ముసలి తల్లి

ముసలి తల్లి

ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చేస్తే చాలా కాలానికి ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు జానకమ్మ, రాజయ్య దంపతులకు. అప్పుడే పుట్టిన తమ కొడుకును చూసి ఎంతో మురిసిపోయారు. రాజయ్య వ్యవసాయం చేస్తాడు. చాలా కష్టపడి డబ్బు సంపాదించాడు. కానీ, పిల్లలు లేరనే బాధ, రాజయ్య మనసును కుంగదీసేది. ఇప్పుడు తన కొడుకును పుట్టాడని ఎంతో సంతోషించాడు. తమ కొడుకుకి శ్రావణ్ అని నామకరణం చేశారు. ఒక్కగానొక్క కొడుకు కాబట్టి తన కొడుకును అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తమ కొడుకే తమ ప్రాణానానికి ప్రాణంగా చూసుకునేవారు జానకమ్మ, రాజయ్య లు.

తమ కొడుకు ఏదీ కావాలన్నా, తన దగ్గరికి తీసుకువచ్చి తమ కొడుకు బాధపడకుండా, తనకి ఏ కష్టం రానివ్వకుండా చూసుకునేవారు. తమ కొడుకు బాగా చదివి మంచి పేరు పొందాలని, శ్రావణ్ ను బాగా చదివించారు. వారు కోరుకునట్టుగానే తమ కొడుకు శ్రావణ్ బాగా చదివి, మంచి ఉద్యోగం, మంచి పేరు, సంపాదించాడు. తమ కొడుకుకి పెళ్ళి వయసు వచ్చింది అని, పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారు. పెళ్ళి సంబంధాలు చూశారు. ఒక అమ్మాయిని చూసి, శ్రావణ్ కి పెళ్ళి చేసారు. తమ గారాల కొడుకు శ్రావణ్ కి, పెళ్ళి జరిగి తమ ఇంటికి కోడలు వైష్ణవి వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు.

వైష్ణవి చదువుకుంది కాబట్టి వైష్ణవి, శ్రావణ్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. కాలం గడుస్తుంది. శ్రావణ్ కి ఇద్దరు పిల్లలకు. తమ కొడుకు, కోడలు ఉద్యోగాలు చేయడం వలన ఇంటిని, పిల్లల బాగోగులు జానకమ్మ, రాజయ్యలు చూసుకుంటున్నారు. కొన్ని రోజులకు రాజయ్యకు వయసు అయిపోయి, ఆనారోగ్య బారిన పడ్డారు. రాజయ్యను ఆ పరిస్థితిలో చూసి జానకమ్మ తట్టుకోలేకపోయింది. వైద్యం చేయించినా కూడా రాజయ్య కొన్ని రోజులకు మరణించాడు. రాజయ్య మరణంతో, జానకమ్మ అనారోగ్య పాలైంది. ఎప్పుడు రాజయ్యను గుర్తు చేసుకుంటూ అలాగే బాధపడుతూ ఉండేది.

కొడుకు, కోడలు రాగానే పనులు అన్ని చేసి పెట్టి ఉంచే జానకమ్మ ఇప్పుడు తన భర్త లేడనే బాధతో ఏమి చేయకుండా కూర్చునేది. ఎప్పుడూ ఒక్క మాట అనని తన కోడలు వైష్ణవి, జానకమ్మ పని చేయడం లేదని,  సూటిపోటి మాటలతో జానకమ్మను బాధపెట్టేది. వైష్ణవి మాటలకు జానకమ్మ ఇంకా కుంగిపోయింది. అలా కొన్ని రోజులకు ఎలాగైనా జానకమ్మను ఇంట్లో నుండి బయటకు పంపించి వేయాలనే దుర్బుద్ధి వైష్ణవికి వచ్చింది. ఆరోజు సాయంత్రం శ్రావణ్ ఇంటికి రాగానే వైష్ణవి తన తల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపించి వేయాలని గొడవ చేసింది. నా తల్లిని నేను ఎక్కడికి పంపించను, నా తల్లి నాతో పాటే ఉంటుంది అని శ్రావణ్ గట్టిగా చెప్పేశాడు.

మరుసటి రోజు వైష్ణవి శ్రావణ్ దగ్గరకి వెళ్లి, నన్ను క్షమించండి. నేను చాలా తప్పుగా ఆలోచించాను. నేను అలా అనకుండా ఉండాల్సింది. నా మట్టి బుర్రకు మంచి బుద్ది చెప్పారు. ఇంకో సారి అలా అనను. అత్తయ్యను నా తల్లి లాగా చూసుకుంటా, అత్తయ్య మనతోనే ఉంటుంది. అని ప్రాధేయపడింది. భార్య మాటలు విని శ్రావణ్ చాలా సంతోషించాడు. వైష్ణవి బాగా ఆలోచించింది. శ్రావణ్ ఇలా చెప్తే వినడు అని…. ఒక ప్లాన్ వేసింది. అదేంటంటే ముందుగా శ్రావణ్ కి తన తల్లి పై ఉన్న ప్రేమ తగ్గి, కోపం వచ్చేలా చేయాలని అనుకుంది. వైష్ణవి, జానకమ్మను బాగా చూసుకోవడం మొదలు పెట్టింది. శ్రావణ్ వైష్ణవిని చూసి సంతోషించాడు. 

