మహిళా శక్తి

మహిళా శక్తి

1) ఆ.వె.
    అబలగాదు మహిళ.ఆదిపరాశక్తి
    కరుణజూపుతల్లి.కనకదుర్గ
    ఆపదున్న వేళ ఆదుకోజూచును
    జాలిగుండె కరిగి.మేలు చేయు
2) ఆ.వె.
     వనిత చేతగాని పనిలేదు వసుధలో
     నేర్పు.ఓర్పుగలిగి నెలత చేయు
     అలసటెరుగకుండు ఆలనా పాలనా
     కన్న సంతు సమము కరుణ జూపు
3) ఆ.వె.
     నేటి మహిళ లంత మేటిగా పోటీకి
     పురుషుల సమమంటు పోరు సలిపి
     విజయమందిరి తమ విజ్ఞానమును జూపి
     అన్ని రంగములను ఆక్రమించి
4) ఆ.వె.
     అంతరిక్షమంత “అవలీల”గా తిరిగి
     రణము గెలిచి “రమణి”రాజ్యమేలె
     రాజకీయమందు రాణించె “లేమలు”
     రాష్ట్రపతిగ “ప్రతిభ”రాణకెక్కె
5) ఆ.వె.
    కదనరంగమందు.కడలియంచులయందు
    పారిశుధ్యమందు.పాడియందు 
    సైన్యమందు.వైద్యసేవలందేగాక
    ఇంటిపనులుపెక్కు.వంట వనితె
6) ఆ.వె.
     చేతివృత్తులన్ని సులభమ్ముగాజేయు
     నాణ్యతలను బెంచు నవ్యరీతి
     ఆటబొమ్మలన్ని అలవోకగా జేయు
     కొనెడి వారిమనసు కొల్లగొట్టు
7) ఆ.వె.
     అంతరిక్షమంత అవలీలగా నెంచి
    క్షిపణులను విడిచిన చిన్నదాన
    నింగి నీకు హద్దు నీగుండె నీబలం
    నారిగావు వింటినారివమ్మ
8) ఆ.వె.
     మహిళ మనసు దృఢము మరలదు వెనుకకు
     తలచినట్టి పనిని తప్పకుండు
     శక్యమా?యిదియన సాధించి తీరును
     వనితలోకమునకు వందనమ్ము
9) ఆ.వె.
     స్త్రీ.పురుషుల పొందు సృష్టికి మూలము
     సకలజీవధర్మ సహజ గుణము
     ఇరువురు సమమైన యినుమడించు ప్రగతి
     భావి సౌధమునకు ప్రథమ పథము
10) ఆ.వె.
      ఆడజన్మ లేక అవని పూర్ణముగాదు
      సృష్టి కార్యమెల్ల శూన్యమగును
      ఏకచక్ర శకటమేరీతి సాగును
      రమణి తోడు వున్న రక్ష మనకు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో

– కోట

Related Posts