మౌనం

మౌనం

ఆ మధ్య కాలంలో ఏదో మాటపై మాట వచ్చి నేను మా అమ్మ గారి తో కాస్త గొడవ పడ్డాను. చిన్న మాట నే కానీ నా ఆవేశం వల్ల నేను తొందరపడ్డాను. కానీ నాకు కోపం చాలా వచ్చింది.

దాంతో నేను మా అమ్మతో మాట మానేశాను. అది కూడా కరోనా సమయంలోనే, ఈ కారణం అనేది చాలామందిని చాలా ప్రస్టేషన్ కి గురిచేసింది. అందరూ ఇంట్లోనే ఉండడం వల్లనో ఏమో చేసే పని ఎక్కువ అయింది

పని ఎంత చేసినా తరగదు. ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుభవమయ్యే ఉంటుంది. అయితే ఆ ప్రస్టేషన్ లో నేను మా అమ్మ కాస్త గొడవ పడిన మాట నిజం.

పాపం మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు నిలబడి వంట చేయలేదు. ఇది తెలిసినా కూడా నేను రోజూ చేయడం విసుగొచ్చి నువ్వు ఒకసారి చేయొచ్చు కదా అమ్మా అని తనని అన్నాను.

ఆ మాటతో తనకి కోపం వచ్చింది. ఈ నెల నుంచి చేస్తున్న ఇప్పుడు కూడా చేయాలా నాకు మోకాళ్ళ నొప్పులు అని తెలిసి కూడా నన్ను చేయమంటావా అంటూ చేసి పెట్టింది పాపం.

ఆ తర్వాత నేను పాపం అనుకున్నాను కానీ ప్రస్టేషన్ తో ఇక నేను నీతో మాట్లాడను పో అంటూ తనపై అలిగాను.

అలా అలా మూడు నెలలు మా అమ్మతో మాట్లాడటం మానేశాను. ఒకే ఇంట్లో ఉంటున్న నా పనేదో నేను చేసుకుంటూ ఉండేదాన్ని. మా అమ్మ కూడా ఏది కావాలన్నా ఏదైనా చెప్పాలన్నా ఎవరికో చెప్తున్నట్లు చెప్పేది.

అది నాకు నవ్వు తెప్పించేది అయినా నవ్వకుండా బింకంగా ఉండేదాన్ని. మా ఇద్దరి గొడవలు చూసిన మా తమ్ముడు నేను చేస్తాను అంటూ ఆ మూడు నెలలు వాడే ఇంటి పనంతా చేశాడు.

కానీ మూడు నెలల తర్వాత వాడికి ఆఫీస్ కు రమ్మని పిలుపు వచ్చింది దాంతో వాడు వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో మేము ముగ్గురమే మిగిలాం.

అమ్మ పాపం అప్పుడప్పుడు నన్ను పలకరించాలని చూసినా నేను కోపంగా బింకం గా ఉండే దాన్ని మౌనంగా నా పనేదో నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని.

అయితే ఒక రోజు తనకి విపరీతమైన నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఆ నొప్పి ని చూసి నాకు చాలా బాధ వేసింది.

అయ్యో ఇన్ని రోజులు నేను నా తల్లిని అర్థం చేసుకోలేకపోయాను అని చాలా బాధపడ్డాను తన నొప్పుల బాధ భరించలేక చూడలేక కరోనా ఉన్నా కూడా ఒక డాక్టర్ స్నేహితురాలి సలహా తీసుకొని తనకి కావాల్సిన మందులు తేవడానికి మొదటిసారిగా బయటకి వెళ్ళాను.

అంటే కరోనా వచ్చిన తర్వాత మొదటి సారిగా బయటికి వెళ్లడం జరిగింది. తనకు మందులు, గోలీలు అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాను నేను ఎక్కడికి వెళుతున్నాను అనేది తనకి తెలియదు.

నేను వెళుతున్నప్పుడు కూడా తను ఎందుకు ఎందుకు అని అడిగినా కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయాను.

ఇక వచ్చిన తర్వాత డైరెక్ట్ గా బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి బయటకు వచ్చి ఆ టాబ్లెట్ లు అన్నీ తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్లాను.

మూడు నెలల నుంచి ఉన్న నా మౌనాన్ని విడగొట్టి అమ్మ నీ కోసం టాబ్లెట్లు తీసుకు వచ్చాను నన్ను క్షమించు ఇంకెప్పుడూ నీతో మాట్లాడకుండా ఉండను అంటూ టాబ్లెట్లు తన చేతిలో పెట్టి ఎప్పుడు ఎప్పుడు వేసుకోవాలి అనేది చెప్పాను.

అప్పుడు అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంటూ ఎందుకు బిడ్డ ఈ కరోనా సమయంలో బయటకు వెళ్ళావు అవసరమా నేను ఏదో ఇంటి చిట్కాలతో నా నొప్పులు నయం చేసుకునే దాన్ని.

ఎందుకు ఈ టైంలో వెళ్లావు అంటూ నా క్షేమం గురించి అడిగింది తప్ప తన నొప్పులను పట్టించుకోలేదు.

అప్పుడనిపించింది నాకు అమ్మ నిజంగా చాలా గొప్పదని. నేను అమ్మను అయ్యాను కానీ ఇంత గొప్పగా కాదు ఆమె అనుభవం లో చాలా చూసి ఉంటుంది చాలా బాధ కూడా పడింది.

ఆ బాధలన్నీ నేను చూసి కూడా తనతో మాట్లాడకుండా ఉండడం నా తప్పు అనిపించి నా తల్లి రెండు  కాళ్ళూ పట్టుకుని నన్ను క్షమించు అన్నాను.

ఇక అమ్మా నన్ను దగ్గరికి తీసుకుని నుదుటిమీద ముద్దు పెట్టి ఇప్పటికైనా మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే ఇన్ని రోజులు నాకేం తోచట్లేదు రా….

రోజూ ఇంట్లో గలగలా మాట్లాడుతూ తిరుగుతూ పాటలు పాడుతూ చేస్తూ ఉంటావు ఉంటావు కానీ ఈ మూడు నెలలు నీ గొంతు మూగబోయే సరికి నాకు చాలా బాధ వేసింది.

ఇక ఇప్పటికీ నేను అమ్మతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను. మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం జోకులు వేసుకుంటూ నవ్వుకుంటాం ఇద్దరం స్నేహితుల్లా ఉంటాం.

మా ఇద్దరిని చూసిన వాళ్ళు మీరిద్దరూ అక్కచెల్లెళ్ళా అని అడుగుతారు. ఇంతకీ మీకు ఒక విషయం చెప్పలేదు కదూ అమ్మనే నా మొదటి స్నేహితురాలు.

నా కథలకు ప్రాణం పోసింది అమ్మ. నా కథలో నేను రాసిన తర్వాత అమ్మకే చదివి వినిపిస్తాను అప్పుడు అమ్మ అందులో తప్పులు చూస్తుంది వాటిని సరిదిద్దుకుంటాను.

ఇక జీవితంలో అమ్మ పై కోప్పడకూడడు అని అనుకున్నాను. అయినా అప్పుడప్పుడు అలకలు చిలకలు చిన్న చిన్న మాటలు వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటినీ మళ్లీ తెల్లారి మర్చిపోయి మామూలుగా మాట్లాడుకుంటాం.

ఎందుకంటే కొట్టుకున్న తిట్టుకున్నా ఏం చేసినా అమ్మ అన్నదమ్ములతోనే… బయట వారితో ఇలా చేయలేం కదా…

మీరు కూడా మీ అమ్మగారితో ఎప్పుడైనా మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉన్నారా? ఉంటే నాతో పంచుకోండి. అమ్మ ఎవరికైనా అమ్మే.

– భవ్యచారు

Related Posts