మార్పు తెలుసుకో

 మార్పు తెలుసుకో

తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేని అమ్మాయి సౌమ్య. పేరులాగానే చాలా సౌమ్యంగా, నెమ్మదస్తురాలు. సౌమ్య చాలా ముందు చూపున్న అమ్మాయి. తను చదువుకోసం పక్క ఊరిలో ఉన్న కాలేజికి పంపించాలని, అక్కడ హాస్టల్ లో వుంచి, చదివించాలని తన తల్లిదండ్రుల నిర్ణయం.
తను ససేమిరా వెళ్ళను, ఇంటి దగ్గర నుంచి, అదీ ఊర్లో వున్న ప్రభుత్వ కాలేజీకి వెళ్తానని చెప్పేసింది. ఇంక చేసేది లేక, ప్రభుత్వ కాలేజీకి పంపించారు. మూడు సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుంది.
ఇంకా చదువమని ప్రోత్సహించారు. ఎందుకంటే, సౌమ్యకు, చదువు ఆరో ప్రాణం. కానీ, తల్లిదండ్రులంటే పంచప్రాణాలు. అమ్మానాన్నకు దూరంగా వెళ్ళి చదువుకోవడం సౌమ్యకు అసలు ఇష్టం లేదు. తన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తూ, అమ్మానాన్నతో కలిసి సంతోషంగా ఉంది.
ఉద్యోగం చేసుకుంటూ ఎంతకాలం ఒంటరిగా ఉంటుందని సౌమ్యకు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళి చదువుకోకూడదు అనుకున్న సౌమ్య, పెళ్ళి అంటే వేరే ఇంటికి శాశ్వతంగా వెళ్ళాలనే ఆలోచనకు, తనలో తానే సంఘర్షణ పడి, ఒక ఆలోచనకు వచ్చింది.
తన తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం చూడాలని, వాళ్ళ బాధ్యత తీర్చుకునే అవకాశం ఇవ్వాలనుకుని, పెళ్ళికి ఒప్పుకుంది. తన ఆలోచనలు మార్పు చేసుకుని, కొత్తగా ఎదురయ్యే పరిస్థితులకు తనని తాను సిద్ధం చేసుకుంది.
నీతి: మార్పు అవసరమే. కానీ, ఎక్కడ, ఎప్పుడు మార్పు చేసుకోవాలో తెలుసుకుంటే, జీవితం ఆనందంగా వుంటుంది.
-బి.రాధిక

Related Posts