పసుపుతో గౌరమ్మను చేసి, దీపాలతో పూజించి, తొమ్మిది రకాల సద్దులతో అలంకరించుకుంటాము.

మామిడి, కొబ్బరి, చింత, పెరుగు, ఉసిరి, పుట్నాలు, పల్లీలు, నిమ్మ, లాంటి ఔషధ గుణాలున్న తీరొక్క ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, భక్తి ప్రపత్తులతో అందంగా జరుపుకునే ఆడవాళ్ళ పండుగ బతుకమ్మ పండుగ. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ బతుకమ్మ పండుగను ఆడవారంతా తమ తనివితీరా ఆటపాటలతో అర్ధరాత్రి వరకూ ఆడుకుంటారు అలసిపోయి ఆ బతుకమ్మను పోయిరావమ్మా మళ్లీ రావమ్మా అంటూ సాగనంపుతారు ఆడబిడ్డలు.

*******

 ఇంతటి విశిష్టత ఉన్న బతుకమ్మ పండుగను మరి మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చెప్తాను.

పండగ వస్తుందనే వారం రోజుల ముందే ఇల్లoతా దులుపుకొని, పక్క బట్టలన్నీ ఉతుక్కొని, అన్ని శుభ్రంగా ఉంచుకుని, ఒకరోజు ముందే తంగేడు , గునుగుపువ్వులను తీసుకు వచ్చి వాటిని శుభ్రపరచి కట్టలుగా కట్టి ,వాటికి రంగులు అద్ది ఆరబెడతాను.

ఇక పెత్తల అమాసనాడు ప్రొద్దున్నే నిద్ర లేచి, తలంటు స్నానాలు చేసి, ముందుగా ప్రసాదాల కోసం మా ఇంట్లో అయితే పాయసం, కానీ సిరా కానీ చేస్తాం. ఒక ఆకుకూర, పప్పు అన్నం వండి ప్రసాదంగా పెడతాము. (కొన్ని ప్రాంతాలలో ఈ ప్రసాదం వేరేగా ఉంటుంది) తర్వాత మామూలు వంట చేస్తాము.( కొందరు పెద్దలకు ఇచ్చుకుంటారు).

ఇక దేవుడి గుళ్ళు సర్దుకుని, అందంగా పువ్వులతో అలంకరించుకుని, పసుపుతో గౌరమ్మను చేసి చిక్కుడు ఆకులో కానీ, తమల పాకులో కానీ పెట్టుకుని పూజించి, తర్వాత బతుకమ్మ ను పేరుస్తాము. గుమ్మడి ఆకులు దొరికితే అవి, లేదంటే సొర ,బీర ఆకులను తెచ్చి, పెద్ద ఇత్తడి తాంబాలంలో కానీ, లేదా స్టీల్ తాంబాలంలో కానీ ఆకులన్నీ సమానంగా వేస్తూ, మొదట తంగేడు పూలతో వరుసగా పేర్చి ఆ తర్వాత గునుక పూలు పెరుస్తాము..

ఆ తర్వాత వరుసగా బంతి, చామంతి, మళ్లీ గునకు పువ్వుకు రంగులద్ది తడి అరిన వాటిని పేర్చి, ఎంత పువ్వు దొరికితే అంతా పెద్దగా పేరుస్తూ, కడుపును నింపుతూ చివరికి ఒక పెద్ద పువ్వుతో ముగించి బతుకమ్మను తయారు చేస్తారు. ప్రసాదం కోసం ఎన్ని సద్దులు వీలైతే అన్ని సద్దులు చేస్తాం.

ఇవన్నీ అయ్యేసరికి మూడు గంటలు అయ్యేది. అప్పుడు డప్పుల్లోల్లు డప్పులు కొడుతూ రావాలి రావాలి అంటూ చాటింపు వేసేవారు. డప్పు చప్పుడు వినగానే ఇళ్లలో ఇంకా హడావుడి మొదలు అయ్యేది. మా అమ్మ నేను పేరుస్తాను కానీ, మీరు రెడీ అవ్వండి అనేది. మేము రెడీ అయ్యేవరకు అమ్మ బతుకమ్మ పూర్తి చేసుకుని తను కూడా రెడీ అయ్యేది.

నాలుగు గంటలకు టీ తాగి, ఇంటి ముందు ఊడ్చి, కళ్ళాపి చల్లి అందంగా ముగ్గులు వేసి బతుకమ్మను గౌరమ్మను తెచ్చి పెట్టుకునేవాళ్ళం. వాడకట్టులో అందరూ ఎవరి ఇంటిముందు వారి బతుకమ్మలు తెచ్చి పెట్టుకుని వరుసగా అందరి ఇళ్ళముందు ఆడుతూ అంటే ఒకరి ఇంటికి మరొకరు ఆడదానికి వెళ్తూ అలా అయిదున్నర వరకు ఆడేవారిమి.

తర్వాత రామాలయం దగ్గరికి అందరం డప్పు వాయిద్యాల నడుమ వెళ్లి అక్కడ ఆడుతూ కోలాటాలు వేస్తూ, పిల్ల, పెద్ద, చిన్న, అందరూ సంతోషంగా అడుకునేవాళ్ళు. ఏడు గంటలప్పుడు మళ్లీ డప్పు వాయిద్యాల నడుమ చెరువు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళే కొద్దీ బతుకమ్మలు బరువుగా మారేవి. బతుకమ్మను కొందరు ఆడవాళ్లు తలపై పెట్టుకుంటే మరి కొందరు మగాళ్లు కూడా తలపై పెట్టుకుని వచ్చేవారు.

అందరం చెరువు దగ్గర ఎవరి కులాలకు సంభందించి వాళ్ళు పెట్టి ఆడేవారు. చెరువు దగ్గర డప్పుల వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఉండేవాళ్ళు. వారితో కానీ లేదా వెంట ఉన్న మగవాళ్ళు చెరువు లోకి దిగి బతుకమ్మను గంగమ్మ ఒడికి చేర్చేవారు. తర్వాత ఒకరికి ఒకరు పసుపు బోట్లు ఇస్తూ, ప్రసాదాలు పంచుకునేవారు. అందరికీ పంచిన ప్రసాదాలు అయ్యాక మిగిలిన ప్రసాదంతో కొందరు అక్కడే కూర్చుని తింటే మిగిలిన వారు ఇళ్లకు ప్రయాణమై వెళ్ళేవారు.

తోవలో డప్పుల వాళ్ళు మిగిలిన వారు ప్రసాదం కోసం చూసేవారు. వారికి ప్రసాదాలు ఇస్తూ ముందుకు కదిలే వాళ్ళం. ఖాళీ అయిన తంబాలాలు నెత్తి పై పెట్టుకుని ఆట చిలకల్లారా, పాట చిలకళ్ళారా అంటూ పాటలు పాడుకుంటూ, ఇళ్లకు వెళ్లి మళ్లీ ఆడుకున్న తృప్తి తీరని వాళ్ళు ఇంటి ముందు బతుకమ్మలు పేర్చిన తాంబాలాలు నీటి తో నింపి ఆడుకునే వారు. అర్ధరాత్రి వరకు ఆడుకుని అలసి పోయి నిద్రపోయేవారు.

మా నానమ్మ వారింట్లో అయితే వేరేగా ఉండేది. ఇక్కడ సద్దులు చేస్తే అక్కడ నానమ్మ పెసర్లు ఏoచి, విసిరి మలిద ముద్దలు నెయ్యి వేసి కట్టేది.  పులిహోర, దద్దోజనం చేసేది. బతుకమ్మ పువ్వును గుట్ట నుండి నాసర్ తెచ్చి ఇస్తే దాన్ని అత్తలు శుభ్ర పరిచి రంగులు అద్దేవారు.

అమ్మ వంట చేస్తుంటే, నానమ్మ బాబాయిలు బతుకమ్మను అందంగా పేర్చేవారు. నానమ్మ బతుకమ్మ అయ్యేవరకు అసలు ఏమీ తినకుండా, తాగకుండా, మడితో ఉండేది. బతుకమ్మ పెర్చేసరికి ఆలస్యం అవుతుందని అందర్నీ తినమని పంపేది.

అందరూ తిని, నానమ్మకు పువ్వు అందించేవారు. మూడు గంటలకు బతుకమ్మ అయ్యాక అప్పుడు నానమ్మ అన్నం తినేది. అమ్మ వాళ్లను అత్తలను హడావుడి చేసేది రెడీ అవ్వమని. అందరికీ గాజులు పెట్టించేది. కొత్త చీరలు కట్టుకుని అందరూ రెడీ అయ్యాక, గౌరమ్మను అమ్మ ఎత్తుకుంటే నాసర్ బతుకమ్మను ఎత్తుకునేవాడు.

అత్తలు, అమ్మ, నానమ్మ అందరూ ఇంటి ముందు కాసేపు ఆడుకుని, మూడు బజార్ల దగ్గరికి వెళ్ళి అక్కడ బతుకమ్మలు ఆడేవారు. వాళ్ళు ఆడే విధానం వేరేగా ఉండేది. ఏ కులానికి సంభందించిన వాళ్ళు ఆ వాడకట్టులో ఆడుకున్న తర్వాత, చెరువుకు వెళ్ళేవాళ్ళు. అక్కడ మళ్లీ ఎవరికీ వాళ్ళు ఆడుకుని, చెరువులో నిమజ్జనం చేసి, మలిద ముద్దలు అందరికీ పంచేవారు.

దొరల, పటెళ్ళ, కర్ణల, కోమట్ల, రెడ్ల బతుకమ్మలు ఒక వైపు ఉంటే, మిగిలిన వారివి ఒకవైపు ఉండేవి. ఇంకా వేరే కులాల వారు వేరేగా ఆడుకునేవారు. రాను రాను అందరివీ ఒకే చోట ఉంచడం మొదలైంది. ఆడుకున్న తర్వాత నిమజ్జనం అయ్యాక, పుసుపులు ఇచ్చుకుని అందరికీ ప్రసాదం పంచుతూ, ఇళ్లకు వెళ్లి అక్కడ కూడా మళ్లీ ఆడుకునేవారు.

