మా వోడు – ఇంటింటి రామాయణం

మా వోడు - ఇంటింటి రామాయణం

మా వోడు – ఇంటింటి రామాయణం

మగాడి ప్రతి విజయం వెనక ఆడది ఉంటుంది అంటారు. కానీ ఆడదాని ప్రతి కన్నీటి బొట్టు వెనక ఒక మగాడు ఖచ్చితంగా ఉండి తీరతాడు. అది భర్తనా, ప్రియుడా, లేదా స్నేహితుడో ఇలా ఎవరైనా కావచ్చు, కానీ మగవాడు ఆడదాని శరీరంతోనూ, మనసుతోనూ రెండు విధాల ఆడుకుంటే ఆడది ఆ బాధని ఎవరితో చెప్పుకుంటుంది.

మగాడికి ప్రతి విషయం లోనూ ఆడది లేకుండా గడవదు, కానీ ఆ విషయం అతనికి అదే మగాడికి తెలియదు. తెలిసినా అంతగా పట్టించుకోడు, నా పైనే అది అంటే ఆడది ఆధారపడి ఉందనే ఒక భ్రమలో బతుకుతూ ఉంటాడు, అయితే మగాడిని ఎప్పుడూ ఆడది పేరు తెస్తూనే ఉంటుంది, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం…

తల్లి కడుపులో ఉన్నది ఏ బిడ్డ అయినా ఆ తల్లి బిడ్డను చూడకుండానే నా బిడ్డ బంగారం అని మగాడిని బంగారంతో పోలుస్తుంది. పుట్టిన తర్వాత మగ పిల్లాడు అయితే వాడు ఎలా ఉన్నా నా కొడుకు వజ్రం అని వజ్రంతో పోలుస్తూ మురిసిపోతుంది. అమాయకుడు నా కొడుకు అని తల్లి వెనకేసుకుని వస్తుంది. ఇక చెల్లి లేదా అక్క ఉంటే వాడికేమి తెలియదు చిన్నవాడు అని, లేదా నా అన్ననే గొప్ప అని గొప్పగా అందరికి చెప్తుంది. ప్రియురాలు తన ప్రియుడిని ధైర్యం గలవాడు అని అంటుంది.

ఇక భార్య తన భర్తను శ్రీ రామచంద్రుడు అని అంటూ తన భర్తకు ఏమి తెలియదని వెనకేసుకుని వస్తుంది. ఆ తర్వాత ఆడది అతన్ని అంటే మగవాన్ని తండ్రిని చేస్తుంది. తన కుటుంబానికి ఆమె అన్ని చేసుకుంటున్నా కూడా తన భర్తకు ఒక విలువను, గౌరవాన్ని ఇస్తుంది. కాదు వచ్చేలా చేస్తుంది. ఎవరైనా తన భర్తకు విలువ ఇవ్వక పోతే వారితో గొడవ పడుతుంది (ఇది మూర్ఖ భర్తలకు మినహాయింపు), వారిని జీవితంలో క్షమించదు. ఇక పోతే పిల్లలు అది ఆడపిల్ల అయినా మగ పిల్లాడు అయిన తమ తండ్రిని హీరో లా చూస్తారు, హీరోని చేస్తారు కూడా..

అతని అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటాడు కొడుకు, తన తండ్రి లాంటి మగాడు తనకు భర్తగా రావాలని కోరుకుంటుంది కూతురు. పెళ్లిళ్లు అయ్యాక తన పిల్లలకు తాతయ్యాలా అవ్వాలి అని చెప్తుంది. చివరికి తండ్రి వృద్ధులు అవ్వగానే తనకు తోచిన, తన శక్తికి తగ్గట్టుగా సేవ చేస్తుంది. తండ్రి చనిపోతే అతని మీద సంకోచించకుండా పడి పోయి శోకాలు పెడుతూ తన ప్రేమని తెలియచేస్తూ ఏడుస్తుంది. ఇంత చేసిన ఆడదాన్ని మాత్రం మగాడు మాత్రం ఇప్పటికీ చెప్పు కింద రాయిలా అణచివేస్తూ ఉన్నాడు.

