మనవుడు చేసిన మానసిక వైద్యం

మనవుడు చేసిన మానసిక వైద్యం

ఓ పెద్దమ్మ… నాలుగేళ్లుగా
బెంగపడింది.. నీరసపడింది…
ఒక సంవత్సరం నుండి మాత్రం
కాళ్లుచేతులు కదలని పరిస్థితిలో
మాటరాని జీవిగా పడి ఉంది
రామాపురంలో ఆ ఇంట్లో ఓ మంచంపై!
కొడుకులు మందులు వేయిస్తూ
సూదులు పొడిపిస్తున్నారు….
అబ్బేబ్బే వేలు ఖర్చుపెట్టినా
లేదు ఆమెలో ఏమాత్రం కదలిక…
రాలేదు ఆమె నోటికి చిన్నశబ్దం
తిరిగితిరిగారు లాభం లేదనుకున్నారు
ఇంటి వైద్యానికి ఆమెను పరిమితం చేశారు
తులసి తీర్థానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు
మోసి మట్టి చేసే ప్రాంతానికి తీసుకెళ్లడానికి
మాట్లాడుకుంచున్నారు… మోతగాళ్లను!!!
ఆ సంవత్సరం “సంక్రాంతి” వచ్చింది
“నాలుగేళ్ల తర్వాత”  అప్పుడే వచ్చాడు
అమెరికా నుండి మనవడు కారుణ్య
పరిస్థితి పరిశీలించి గ్రహించాడు…
మనసుపెట్టి ఆలోచించాడు..
కొత్తవైద్యం ప్రారంభించాడు.
నాలుగేళ్లుగా అటకెక్కిన ఆనందాలు
మళ్లీ చిగురింప చేయాలనుకున్నాడు..
బుడబుక్కల వాళ్ళని రప్పించాడు
పాములవాళ్లని తీసి తెప్పించాడు
గంగిరెద్దుల వాళ్ళని స్వాగతించాడు
జంగందేవరలను ఆహ్వానించాడు
హరిదాసు భజనలు ఏర్పాటు చేశాడు
కోలాటాల పందాలు పెట్టించాడు
కూడలిలో భోగిమంట భగభగ మనిపించాడు
రాములవారి భజనమేళాలు రక్తికట్టించాడు
కోడిపుంజుల ఆటలు పందాలు వేయించాడు
వీధి వేషధారణ వాళ్ల ఆటలు ఆడించాడు!!!
ఇంకే… రామాపురం కి కొత్త శోభ వచ్చింది!
పెళ్లికూతురు ముస్తాబు కళ వచ్చింది!
ఎన్నో ఏళ్ల తర్వాత సంక్రాంతి సంబరాలతో
ఊరు “మహాస్వర్గం” లా మారిపోయింది!!!
పిల్లలు ఆనందంతో కేరింతలు
అమ్మలక్కల పేరంటం సందళ్ళు
కుర్రవాళ్ళ ఆటల పోటీల ఆనందాలు
ముసలివాళ్లు మీసాలకు సంపెంగనూనె
అంతే అంతే అంతే… ఒక్కసారి ఉలిక్కిపడింది
సంవత్సరంగా మగతలో ఉన్న “పెద్దమ్మ”!!!
అవయవాలన్నీ అదిలించి విదిలించింది
కనురెప్పలు టపటప లాడించింది
పెదాలు రెండు కదలాడాయి.
లేచి కూర్చుంది మంచంపై!!!
ఇప్పుడు ఊరి తో పాటు ఆ ఇల్లు కూడా
ఆనందమయింది మహదానందం అయింది!!
మనవడు కారుణ్య చిందునాట్యమాడాడు
ఊరంతా  అతనిని ఘనంగా సన్మానించేరు!!
-రాఘవేంద్ర రావు నల్లబాటి

Related Posts

1 Comment

  1. గతం ఎంతో మధురమైనది.అభినందనలు 💐💐💐💐💐

Comments are closed.