మొదటి బహుమతి

మొదటి బహుమతి

ఆ సంవత్సరమే నేను ఆరో తరగతిలోకి ప్రవేశించాను. అంతా కొత్త కొత్తగా అంటే అయిదవ తరగతి వరకు అడుతూ పాడుతూ ఉన్నా, ఆరు అనగానే పెద్దరికం వచ్చినట్టు ఫీల్ అవడం మామూలే కదా…

కొత్త పెద్ద పుస్తకాలు, పెద్ద కాపీలు, పెన్సిల్స్ వదిలేసి పెన్నులు పట్టుకోవడం అంటే, సంతోషమే కదా. అలా గడుస్తున్నప్పుడు ఆగస్టు పది హేను అదే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు పండగ వస్తుంటే టీచర్లు, మీకు రకరకాల పోటీలు పెడతాము, ఎవరెవరు పాల్గొంటారు అని అడిగారు నా క్లాస్ టీచర్ గారు. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పారు. వరుసగా నా వంతు రాగానే నా పేరు పిలిచారు. నేను లేచి నిలబడ్డాను గాబరాగా, ఎంటమ్మ ఏం చేస్తావు నువ్వు పాట పాడతావా? ఉపన్యాసమా? వ్యాసరచననా? అంటూ అడిగారు. నేను అన్నిటికీ గబగబా తల ఉపేసాను. దాంతో, టీచర్ నా పేరును అన్నిట్లో రాశారు.

అది తెలిసి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే, నాకు ఏమి రాదు, తెలియదు కూడా… అప్పటి వరకు నేను ఎందులో పాల్గొనలేదు. కనీసం నాకు నిలబడి పాఠాలు చదవాలి అన్నా కూడా భయమే. అందుకని నా స్నేహితురాలితో అదే చెప్తూ ఏం చేయాలో ఆలోచిస్తూ నిలబడ్డాను. నేను పాల్గొనను అని వెళ్లి చెప్పాలి అన్నా కూడా భయం వల్ల వెళ్ళలేక తరగతి బయటే నిల్చున్నా. చాలా సేపటి నుండి మమల్ని గమనిస్తున్న మా తెలుగు టీచర్ విజయ లక్ష్మి గారు మా దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇక్కడ నిల్చున్నారు? ఏం కావాలి? అంటూ ఆప్యాయంగా అడిగే సరికి నా కంట్లో కన్నీరు చిప్పిల్లింది.

అది చూసి టీచర్ గారు ఎంటమ్మ? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఇలారా అంటూ నన్ను స్టాఫ్ రూంలోకి తీసుకుని వెళ్లారు. దాంతో, నేను ఒక్కసారిగా వెక్కిళ్లు పెడుతూ ఏడ్చాను. ఆవిడ నన్ను ఓదార్చి ఏంటని అడిగితే, అప్పుడు జరిగిన జరుగుతున్న విషయం చెప్పి, నాకు ఏమి రావు మేడం కి చెప్తే తిడతారేమో అన్నాను. దానికి మేడం గారు ఎందుకు నీకు రావు అంటున్నావు? ముందు ప్రయత్నం చేస్తే కదా తెలిసేది. నేను నీకు సహాయం చేస్తాను నేర్చుకుంటావా ఇంకో వారం రోజులు సమయం ఉంది కదా అన్నారు.

కానీ, నాకు భయం వేసి వద్దండీ నాకేం రావు. నాకు భయం అన్నాను. దానికి టీచర్ గారు ఏమీ భయం లేదమ్మా, నేనున్నా కదా, నేను నీకు అన్ని నేర్పిస్తాను. భయపడితే ఏది రాదు, నేర్చుకో లేవు. ఇంకా అయిదు తరగతులు చదవాలి. నువ్వు ఆ పైన కాలేజీ చదవాలి అంటే, అన్ని వచ్చి ఉండాలి. కాబట్టి, ఇప్పటి నుండే నేర్చుకో నీ పేరు సార్థకం చేసుకోవాలి కదా, అందుకే నేను చెప్పేది విను అంటూ ఎన్నో విధాల నచ్చ చెప్పింది.

