మమతల పందిరి

మమతల పందిరి

చిన్న కుటుంబం మేమిద్దరం, మాకు ఇద్దరు. ఇంకా మాకు ప్రపంచంతో పనిలేదు అనుకుంటున్నారు ఇప్పటి యువత. కానీ కష్టమైనా,సుఖమైనా ఆదుకునేందుకు నలుగురూ కావాలంటే అప్పటికప్పుడు ఫ్లైట్ లోంచి దిగుతారా కనకం. చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష అని మురిసిపోతే,పిల్లలకి చదువులు అయిన తరువాత పెళ్ళి సంబంధాలు తెలియాలన్నా,పిల్లలకి రక్త సంబంధాలు తెలియక ఎవరితోను కలవకపోతే, వారికి అమ్మ పుట్టింటివైపు, నాన్న పుట్టింపువైపు బంధాలతో సంబంధం లేకుండా పెంచితేనే, ఏ పెళ్ళిళ్ళ కెళ్ళినా, పెరంటాలకెళ్ళినా మూడీగా ఒక సెల్ ఫోన్ పుచ్చుకుని,ఒక మూల కూర్చుండిపోతారు పిల్లలు. కనకం,మనం ఎన్నాళ్ళుంటాం? మనం పోయిన తరువాత తోడు అనేవారు ఎవరూ లేక పిల్లలు అల్లాడిపోతారే.

పిల్లల్ని శెలవులలో పిక్నిక్ లకి, టూర్ లకు తీసుకెళ్ళటం గొప్పగా ఫీలవుతున్నారు ఈ తరం. కానీ,అమ్మమ్మ ఇంటికి,నానమ్మ ఇంటికి వెళితే ఆ మమకారపు మాటలు,అందరితో కలసి ఎలా బ్రతకాలో అర్ధం అవుతుందే అని ఆడపడుచు సరళ చెప్తోంటే,ప్రక్కకు తిరిగి మూతి తిప్పుకుంటోంది కనకం . అవునులే,నేను పెద్దదాన్ని ఇలా చెబితే మీకు వేళాకోళంగా ఉంటుంది కానీ,నిజానికి ఈ సారి శెలవులకు మా తమ్ముణ్ణి మచిలీపట్నంలో ఉన్న మా అమ్మా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమను. అక్కడా బీచ్ లు,గుళ్ళు ఉన్నాయి.

అమ్మ చేసే సంప్రదాయమైన వంటలు, అమ్మ కొసరి కొసరి ప్రేమగా వడ్డిస్తుంటే, ఆ ప్రేమ కలిపిన భోజనం ఎంత బాగుంటుందో. వెన్నెలలో మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడు చెప్పిన కథలు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయే కనకం. ఉమ్మడి కుటుంబాలంటే మీకు చులకన అయిపోయింది కానీ ఆ బంధాలతో ముడిపడిన జీవితాలు ఎంత హాయిగా ఉంటాయో.

ఏదన్నా పెళ్ళనగానె బెలబెలా పది మంది వచ్చి అందరూ ఎవరికి తోచిన పని వారు,పెద్దవాళ్ళైతే సలహాలు ఇస్తూ ఉంటే మనకు టెన్షన్ ఉండదు కదా. ఉమ్మడి కుటుంబం అంటేనే మమతల పందిరి తెలుసుకో కనకం.

– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *