మార్మిక పుటలమహాకావ్యం
అడవిని గర్భంలో దాచుకొని
ఒక్క వాన చుక్క కోసం
తపస్సు చేసే అంకురం
జ్వలించడానికి సిద్ధంగా ఉన్న
అగ్నిపర్వతం
సమస్త చెట్టు తత్వాన్ని
తన హృది గదిలో బంధించి
భద్రపరచుకున్న
మార్మిక పుటల మహాకావ్యం
అది ఎన్ని ప్రళయాలతో
యుద్ధం చేయడానికి
వ్యూహరచనలు చేస్తుందో
ఎన్ని కరువులు జయించడానికి
వేళ్లను భూతల్లి గర్భానికి
బొడ్డుతాడై అల్లుతుందో
ఎన్ని వేల పక్షులకు తన
కొమ్మల జోలలూపడానికి
ప్రణాళికలు వేసుకుంటుందో !!
అంకురపు పొట్ట
అంతు చిక్కని రహస్యాల పుట్ట
ఎన్ని పొద్దులు
సద్దులారగించడానికి
ఆకుల విస్తర్లను
విస్తరించుకుంటుందో..
ఎన్ని తరాలకు
ఫలాలు అందించడానికి
కొమ్మల్ని అక్షయ పాత్రలు
చేసుకుంటుందో..
తన నీడలో తరించేందుకు
ఎన్ని జీవజాతుల్ని స్వప్నించిందో..
విత్తనం..
భూమిని కాపాడే విత్తం
జగతి గతి మార్చే
రేపటి ఆకుపచ్చ అణు విస్ఫోటనం
పుడమి శ్వాసకు పురుడుపోసే
పుట్టుక తెలియని బ్రహ్మపదార్థం
సకల చరాచర సృష్టికి మూలమైన
అండ పిండ బ్రహ్మాండం!!
-గురువర్ధన్ రెడ్డి