రాను రాను అన్ని మారాయి. ఊర్లో పనులు లేక బతుకులు భారం అయినవారు పట్టణాలకు వలసలు వెళ్లారు. చిన్న, పెద్ద కులాలు అనే తేడా లేకుండా అందరూ వలసలుపోయారు. ఆ లోటు ఎవరూ తీర్చలేక పోయారు. అందరికీ ఓపిక, సహనాలు తక్కువ అయ్యాయి. పువ్వుల బతుకమ్మ స్థానంలో, కాగిత బతుకమ్మలు వచ్చాయి. పట్టణానికి వలస వెళ్ళిన వారు పువ్వులు తెచ్చి బతుకమ్మలు పేర్చే ఓపిక లేక కాగితం బతుకమ్మల పై ఆధారపడ్డారు.

ఆ విద్య వచ్చిన వారి హవా మొదలైంది. ఊర్లో పనులు లేక ఖాళీగా ఉన్న వారు కాగితం బతుకమ్మలు తయారు చేస్తూ జీవనోపాధిని పొందారు. కాగితం బతుకమ్మ బరువు ఉండదు. అలాగే బతుకు బరువును మోసేవారు, బరువు లేని బతుకమ్మను తెచ్చుకుని ఆడుకున్నారు. పైసాలో పరమాత్మ ఉందని అనుకున్న వారు ఒళ్ళు వంచి ఆడడానికి మొగ్గు చూపించక తూ, తూ మంత్రంగా బతుకమ్మను జరుపుకుని విశ్రాంతి తీసుకున్నారు.

బతుకమ్మ ఆడితే నామోషీగా భావించారు. పాటలు పాడుతూ చేతులు కలిపి ఆడే రోజులు పోయి,  డిజే లు పెట్టుకుని ఎగరడం నేర్చారు. ఒకప్పుడు బతుకమ్మ ఆడడం రాకపోతే తిట్టేవారు, చేతులు కలపడం రాక పోతే బయటకు పంపేవారు. అలాంటిది ఇప్పుడు బతుకమ్మ అంటే డి.జే పాటలు, ఎగరడం గా మారింది. చేతులు కలిపి ఆడేవారు తక్కువ అయ్యారు. బతుకమ్మ పాటలు రాని వాళ్ళు ఉన్నారు.

ఫోనులో పాటలు పెట్టుకోవడం, ఎగరడం ఎక్కువగా అయ్యింది. బతుకమ్మ మూలాలు మర్చిపోయారు. సంప్రదాయం, ఆచారాలు కనుమరుగు అయ్యాయి. ముండలు కూడా బతుకమ్మలు ఆడుతున్నారు. ఊర్లో కళ తగ్గింది, పట్టణంపై మోజు పెరిగింది. క్రమంగా ఊర్లో ఉన్న వాళ్ళు పట్టణం వైపు పరుగులు తీశారు. డబ్బు సంపాదనకు మరిగి పండుగలు మర్చిపోయారు. ఉర్లన్ని వెల వెల బోయాయి. కళ తప్పిన బతుకమ్మ రాజకీయ బతుకమ్మగా మారింది.

బతుకమ్మ అంటే బతుకు నిచ్చేది అనే అర్దం మారింది. బతుకమ్మ అంటే చీరలు , బతుకమ్మ అంటే పార్టీ ప్రచారం, బతుకమ్మ అంటే ఒక వర్గానికి గాలం వేయడం అంటూ తమ రాజకీయ ప్రచారం కోసం బతుకమ్మను సాకుగా తీసుకుని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

బతుకు లేని బతుకమ్మ పండుగ,
కళ తప్పిన బతుకమ్మ పండుగ,
కాగితం పువ్వుల బతుకమ్మ.
పల్లె కన్నీరు పెడుతున్న బతుకమ్మ,
రాజకీయ ప్రచార బతుకమ్మ,
రంగులు వెలసిన బతుకమ్మ,
సంప్రదాయాలు మరచిన బతుకమ్మ,
ఆచారాలు లేని బతుకమ్మ,
ముండల బతుకమ్మ,
దగాకొర్ల బతుకమ్మ,
చాలీ చాలని బతుకుల బతుకమ్మ,
కబంధ హస్తాల బతుకమ్మ,
కడుపులు నింపని బతుకమ్మ ,

పస లేని బతుకమ్మ,
నేతన్నల కష్టాల బతుకమ్మ,
రైతన్నల గొసల బతుకమ్మ,
హరిజన కష్టాల బతుకమ్మ ,
గిరిజన అణిచివేతల బతుకమ్మ ,
ఎన్ని రాజ్యాలు వచ్చినా,
ఎన్ని పార్టీలు మారినా,
ఎంత నాగరికత వచ్చినా,
బతుకు లేని బతుకమ్మ …..

అందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *