మౌనముని

మౌనముని

పోరాటం అతనికి కొత్తేమీ కాదు
తీరని ఆరాటాలను చూసి
తీరికగా నవ్వుతుంటాడు
తీరం చేరని జీవితాల కథ
అలాగే ఉంటుందంటాడు

పేదరికమే అతని ఆస్తి
దాన్ని కాపాడుతూ కొడుక్కు పంచాడు
మూడుపూటల భోజనాన్ని
కలగంటుంటాడు
కలతీరలేదు కానీ నడుమొంగిపోయింది

అలా అని దిగులు చెందాడా
బతుకుబాటకు కొత్త దారులు వేయటం మానడు
అక్షరం విలువ తెలియదు కానీ
జీవితం విలువ తెలుసతనికి

కర్మను నమ్ముతాడో లేదో
కాళ్లు చేతులే అతనికి ప్రత్యక్ష దైవాలు
ఆకలిని అభిషేంచాలంటే
శ్రమను తాకట్టుపెట్టాలని తెలుసు
కాబట్టే ఇల్లిల్లూ తిరుగుతాడు కానీ దేహీ అనడు

అతనికి ఆత్మ గౌరవమే చేతికర్రలా
తోడుంటుంది
కంటిచూపే దారిచూపే నేస్తం
అతని పాదాలు నేలతో సంభాషిస్తుంటే
ఆశే ముచ్చటపడి ఈ మౌనముని కి తోడవుతుంది

(ఫొటో కర్టెసీ: ఆకుల మల్లేశ్వరరావు)

– సి. యస్. రాంబాబు

Related Posts