కానీ వాడికి తెలియని విషయం ఏమిటి అంటే ఆడది లేకుండా మగాడి జీవితం లేదు. అసలు తన జీవితానికి విలువే లేదు. వాడేమి చేసినా అంటే ఆచారం సంప్రదాయం ప్రకారం ఏ క్రతువుని చేసినా అది నిష్ప్రయోజనం, అందుకే శ్రీరాముడు యాగం చేయాలి అని అనుకున్నప్పుడు సీత బంగారు ప్రతిమను చేయించి పక్కన పెట్టుకుని చేసాడు. భార్యని అడవికి పంపిన తర్వాత ఇక ఏ బంగారం, వెండి పెట్టుకుంటే ఏమి లాభం కదా, అందుకే మగాడు ఆడది లేకుండా అసలు ఉండలేడు..

ఒంటరి తల్లులు ఉన్నారు కానీ ఒంటరి తండ్రులు లేరు ఒకవేళ ఒంటరి తండ్రులు ఉన్నా సమాజానికి తెలుసో, తెలియకనో రహస్యంగా ఆడదానితో కోరికలు తీర్చుకుంటూ, ఆమె ఒళ్లో సేదదీరుతూ ఉంటారు. అదే ఒంటరి తల్లి అదే సమాజానికి భయపడి లేదా పిల్లలకు చులకన కావొద్దు అని తన జీవితం కలిపోతున్నా కూడా ఆమె మగాడి అండ లేకుండా బతకగలదు.

మగాడి అండ అవసరం లేక పోయినా ఆడది తల్చుకుంటే అటు సమాజాన్ని, ఇటూ ఇంటిని అన్ని విధాల తన రెక్కలతో మోయగలదు. కానీ మగాడు ఏ చిన్న పని చేయాలనుకున్నా ఆడదాని సలహా తీసుకుంటాడు. ఆడవాళ్లు తమ తెలివితేటలు తమకే కాకుండా పొరుగు వారికి కూడా ఉపయోగపడేలా చెయ్యగలరు. అందుకే రాజకీయాల్లోనూ, సేవా రంగంలోనూ ప్రస్రమిక రంగంలోనూ ఆడవాళ్లు దూసుకుపోతున్నారని చెప్పవచ్చు.

అయితే ఇదంతా మా వల్లనే సాధ్యం, మేము లేకపోతే వాళ్ళు లేరు అనే మొగవాళ్ళులేకపోలేదు, అందులోనూ ఆడవాళ్ళ వల్లనే మా జీవితాలు నాశనం అయ్యాయి అని అనే మగవాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలి అంటే ఆడవాళ్లు కావాలని ఏ తప్పు చేయరు. మగాళ్ల ప్రవర్తన బట్టి ఆడవాళ్ళ నిర్ణయం ఉంటుంది వాళ్ళు మంచిగా ఉంటే మంచిగా చెడ్డగా ఉన్నా మంచిగా ఉండడం ఆడదానికి వెన్నతో పెట్టిన విద్య.

అయితే ఆడవాళ్ళు తన కాపురంలో ఎన్ని కలతలు వచ్చినా, భర్త తాగుబోతు, తిరుగుబోతు, జూదరి, వ్యభిచారి అయినా, అన్నింటికి తట్టుకుని అతన్ని మార్చాలని, తన సంసారంలో పరాయి వాళ్ళు ఉండకూడదు అని అనుకుంటూ తన పుట్టింటి వారికి కూడా తన బాధలు చెప్పకుండా ఇది తన ఇల్లు, తన సంసారం అని అనుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తోంది.

కానీ మగవాడు దాన్ని ఆమె చేతకాని తనం, తాను లేక పోతే ఆమె బతక లేదు అని, తానే గొప్ప అని, తాను ఆమెని చేరదియ్యకపోతే ఈ లోకంలో ఆమె బతక లేదని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆడది ఒక్కసారి వద్దు అని నిర్ణయించుకున్న తర్వాత, ఆమె అద్దం లాంటి మనసు విరిగిన తర్వాత, లోకం అంత ఒక్కటైన ఆమె తన భావబంధాలను వదులుకుని పోవడానికి వెనుకాడదు. ఇవ్వన్నీ ఒక వైపు అయితే ఆడది భర్తతో పాటూ ఉంటూ, అతను ఏమి చేసినా చూసి చూడనట్లు వదిలేస్తూ, అతని వెనక ఎన్ని పనులు చేసినా ఎవడూ అడగడు.

