మానసిక తత్వం!!

మానసిక తత్వం!!

నీ బానిసను, దొరా, నీ బానిసను అయ్యా…. ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. తెలంగాణ పరిభాషలో ఈ వ్యక్తాన్ని నీ బాంచన్ దొర, నీ బాంచన్ అయ్యా అంటారు.

ఈ మాటల్ని ఉచ్చరించే వ్యక్తి, దీన్ని ఒక సమ్మోహనాస్త్రం గా ఉపయోగిస్తాడు. యజమానిని కూలీ డబ్బులు అడగడానికో, లేదా కొంత మొత్తం అప్పుగా అడగడానికో, లేదా తన స్థాయిని మించి ఏదైనా అవసరాన్ని కోరడానికో, నీ బాంచన్ దొరా అనడం అందరి అనుభవంలో వినే ఉంటారు.

బానిసత్వాన్ని ఈ కోణం నుంచి చూస్తే, దాని పరిధి చాలా సంకుచితం అవుతుంది. నీ బాంచన్ అయ్యా అని ఉచ్చరించే జనాలు, ఎక్కువ శాతం నిరక్షరాస్యతతో, పేదరికంతో బాధపడుతూ ఉంటారు. ఈ పదాన్ని వీరికే పరిమితం చేస్తే పరిధి మరి సంకుచితమే……..!

బానిసత్వం అనేది ఒక మానసిక తత్వం. దీన్ని ఈ కోణం నుంచి ఆలోచిస్తే దీని పరిధి ‘విశ్వమంత’ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

బానిసత్వాన్ని నేను గొప్ప అమోఘమైన ఒక మానసిక ఔనత్యం గా అభివర్ణిస్తారు. ఇది ఎదుటివారిని బంధించ గల గొప్ప బ్రహ్మాస్త్రం. ఏంటి ఈయన విచిత్రంగా చెబుతున్నాడు అనుకుంటున్నారా….? పర్వాలేదు. నా ధోరణి నాది. బానిసత్వం అనే తత్వంలో, ఓర్పు, సహనం, విధేయత, ఇలా ఇంకా ఎన్నో సద్గుణాలు మిళితమై ఉన్నాయి.

ఇవే ఇంతకు ముందు చెప్పినట్టు పేదలకి నిరక్షరాస్యులకు గొప్ప బ్రహ్మాస్త్రాలు. నీ బాంచన్ దొరా అనడానికి వీరు ఏమాత్రం సిగ్గుపడరు. వారి అల్పమైన కోరికలను ఇలా పెద్దల నుంచి పొంది సంతృప్తి చెందే అల్పసంతోషులు వీరు. అయితే మనం ఇక్కడే ఆగిపోతే దీని విశాలమైన తత్వం సంకుచితం అయిపోతుంది.

నేను దీని పరిధిని విశ్వాంతరాళంలో కి వ్యాపింప చేసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఒక చిట్టి ఉదాహరణతో.

నాలో ఈ తత్వం లోపించింది. ఫలితంగా నలుగురిది ఒకదారైతే నాది ఒక ప్రత్యేక దారి. ఇందులో సుఖం ఉందంటారా? అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా నేను లేదని చెప్తాను.

నా 10 గంటల ఉద్యోగంలో, నాకు వరుసగా ఎనిమిది గంటలు బోధనా బాధ్యతలు. మిగిలిన రెండు గంటలు విరామం. ఈ విరామం పేరుకు మాత్రమే అండి. అప్పుడూ, ప్రధాన బోధకులు సెలవు అంటూ మనకి ప్రత్యామ్నాయ బాధ్యతలు సిద్ధంగా ఉంటాయి. పేరుకి మాస్టర్స్ డిగ్రీ. చేసేది బానిసత్వం.

తీరా సాయంత్రం ఆరు గంటలకి హాయిగా ఇంటికి వెళ్లొచ్చు అని ఈల వేస్తూ ఎగ్జిట్ డోర్ దగ్గరికి వస్తే, అది తాళం వేసి ఉంటుంది. ఏంటి అని రిసెప్షన్లో అడిగితే మీటింగ్ అని చాలా సింపుల్గా చెప్పేస్తారు.

నాలో ఓర్పు, సహనము, విధేయత, అంకితభావం ఒక్కమాటలో బానిసత్వం ఒక్కసారిగా చచ్చిపోయింది. తలుపులు తెంచుకొని మరి నియమాలకు విరుద్ధంగా బయటికి వచ్చేశాను.

ఇంకేముంది మరుసటి రోజు బానిసలు అందరూ తరగతుల్లో బిజీ. నేను మాత్రం జిఎం గారితో స్పెషల్ మీటింగ్ లో సిట్టింగ్.

కొసమెరుపు:- ఆ, జి ఎం అనే వ్యక్తి యాజమాన్యానికి పెద్ద బానిస. ఆయనలో ఓర్పు, సహనము, విధేయత, అంకితభావం మోహంలో విలయతాండవం చేస్తాయి.

– వాసు

Previous post ఆకలని కేకేస్తే
Next post ఆకలి రాజ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *