మనశ్శాంతి

మనశ్శాంతి

మనశ్శాంతి

పుట్టినప్పుడు అల్లారు ముద్దుగా పెంచుతారు. మాటలు రాకపోతే. మాటలు రావడం లేదు అంటారు. నడవకపోతే నడవడం రాదు అంటారు. చదవకపోతే నీకు చదువు రాదు అని ఎద్దేవా చేస్తారు.

ఇంకొకరితో పోలుస్తూ ఎక్కిరిస్తారు. ఉద్యోగం రాకపోతే ఇంకెన్నాళ్ళు బలాదూర్ గా తిరుగుతావు ఏదైనా పని చూస్కో అంటారు. ఎంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే అయ్యో తక్కువ జీతం అంట కదా అని పెదవులు విరుస్తారు.

ఆపై పెళ్ళంటారు… పెళ్లి అవ్వకపోతే, అయ్యో ఇంకా పెళ్లి కాలేదా నీలో ఏదో లోపం ఉంది అంటారు. పెళ్ళయితే పిల్లలు ఏరి అని అడుగుతారు. పిల్లలు పుడితే అయ్యో ఆడపిల్లా అంటారు…

అబ్బాయి పుడితే ఆహా అదృష్టవంతుడు అని మెచ్చుకుంటారు.. పిల్లలు పెరిగేకొద్దీ వాళ్ళకి అన్నీ సమకూర్చకపోతే నువ్వు సమర్థవంతుడువి కాదు అని ముద్ర వేస్తారు.

పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెంపకం అలా ఉంది అని నిందలు వేస్తారు. పిల్లలని వారు కోరినట్టు చదివించకపోతే పిల్లల దృష్టిలో రాక్షసుడిని అవుతాను.

ఇంట్లో వాళ్ళు, అర్ధాంగి కూడా అర్దం చేసుకోకపోగా మాటల తూటాలతో గుండెను గాయపరుస్తారు. నా శక్తి ఇంతే అని గట్టిగా ఆరవాలని అనిపిస్తుంది.

కానీ సమాజానికి భయపడి అప్పులు చేసైనా పిల్లలని చదివించాల్సి వస్తుంది. నా మనసును ఎవరూ అర్దం చేసుకోలేరు… అర్ధరాత్రి మెలుకువ వచ్చి బాధ్యతలు అన్నీ భయపెడుతూ ఉంటాయి. ఈ సమాజం ఎవర్ని మనశ్శాంతి గా బ్రతకనివ్వదు.

ఆ అర్ధరాత్రి నిశ్శబ్ద  సమయంలో నా మనసు ఘోష ఎవరికీ వినిపించకుండా నాలో నేనే కుమిలిపోతూ మనశ్శాంతి లేక గడిపే నిశ్శబ్ద యంత్రాన్ని నేను.

 

-భవ్యచారు

 

అది చాలదూ Previous post అది చాలదూ
కనుల కాగడాలు  Next post కనుల కాగడాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close