తర్వాత నేను టీచర్ గారు ధైర్యం చెప్పడంతో సరే అని ఒప్పుకున్నా, తర్వాత టీచర్ గారు నన్ను రోజూ తన ఇంటికి ప్రొద్దున్నే రమ్మని అన్నారు. దాంతో, నేను సరే అని ఇంట్లో వాళ్లకు చెప్పి రోజు ప్రొద్దున్నే వెళ్ళే దాన్ని. టీచర్ గారు నాకు రకరకాల పాటలు, వ్యాసాలు, ఉపన్యాసం ఇచ్చి చదవమని అంటూ వారం రోజుల్లో నాకు అన్ని నేర్పించారు. అలా వారం రోజుల్లో పట్టుదలతో అన్ని చదివి విషయాలు, పాయింట్స్ గుర్తు పెట్టుకుని అన్ని నేర్చుకున్నా… ఇంతలోనే పోటీలు నిర్వహించారు. అన్నిట్లో పాల్గొన్నా, కానీ ఉపన్యాసంలో కొంచం తడబడినా, వెనక నుండి టీచర్ గారు కళ్ళతోనే పర్లేదు అన్నట్టుగా చూసారు.

దాంతో, మిగిలిన వాటిలో కూడా బాగానే పాల్గొన్నా, చాలా ఆనందంగా అనిపించింది. అసలు పాల్గొనని అనుకున్న దాంట్లో పాల్గొనేలా చేశారు టీచర్ గారు. ఆగస్టు పదిహేను జెండా వందనం జరిగింది. మా గుండెలు దేశ భక్తితో పొంగిపోయాయి. ఒళ్లు పులకరిస్తుంది జెండాను చూస్తుంటే. హెడ్మాస్టర్ గారు జెండాను ఎగురవేశారు. అందరూ జాతీయగీతాన్ని ఆలపించారు. జెండా వందనంకు జై అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. నేనూ నా గొంతు కలిపాను.

అదయ్యక స్కూల్ నుండి పోలీస్ స్టేషన్ లో, ప్రభుత్వ ఆసుపత్రిలో, గ్రంధాలయం దగ్గర జెండాను ఎగురవేసి, వాళ్ళు ఇచ్చిన అటుకులు బెల్లం, చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకుని మళ్ళీ అందరం పాఠశాలకు వచ్చాము. పెద్ద గ్రౌండ్ లో టెబుల్లు వేసి, దానిపై ఒక జంపుఖాన వేశారు. కుర్చీల్లో టీచర్స్ అందరూ కూర్చున్నారు. హెడ్మాస్టర్ గారు స్వతంత్రం కోసం పోరాడిన వారి జీవితం గురించి వివరించారు. నీతి, న్యాయంగా ఉండాలని అవసరం అయితే, దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలని చెప్పారు. మిగిలిన వాళ్ళు అందరూ మాట్లాడిన తర్వాత మాకు బహుమతి ప్రదానం జరిగింది.

ముందు ఆటల పోటీలలో ఫస్ట్ వచ్చిన వారికి ఇచ్చారు. తర్వాత పాటలు, వ్యాసరచన, ఉపన్యాసం బహుమతులు వరుసగా ఇచ్చారు. మొట్ట మొదటి సారి మైక్ లో నా పేరు పిలవగానే హృదయం పులకరించింది. విజేత అవ్వడంలో ఉన్న ఆనందం తెలిసి వచ్చింది. వ్యాసరచన మొదటి బహుమతి భవ్య అంటూ పిలిస్తే స్నేహితుల వంక చూస్తూ స్టేజి పైకి వెళ్లి బహుమతి తీసుకుంటూ ఉంటె ఆ సంతోషం వేరే లెవల్. మాటల్లో చెప్పలేం. అందరూ నన్ను గొప్పగా చూసారు, టీచర్స్ కూడా మెచ్చుకున్నారు. మొదటి సారి మూడు బహుమతులు ఒక్కరికే రావడం అదే మొదటి సారి అన్నారు.

గెలవడంలో ఉన్న ఆనందం నాకు రుచి చూపించిన మా విజయ లక్ష్మి టీచర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీచర్ మీరెక్కడ ఉన్నా ఇది చదువుతారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు.

– భవ్య చారు 

Related Posts

2 Comments

Comments are closed.