ఎందుకంటే భర్త ఉండగా భార్య అలా చేయదు అని అనుకుంటారు అందరూ, మగాళ్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా భార్య విధేయులుగా, భార్య గీసిన గీత దటము అనేలా ఉంటారు కానీ వాళ్ళు చేసేవి చేస్తూ భార్య దగ్గర తమ నమ్మకాన్ని పోగొట్టుకునే వరకు తెచ్చుకుంటారు, అలా ఉన్న మగవారి భార్య అతన్ని బాగా నమ్ముతుంది, అతని కోసం ప్రాణాలను అయినా ఇవ్వడానికి సిద్ద పడుతుంది..

కానీ ఒక్కసారి నమ్మకం కోల్పోతే అతన్ని కన్నెత్తి కూడా చూడదు. అలా ప్రేమించే భార్య దొరకడం అతని అదృష్టం అనుకోవచ్చు. కానీ, కొందరు మూర్ఖులు అలాంటి ప్రేమను కాదని ఎండ మవుల వెంట పరుగు తీయాలని, అవే కావాలని అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయో, వారు చేరుకున్న గమ్యం, వారు అనుకున్న తీరం, వారి ఊహలు నిజం అయ్యాయా లేదా అనేదే నా, మన ఈ ఇంటింటి రామాయణం కథ ..

ఇది ప్రతి ఇంటిలోనూ జరిగేదే అయితే అందులోని పాత్రలు, పాత్రధారులు, స్థలాలు, పట్టణాలు అన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు, అన్ని నిజాలు చెప్తే ఎవరు ఎలా స్పందిస్తారో తెలీసుకోవాలని తొందరగా ఉంది నాకు అయితే మరి మన ఇంటింటి రామాయణాన్ని మొదలు పెట్టాలి అంటే మనం బాగుండాలి కదా మన ఇలవేల్పు వేంకటేశ్వరుని సాక్షిగా అన్ని నిజాలు రాస్తాను అని నమ్మకంగా చెప్తున్నాను.

ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు అని నేను చెప్పను ఇప్పుడున్న పరిస్థితిలను వివరంగా వివరిస్తూ చెప్పడమే నా లక్ష్యం. దాని వల్ల ఎవరు మారరు అని తెల్సు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు అని తెలుసుకుంటారు అని, ఇక దీనికి మా వోడు అని పేరు ఎందుకు పెట్టాను అంటే భర్త గురించి భార్యలు పక్కింటి వాళ్ళ తోనో, ఎదురింటి వారి తోనో చెప్తూ…

మా వోడు అంటే నా భర్త అని అనడం నేను చాలా సార్లు విన్నాను, మా వోడు అని అంటే వారి భాషలో అర్థం నా మొగుడు అని, అలాంటి పదాలు అప్పుడప్పుడు పల్లె లొనే కాదు కొన్ని సార్లు పట్టణాల్లో కూడా అంటూ ఉంటారు, అలా అందరికి అర్థం అయ్యే విధంగా ముఖ్యంగా పల్లె జనాలకు అర్థం కావాలి,అలాగే పట్టణంలో ఉన్న ఈ తరం వారికి కూడా ఈ పదాలు, అర్థం తెలియాలని ఆ పేరు పెట్టాను….

ఇది ధారావాహిక నా, నవలగా వస్తుందా అనేది నాకే తెలియదు. కానీ, వివరంగా, విపులంగా, విప్పి చెప్పాలనే నా చిన్న ప్రయత్నం దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ…  మీ భవ్య …

(ఆడది మగాన్ని కాదని ఒక్క క్షణంలో వెళ్లి పొగలదు, కానీ అలా చేస్తే తన మొగుడికే పరువు తక్కువ అని ఆలోచిస్తుంది కాబట్టి ఎన్ని అఘాయిత్యాలు చేసిననా సహించి, ఓపికతో ఓర్చుకుని ఉంటుంది)

– భవ్యచారు

కాలం నేర్పిన పాఠం Previous post కాలం నేర్పిన పాఠం
యోధ ఎపిసోడ్ 9 Next post యోధ ఎపిసోడ్ 9

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *