మహాసాధ్వి!!

మహాసాధ్వి!!

అవి వారు హైదరాబాదులో స్థిరపడిన తొలిరోజులు. ఇద్దరూ సరస్వతీ పుత్రులు అవడంతో. వారికి ఉద్యోగాలు దొరకడం పెద్ద కష్టమేమీ కాలేదు.

కాకపోతే కొత్త సమాజం, కొత్త వాతావరణం, కొత్త వృత్తి ధర్మాలు. అంతా సజావుగానే ఉంది. కాకపోతే కొంత ఆర్థికంగా పుంజు కోవడమే ఆలస్యం.

భార్యాభర్తలు ఇద్దరికీ, పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించాలని దృఢ సంకల్పం ఉండేది. దాంతో మంచి పేరొందిన విద్యాసంస్థల్లో వారిని చేర్పించారు. ఆ దంపతులకి ఆ పిల్లలే ఊరట. ఆ ఇద్దరూ చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండేవారు.

గీత ఆంగ్ల బోధకురాలుగా తన ఉద్యోగ ప్రయాణం ప్రారంభించింది. నిఘంటువు లోని అతి గొప్పనైన పదాలను పేర్చి ఒక స్త్రీ మూర్తి ని తయారు చేస్తే అవతరించిన మహాసాధ్వి గీత.

భగత్ కూడా ఆంగ్ల బోధకుడు. ఇతడు ఉపన్యాసకునిగా తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు. ఆంగ్ల భాషలో మంచి పట్టు ఉన్న వ్యక్తి.

తన గీతకి ఆంగ్ల గీతలు నేర్పింది కూడా ఈ గొప్ప శాల్తీ నే. ఇది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇలా ఇబ్బందులు లేని వారి జీవన ప్రయాణం ఒక సంవత్సరం సజావుగా సాగింది.

***********

వంట గదిలో గీత ఆ రోజు చాలా సేపు గడుపుతోంది. ఏంటో…. విషయం చూద్దామని భగత్ కిచెన్ లోకి వెళ్ళాడు.

పళ్ళని బిగిసి పట్టి పొత్తికడుపు ని చేతితో అదుముతూ వీపుని ద్వారం వైపు ఉంచి ముఖం చాటేసు కొని ఉంది గీత.

” ఏంటి, ఏమైంది? ” అని అడిగాడు భగత్.

” ఆహా, ఏమీ లేదండీ. కూర కలియబెడుతూ ఉన్నాను. ” చెప్పింది గీత.

” లేదు నువ్వు ఏదో అవస్థ పడుతున్నావు. నిజం చెప్పు. ” అన్నాడు.

” లేదండి, అలాంటిది ఏమీ లేదు.. కాస్త ఏమీ అనుకోకపోతే పిల్లలిద్దరికీ లంచ్ సర్దండి. ” అని దాటవేసే ప్రయత్నం చేసింది ఆమె.

” అలాగే ” అంటూ లంచ్ సర్డెశాడు భగత్.

********

ఇలా విషయాన్ని గుండెల్లో దాచుకొని. పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఆ సాధ్వి రెండేళ్లు గడిపేసింది. ఎంతటి మహోన్నతు రాలు ఆమె.

పిల్లల ఫీజులు చాలా అధికం, ఇంటి కిరాయి, పైపెచ్చు నిత్యావసరాలు, రోజువారి ఖర్చులు. ఆమెకే వస్తున్న విపరీతమైన కడుపు నొప్పికి గనక స్వరం ఉండుంటే ఈ విషయాన్ని భగత్ కి ఎప్పుడో చెప్పి ఉండేదేమో!!

*********

గీత ఉద్యోగానికి తయారవుతూ, బెడ్ రూం లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతకీ తలుపు తీయకపోవడంతో, తలుపు నెట్టి లోపలికి తొంగి చూశాడు భగత్.

నేల మీద దిండు వేసుకుని సోయలేనట్టు పడుకొని ఉంది గీత. వెంటనే ఆలస్యం చేయకుండా ఆటో తీసుకొని స్త్రీ వైద్య నిపుణులకి చూపించాడు భగత్.

“ఆపరేషన్ చేయాలి. ఒక లక్షన్నర అవుతుంది ఖర్చు.” అని చెప్పింది వైద్యురాలు.

ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి చెప్తూ తన బంధువు కి కాల్ చేశాడు భగత్. సహాయం అందక పోగా, “ఏదైనా ప్రభుత్వ దవాఖాన లో చేర్పించు, ఫ్రీగా చేసేస్తారు” అనే ఒక ఉచిత సలహా పడేసింది ఆ బంధువు.

గీత తాను తీసుకున్న గీత లోనే ఉంటూ, బాధల్ని దిగమింగుతూ, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరో ఆరునెలలు గడిపేసింది, ఇలా.

ఈ ఆరు నెలలు వారిద్దరి జీవితంలో అమోఘమైన నెలలు. భగత్ కి, గీత కి భగవంతుడు వరాల జల్లులు కాదండి కనక వర్షాన్ని కురిపించాడు.

వారి అంకితభావానికి కళాశాలల యాజమాన్యాలు వారికి పెద్దమొత్తంలో ఇన్సెంటివ్ ప్రకటించాయి. భగత్ తన స్నేహితులను నమ్మి అప్పుగా ఇచ్చిన 8 లక్షల రూపాయలు కూడా ఒక్కసారిగా వచ్చి చేతిలో పడ్డాయి.

*********

ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అది చాలా ఖరీదైన హాస్పిటల్. గీతని అక్కడ చేర్పించాడు భగత్. స్పెషల్ సింగిల్ ఏసి రూమ్ తన భార్యకి కేటాయించాల్సిందిగా ఆసుపత్రి వర్గాలని కోరాడు భగత్.

ఆపరేషన్ సక్సెస్. భగత్ తన బంధువు కి కాల్ చేశాడు.

” హలో, నేను భగత్”

అవతలి వ్యక్తి, ” ఆ, చెప్పు. ఎలా ఉన్నారు అందరూ? “

” గీతకి ఆపరేషన్ చేశారు. హాస్పటల్ లో ఉంది. “

” ఏ హాస్పిటల్? గాంధీ హాస్పిటల్ లా? ” బంధువు స్పందన ఇది.

” కాదు, ఆదిత్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్” చెప్పాడు భగత్.

” మరి లక్షల్లోనే కదా ఖర్చు” బంధువు ప్రశ్న.

” సంపాదించాను లేండి…. ” చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు భగత్.

*******

పిల్లలకి లంచ్ సర్దాడు. వంట కూడా భగత్ చేశాడు. ఆరు నెలలు గీత నిల్చో కూడదు. పిల్లలకి నోట్లో ముద్దులు పెడుతూ, గీతకి కూడా తినిపించడం అలవాటైపోయింది భగత్ కి.

గీత కోసం తాను కూడా ఉద్యోగాన్ని త్యాగం చేసిన ఉత్తముడు భగత్. అటు తర్వాత ఇక ఆ జంట జీవితంలో మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు.

అనురాగ సంగమం!!

– వాసు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *