మనసుని తట్టిన తాలింపు 

మనసుని తట్టిన తాలింపు 

 

రాజేష్ కి ఢిల్లీలో  ఒంటరి జీవితం అలవాటైనా, వంట వండుకోలేక బద్ధకంతో బజార్లో పడి పరాయివాళ్ళ వంటని తినే అలవాటు మాత్రం రాలేదు. తను వంట వండితే ఒక రకంగా తిరుగుండదు అనే పేరు కూడా ఉంది. తాను చేసేది ఇంజనీర్ ఉద్యోగమైనప్పటికీ వంట వండటంలోనే ఎక్కువ సంతృప్తిని వెతుక్కొనే రాజేష్, నిరంతరం కొత్త వంటకాల్ని నేర్చుకోవడంలో మంచి దిట్ట. తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ లో  వారంలో ఒక్కసారైనా అందరి మనసుల్ని తట్టిలేపే ఘుమఘుమలాడే తాలింపు పెట్టి ఆశ్చర్యానికి గురిచేస్తాడు. అందరి ఇళ్లల్లో ఆదివారం ఏదో ప్రత్యేకమైన మాంసాహారమో, లేక మరేదో ఉంటే రాజేష్ ఇంట్లో మాత్రం పప్పుచారు ఉంటుంది.

ఆ పప్పుచారు కోసం పెట్టే తాలింపుకి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. అందుకే రాజేష్ తాలింపు పెట్టగానే ఆ సువాసనకి ముక్కుపుటాలు స్పందించిన ప్రతీ ఒక్కరూ అతని ఇంట్లో ఒక్కసారైనా భోజనం చేసే అదృష్టం దొరికితే బాగుండని కోరుకొనేవారు చాలామంది. కానీ, ఓ ఆదివారం చాలా కొత్తగా మొదలైంది. తాను తాలింపు పెట్టిన మరుక్షణమే ఎవరో డోర్ బెల్ ని మోగించారు. తెరిచి చూస్తే ఒక పెద్దావిడ తనకెదురుగా నిలబడి ఉంది. ఆమెని చూసి ఆశ్చర్యపోయిన రాజేష్ తొందరగా తేరుకొని, 

” ఎవరు కావాలమ్మా!” అని అడిగాడు. 

” హా… ఎవరికోసమో రాలేదు బాబు. నా పేరు మాలతి, ఆ తాలింపు సువాసనుంది చూడు, దానికోసమే వచ్చాను. అలా తాలింపు పెట్టడం మీ భార్య ఎక్కడ నేర్చుకొందో!” అని తన కళ్లజోడు సరిచేసుకొంటూ  అంది. ” లోపలకి రండమ్మా !” అని రాజేష్ ఆమెని లోపలికి పిలిచాడు. ఆమె లోపలికొస్తూ… ” మీ భార్యనొక్కసారి పిలువు. తనని అభినందించాలని ఉంది” అని ఆతృతగా అడిగిందామె. ” అమ్మా… నాకింకా పెళ్లి కాలేదు. ఆ తాలింపు పెట్టింది నేనే” అని భుజమీదున్న తువాల్ని తడుముకొంటూ తలదించుకున్నాడు.

” నిజమా!.., నేను నమ్మలేకపోతున్నా. ఒక మగవాడు ఇలాంటి వంట చేయడం నిజంగానే అద్భుతం. ఈ రకమైన తాలింపు పెట్టడం ఆడవాళ్లకే సాధ్యం కానీ పని. అయినా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఇంత బాగా తాలింపు పెట్టేవాడిని ఏ అమ్మాయి కాదనుకొంటుంది. ఈ తాలింపుకి ఇలాంటి సువాసన, రుచి రావడానికి చాలా కష్టంతో కూడిన నియమ, నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇలాంటి తాలింపు వాసన నా జీవితంలోనే చూడలేదు. నీవు ఏమి అనుకోకపోతే, కాస్తంత నాకు పెడ్తావా బాబు!” అని ధీనంగా అడిగిందామె.

” అయ్యో!… మీరు అడగడం నేను వద్దనడమా. ఇక్కడే నిరభ్యంతరంగా భోజనం చేసి వెళ్ళండి. మీకు ఈరోజు  భోజనం పెట్టడం నేను అదృష్టంగా భావిస్తాను” అని రాజేష్ వంటగదిలోకి వెళ్ళాడు. రాజేష్ తన ఇంటిని అలంకరించుకున్న తీరుకి ఆమె ఇంటినంతా కలయచూస్తూ ముచ్చటపడిపోయింది. అంతలోనే రాజేష్ తాను వండిన వంటల్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీదా పెట్టాడు. గోడమీద వేలాడదీసిన తన పెయింటింగ్ చూస్తున్న ఆమెని,” అమ్మా… భోజనం సిద్ధంగా ఉంది. మీరు కూర్చోడమే ఆలస్యం” అని పిలిచాడు. 

మనసుని తట్టిన తాలింపు
మనసుని తట్టిన తాలింపు

” హా…వస్తున్నా బాబు. వంటలాగే, నీ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి” అని చెప్తూ తన సొంతింటిలాగే నిర్మోహమాటంగా చేతులు కడుక్కొని వచ్చి కూర్చోంది. రాజేష్ ఆమెకి వడ్డించి అలాగే నిలబడ్డాడు. దాంతో ఆశ్చర్యపోయిన ఆ పెద్దావిడ, ” అయ్యో!…నీవు కూర్చోకుండా నేను ఒక్కదాన్నే తినడం భావ్యం కాదు. అమ్మా అని పిలుస్తూ కూడా నన్ను పరాయి వ్యక్తిలాగే చూస్తున్నావ్ కదా” అని ఆమె నిరాశపడేసరికి, ” అలా ఏమి లేదమ్మా… మీరు నా ఇంటికొచ్చిన ముఖ్య అతిథి కదా. అందుకే మీతోపాటు నేను కూడా కూర్చొని తినడం మర్యాదగా ఉండదని కూర్చోలేదు”

” అలాంటి పట్టింపులేమి అవసరం లేదు. నీవు నా కొడుకులాంటి వాడివి. నాతోనే తినడం వల్ల నా కిరీటం ఏం కిందపడదు” అని అనేసరికి రాజేష్ మొహమాటపడుతూనే ఆమెకి ఎదురుగా కూర్చొన్నాడు. ” అవును బాబు! ఇంతకీ నీవు పెళ్లేందుకు చేసుకోలేదు? నీకు పెళ్లి జరగలేదంటే నాకు చాలా విచారంగా ఉంది. నీవు భోజనానికి కూర్చొన్న విధానం, తినే పద్ధతి అన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇలాంటి మగవాడిని కట్టుకోడానికి ఆడది ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి” అని ఆమె చెప్తుంటే రాజేష్ పెదవి విరిచాడు. మళ్ళీ తనే కల్పించుకొని, ” ఇలా తాలింపు పెట్టడం ఎవరి దగ్గరా నేర్చుకొన్నావ్?” అని తన ఆసక్తిని చంపుకోలేక ముక్తసరిగా అడిగింది. 

” అమ్మా!… మీరు సంతృప్తిగా భోజనం చేస్తే ఏకంగా నా జీవితం గురించే చెప్తాను” అని అన్నాడు. ఆమె మరోమాట మాటాడలేదు. కాసేపటికి ఇద్దరి భోజనాలు అయిపొయాయి. రాజేష్ ఆమెకి మంచి రుచికరమైన ఓ చిలకచుట్టి అందించాడు. దాని రుచికి ఆమె ఆనందంతో పరవశించిపోయింది. ” అమ్మా!…ఇక్కడే కాసేపు సోఫాలో కూర్చోండి. నా  జీవితం గురించి చెప్తాను” అని రాజేష్  డైనింగ్  టేబుల్ని సర్దుతూ అన్నాడు.

” అలాగే బాబు!…” అంటూ ఆమె సోఫాలో  కూర్చొండిపోయింది. రాజేష్ అన్నీ సర్దేసి వచ్చి ఆమెకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొంటూ మొదలుపెట్టాడు. ” నేను, మీనాక్షి అయ్యర్ చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. మా పెళ్లికి అడ్డుచెప్పడానికి నా తరుపున ఎవరూ లేరు. కానీ ఆ అమ్మాయి తరపువారు ఒప్పుకోడానికి నా సామజిక బలహీనత అడ్డుపడింది. అందుకే ఇలా ఒంటరిగా మిగిలిపోయాను” అని రాజేష్ మదనపడ్డాడు. ఆ పేరు వినగానే ఆమె గొంతులో ఏదో తడబాటు తొణికిసలాడింది. అప్పటి వరకు కులాసాగా సోఫాలో కూర్చొన్న మాలతి కంగారుగా, ” ఆ… అమ్మాయిదే ఊరు?” అని అడిగింది. 

                                                        #        #         #        #         #

” కేరళలోని అల్లెప్పేయ్ తన ఊరు. మీనాక్షి  తన కుటుంబానికి నన్ను పరిచయం చేస్తానని చెప్పి వాళ్ళ సొంతూరికి తీసుకెళ్లింది. ఎందుకో తెలియదు గానీ,  నేను భయపడుతూనే వెళ్ళాను. నేను మొదటి పరిచయంలోనే వాళ్ళ నాన్నగారికి, అన్నయ్యకి బాగా నచ్చాను. కానీ వాళ్ళ అమ్మగారికే నచ్చలేదు. వాళ్ళ అమ్మ వంట చేయడంలో మహా సిద్దహస్తురాలు. తన కూతురు ఇంటికి వచ్చిన ప్రతీసారి పప్పుకి ప్రత్యేకమైన తాలింపు పెట్టి కడుపునింపి పంపేది.

నేను వెళ్లినరోజు కూడా ఆ రుచికరమైన తాలింపు పెట్టారావిడ. వాళ్ళ కుటుంబంతో పాటు నేను కూడా ఆమె వంటని ఆనందంగా తిన్నాను. ఆమె మొదటి నుండే నన్ను అనుమానంగానే చూసింది. మొదటిరోజు మధ్యాహ్న భోజనాలయ్యాకా నదికి పక్కనే ఉన్న వాళ్ళింటి పెరట్లో కూర్చొని కబుర్లు చెప్పుకొంటుండగా, మీనాక్షి తన తల్లి దగ్గర నన్ను మెచ్చుకొనే ప్రయత్నంలో, ” అమ్మా!… నీకు ఆ తాలింపు దినుసుల్ని తయ్యారు చేసి, పప్పు వండటానికి రెండు రోజుల సమయం పడ్తుంది కదా, రాజేష్ అయితే ఒకే రోజులో వండగలడు. నీవు ఎంత రుచిగా అయితే చేయగలవో అంతకంటే అద్భుతమైన రుచితో  వండగలడు” అని నన్ను అనవసరమైన సాహసంలోకి నెట్టేసరికి నేను వణికిపోయాను.

మీనాక్షి వాళ్ళ అమ్మ నన్ను తన అల్లుడిగా అప్పటివరకు అంగీకరిస్తుందనే నమ్మకం కొంచెం ఉండేది. కానీ, ఆ సాహసంతో పూర్తిగా పోగొట్టుకున్నా అని అనిపించింది. మీనాక్షి మీద నాకు లోలోపల కోపం వచ్చినప్పటికీ మౌనంగా, ” లేదమ్మా!…క్షమించండి. నాకు మీలా అయితే చేయడం రాదు. నేను పెట్టే తాలింపు రుచి, మీ తాలింపు రుచి దరిదాపుల్లోకి కూడా రాదు. మీనాక్షి నన్నేదో ఆటపట్టిస్తోంది. మీరేం పట్టించుకోవద్దు. వంట చేయడానికి దాన్ని ఎలా వండాలో తెలిస్తే సరిపోదు. దాన్ని తినేవాళ్ళు వండేవారి మనసులో ఉండాలి. అందుకే వంటవాడు, తన వంట తినేవాళ్ల కడుపునింపాలనుకోడు, వాళ్ళ  మనసులు నిండాలని కోరుకొంటాడు. ఓ తల్లీ దగ్గర మాత్రమే అంత ప్రేమ ఉంటుంది. నా  దగ్గర అంత ప్రేమ ఉందని నేను అనుకోను” అని నేను తప్పించుకొనే ప్రయత్నం చేసినా, మీనాక్షి మళ్ళీ నన్ను ఇరకాటంలోకి నెట్టింది. 

“రాజేష్, నాకు అబద్ధం చెప్తే నేను తట్టుకొంటాను కానీ, అమ్మకి కూడా అబద్ధం చెప్పొచ్చా?” అని అడిగేసరికి నేను మౌనంగా ఉండిపోయాడు. “అమ్మా!… ఒకసారి మా కంపెనీ ఉద్యోగులందరికీ ఇచ్చిన విందులో సీఈఓ, అతని భార్య స్పెయిన్ నుండి ఢిల్లీకి వచ్చారు. పైగా ఆ విందుని ఫైవ్ స్టార్ హోటల్లో ఏర్పాటు చేశారు. సీఈఓ భార్య చెల్సియాకి ఆ హోటల్లో ఒక్క వంటకం కూడా నచ్చలేదు. కోపంతో ఆ విందుని  ఏర్పాటు చేసిన మా కంపెనీ ఢిల్లీ బ్రాంచ్ డైరెక్టర్ని ఉద్యోగం నుండి తీసెయ్యమని తన భర్తని కోరిందామె. ఎందుకంటే ఆమె మంచి భోజన ప్రియురాలు. మా డైరెక్టర్ విజ్ఞప్తి మేరకు, వెంటనే రాజేష్ ఆ హోటల్ వంటగదిలోకెళ్ళి ఒక స్పెయిన్ వంటకాన్ని వండి తీసుకొచ్చాడు. దాని పేరు పయెల్లా. 

దాని రుచి చూశాకా ఆమె రాజేష్ ని హత్తుకొని, బుగ్గమీద ముద్దుపెట్టి అభినందించింది. ఆ రోజే రాజేష్ భారతీయ వంటకమైన పప్పుకి ఒక రకమైన తాలింపు పెట్టాడు. ఆ వాసనకి అందరూ ఆ పప్పు దగ్గరికే  పరిగెత్తారు. అందరూ ఏం తిన్నారో, తినలేదో తెలియదు గానీ పప్పు తినకుండా మాత్రం ఎవరూ వెళ్ళలేదు.

మనసుని తట్టిన తాలింపు
మనసుని తట్టిన తాలింపు

రాజేష్ ఆ రోజు అందరికి ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోయాడు. రాజేష్ ఒప్పుకొంటే, చెల్సియా తన ఏకైక వారసురాల్ని అతనికిచ్చి పెళ్లి జరిపించడానికి సిద్దపడింది. కానీ అంతటి ఆస్తికి కూడా ఆశపడని రాజేష్,  నన్ను ప్రేమిస్తున్నట్లుగా అందరి ముందు ఒప్పుకున్నాడు. అప్పటికే నేను అతనికి నా మనసులోని మాట చెప్పి నాలుగేళ్ళలయ్యింది. అయినా ఎప్పుడూ నాకు బదులు చెప్పని రాజేష్ ఆ రోజు అలా చెప్పేసరికి నేనే నమ్మలేకపొయాను” అని మీనాక్షి అతని గతాన్ని విప్పిచూపింది. తన కూతురి మాటలు విన్నాక, మాటరాకా ఆమె గొంతు బొంగురుపోయింది. కాసేపు అలోచించి, ” సరేనయ్యా!, నేను వండిన పదార్థలతోనే ఆ పప్పుని నీవు వండిపెట్టు. అది గనుక నిజంగానే నేను వండేదానికంటే బాగుంటే, నిన్ను నా అల్లుడిగా స్వీకరిస్తాను” అని ముభావంగా అక్కడినుండి లేచి ఇంట్లోకెళ్ళిపోయింది. 

నా మూలంగా ఆమె కళ్ళల్లో కోపం కనపడింది. ఆమెకి నేను నచ్చకపోవడమనేది, నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా నా మీనాక్షి కోసం ఆ పప్పుని వండాను. నా దురదృష్టం కొద్దీ, ఆ పప్పు ఆమె వండిన పప్పు కంటే చాలా రుచిగా అయ్యిందని అందరూ మెచ్చుకొన్నారు, చివరికి తను కూడా ఒప్పుకొంది. కానీ అమె ముఖంలో నవ్వు మాయమయ్యింది. ఆమె అలా ఢీలాపడిపోయేసరికి నా మనసు విలవిల్లాడిపోయింది. అదే రోజు అర్ధరాత్రి ఏవరో గొడవపడ్తున్నట్లుగా అనిపించి నేను నిద్రలేచి, అటుగా వెళ్ళాను. మీనాక్షి తన తల్లితో గొడవపడ్తోంది. 

” మీనాక్షి!, మన కులం కానివాడితో నీకెలా పొత్తు కుదిరింది. అయినా నేను గత ఇరవయ్యేళ్ళుగా ఈ పప్పుని వండుతున్నాను. నాకంటే బాగా పప్పుని ఈ ఊర్లో ఎవరూ వండలేరు. కానీ వీడేంటి? ఒక నియమం లేదు, పవిత్రత లేదు, ఆచారం లేదు… అయినా అవన్నీ మన కులంలో పుడ్తే తెలిసేవి. పప్పు ఒక్కటి వండి నన్ను సంతోషపెట్టానని వాడు అనుకోవచ్చు. కానీ వాడు మన కులం కాదు. వాడు మనింట్లో వంటవాడిగా కాగలడేమో కానీ, నాకు ఎప్పటికీ అల్లుడు కాలేడు” అని తను అగ్గిమీద గుగ్గిలమయ్యింది.

” అమ్మా!…నీవు అతన్ని ఇష్టపడకపోవడానికి తనది వేరే కులం అయినందుకా, లేకా నీకంటే రుచిగా వండినందుకా? అతని మీదున్న అసూయతోనే ఆ పప్పుని పారబోశావు కదా. అతనికి తెలిస్తే ఎంత బాధపడ్తాడో తెలుసా? నాకోసం అన్నీ వదులుకొన్నవాడికి నేను అన్యాయం చేయగలనా?” అని కన్నీళ్లు పెట్టుకొంది మీనాక్షి. ” రేపు వాడిని పంపించేయ్. వాడు రావడం వల్ల నా ఇల్లంతా మలినపోయింది. రేపు నేను ఇంటిని శుభ్రపరుచుకోవాలి” అని మీనాక్షి మీద అరిచేసరికి ఆమె బోరుమంది.

నేను అదేరాత్రి అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండానే వచ్చేశాను. ఆ తర్వాత మీనాక్షి నాకు తన ముఖం చూపించే ధైర్యం లేక అమెరికా వెళ్ళిపోయింది. నేను ఇక పరిగెత్తే ఓపిక లేక ఇక్కడే ఉండిపోయాను. ఒంటరిగా వంట చేసే ఓపిక ఉంది కానీ, ఒంటరిగా కూర్చొని తినాలంటేనే ముద్ద దిగదు. ఆమెకి శ్రమ కల్గించినందుకు ఒక్కసారైనా క్షమాపణ చెప్పాలని ఉంది. కానీ నేను వాళ్ళింటికెళ్తే మళ్ళీ వాళ్ళు ఇల్లంతా  శుభ్రపరుచుకోవాలి. అందుకే ఆ సాహసం చేయలేదు” అని కళ్లు తూడ్చుకొంటూ రాజేష్ తలపైకెత్తి తనని చూశాడు.

ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన చీర కొంగుతో తన ముఖాన్ని దాపెట్టుకుంది ఆవిడ. కంగారుపడిన రాజేష్, ”  అయ్యో!… మీరెందుకు బాధపడ్తున్నారమ్మా. నా గతాన్ని చెప్పి మిమ్మల్ని బాధపెట్టినట్లున్నాను. నన్ను క్షమించండి అని అన్నాడు రాజేష్. ” నీ  గతంలో  ఉన్నది, ఆ మీనాక్షి తల్లిని నేనే బాబు” అని బోరుమంది మాలతి. ” నాకు ముందే తెలుసు. మిమ్మల్ని చూడగానే గుర్తుపట్టాను” అని రాజేష్ ధీనంగా తనని చూశాడు. 

” కానీ నిన్ను గుర్తుపట్టలేదు బాబు. నేను నీ ఎదిరింట్లో ఉండే నా బంధువుల దగ్గరకొచ్చాను. ఆ తాలింపు వాసన నన్ను అక్కడి నుండి లాక్కొచ్చింది. ఆ రోజు నేను నిన్ను చాలా దారుణంగా అవమానించాను. నీ  స్థానంలో ఇంకెవరున్నా నన్ను ఇంట్లోకే రానిచ్చేవారే కాదు. కానీ పాత విషయాలేం గుర్తుపెట్టుకోకుండా నన్ను సాధారంగా ఆహ్వానించి అన్నం పెట్టి, నీ గొప్పతనాన్ని చుపించావు. నీలాంటి సంస్కారం నాకు లేదయ్యా. ఆరోజు నేను చేసిన నీచమైన పనికి దేవుడు నాకు మంచి గుణపాఠం నేర్పించాడు. 

జీవితంలో ఎప్పుడు కూడా అస్సలు వంటగదిలోకే అడుగుపెట్టని కోడల్ని బహుమతిగా ఇచ్చాడు. ఇంట్లో వండుకోడానికి ఒక్క పాత్ర కూడా లేదు. కొడుకు, కోడలిద్దరూ ఉద్యోగాల హడావిడిలో పడి అంతా హోటల్ నుండే తెప్పించుకొని తింటున్నారు. నేను నీ మీదా అసూయపడ్డానో, లేకా ద్వేషించానో నాకైతే ఖచ్చితంగా తెలియదు. కానీ ఒక్క క్షణం కూడా నిన్ను మర్చిపోలేదు. నిన్ను క్షమించమని అడిగే ధైర్యం నాకు లేకుండా పోయింది. నీ దగ్గరికి తీసుకెళ్లమని నా కూతురి కాళ్ళు పట్టుకొని కూడా బ్రతిమాలను. కాని తన మనసు కరగలేదు. మీనాక్షి నాకు దూరమైంది. నా మనసు భారమైంది, చివరికి నీ చెంతకు చేరువైంది. నాదొక్కటే కోరిక, “నన్నొకసారి అత్తమ్మ అని పిలుస్తావా?” అని ధీనంగా అడుగుతుంటే రాజేష్ కి మాటలు రాక అలాగే నిర్వేదంగా ఆమెని చూస్తూ నిలబడిపోయాడు.

                                                                     #      #       #       #      #

అంతలోనే ఎవరో డోర్ బెల్ కొట్టిన శబ్దం విని రాజేష్ నిద్రలోంచి లేచాడు. శుభం పడిందనుకునే సమయానికి నిజం కలగా మారి కలతపెట్టింది. అదే కల నిజమయ్యేలా మీనాక్షి వాళ్ళ అమ్మా మాలతీ అయ్యర్ ఆ  తలుపుకి అవతల ఉండాలని రాజేష్ ఆశపడినట్లుగా కాలం ఆశిస్తుందో, లేదో విధికే తెలియాలి…

 

– రాజేష్ ఖన్నా

Related Posts