మిన్న

మిన్న

మోయలేని భుజకీర్తుల కన్నా
మూగిన భజన బృందాల కన్నా
పేరుకోసం పాకులాట కన్నా
పుడమి రోదన ఆపటం మిన్న

ముక్కుమూసే ధ్యానం కన్నా
కనులమూతల నటన కన్నా
తేనెపూసిన కపటం కన్నా
ముక్కుసూటి మాటే మిన్న

కలల ప్రపంచంలో తేలేకన్నా
కలలు కనమనే ప్రబోధం కన్నా
కష్టాలను ప్రేమించండనే బోధన కన్నా
నేల నిలిచే చూపు మిన్న

సాయమడిగే పెదవుల కన్నా
నిందలేసే నైజం కన్నా
నీడ వెతికే సుఖం కన్నా
నువ్వేమిటో తెలియటం మిన్న

– సి. యస్. రాంబాబు

Related Posts