అలా రోజులు గడుస్తుండగా, వైష్ణవి జానకమ్మ మీద మాయమాటలు చెప్పి ఏడవడం మొదలు పెట్టింది. జానకమ్మను బాగా చూసుకున్నా కూడా, అలా అంటుంది, ఇలా అంటుంది అని శ్రావణ్ కి చెప్పేది. శ్రావణ్ ముందుగా వైష్ణవి మాటలు నమ్మలేదు. కానీ తరువాత నమ్మడం మొదలు పెట్టాడు. ఒక రోజు వైష్ణవి జానకమ్మను కావాలనే అనరాని మాటలు అని, గొడవ జరిగేలా చేసింది. శ్రావణ్ రాకను చూసి మౌనంగా ఉండి పోయింది. జానకమ్మ అనే మాటలు మాత్రమే విని, జానకమ్మ ను తిట్టాడు. అసలు ఏం జరిగిందో జానకమ్మ చెప్తూ ఉంటే, వినలేదు శ్రావణ్.

కొడుకు, కోడలు అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ ఏడవసాగింది జానకమ్మ.  శ్రావణ్ కి జానకమ్మ పై ఎక్కించి చెప్పి ఏడ్చేసింది వైష్ణవి. ఇలా రోజూ వైష్ణవి ఏడవడం చూసి శ్రావణ్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక రోజు జానకమ్మను శ్రావణ్ గుడికి తీసుకు వెళతానని రెఢీ అవ్వమన్నాడు. జానకమ్మ రెఢీ అయింది. శ్రావణ్ జానకమ్మను తన బండి పై ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. ఒక దగ్గర ఆపి జానకమ్మను దిగమన్నాడు. గుడి అన్నావు కదా నాన్న… ఇంకా రాలేదు కదా! అంది జానకమ్మ. ఇక్కడ నాకు చిన్న పని ఉంది. దిగు అమ్మా అన్నాడు. జానకమ్మ దిగింది.

ముసలి తల్లి
ముసలి తల్లి

శ్రావణ్ లోపలకు వెళ్లి కాసేపు ఉండి వచ్చాడు. ‘ పని అయిపోయిందా నాన్న? పదా వెళ్దాం అంటూ బండి ఎక్కబొతుంటే, ఆగు అమ్మా, ఇంకో చిన్న పని ఉంది. చూసుకొని వచ్చేస్తా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చాక గుడికి వెళ్దాం అన్నాడు శ్రావణ్. జానకమ్మ సరే అంది. శ్రావణ్ వెళ్ళిపోయాడు. జాగ్రత్త కొడుకా, అంటూ ఉంది జానకమ్మ. జానకమ్మ అక్కడే కొడుకు కోసం చూస్తుంది. కానీ, కొడుకు ఇంకా రావడం లేదు. గంట అయింది. ఇంకా రాలేదు. అలాగే ఎదురు చూస్తూ ఉంది జానకమ్మ. రెండు గంటలు అయింది. ఎవరో ఇద్దరు వచ్చి జానకమ్మని లోపలికి రమ్మని పిలిచారు.

నా కొడుకు ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు, నన్ను ఇక్కడే ఉండమన్నాడు. నేను ఎక్కడికి రాను, నా కొడుకు వచ్చేస్తాడు. అని చెప్పింది జానకమ్మ. లేదు అమ్మా, నీ కొడుకు రాడు. నిన్ను ఈ అనాధ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళాడు. లోపలికి రా అమ్మా అని పిలిచారు. వారి మాటలు విన్న జానకమ్మ ఒక్కసారిగా షాక్ కి గురైంది. జానకమ్మ పిచ్చి దానిలా మారిపోయింది. నా కొడుకు వస్తాడు. నన్ను తీసుకువెళ్తాడు అని పదే పదే అంటుంది. ఆశ్రమం వారు జానకమ్మను ఎన్ని సార్లు లోపలికి తీసుకు వెళ్ళినా మళ్లీ తిరిగి అదే స్థానం దగ్గరకు వచ్చి చెట్టు కింద కూర్చునేది. ఆశ్రమం వారే జానకమ్మకు ఆహారాన్ని అందించేవారు.

అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ తరువాత ఒక రోజు వైష్ణవి ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుంటే, శ్రావణ్ అనుకోకుండా వచ్చాడు. అప్పుడు వైష్ణవి మాటలు విన్నాడు. వైష్ణవి మాటలకు శ్రావణ్ షాక్ అయ్యాడు. శ్రావణ్ ని వైష్ణవి చూసి కంగారు పడి, మీరేప్పుడు వచ్చారు? రండి…. అంటూ తడపడుతూ మాట్లాడుతుంది. శ్రావణ్ కోపంతో ఎంత పని చేసావే? నా చేతులతో మా అమ్మని బయటకు పంపించి వేసేలా చేశావు. ఎంత పెద్ద తప్పు చేసావే, నిన్ను అనడం కాదు. నేను తప్పు చేశాను. నువ్వు చెప్పింది నమ్మి మా అమ్మను ఆనాధ ఆశ్రమంలో ఉంచి వచ్చేసాను. వెంటనే మా అమ్మను తీసుకొని వచ్చేస్తా అంటూ, శ్రావణ్ అనాథ ఆశ్రమానికి వెళ్ళాడు.

శ్రావణ్ ఆశ్రమం దగ్గరికి వెళ్లి చుడగానే,  తను ఆ రోజు ఎక్కడైతే తన తల్లిని వదిలి వెళ్ళాడో అక్కడే ఇప్పటి వరకు కూర్చొని ఉంది. తన తల్లిని చూడాగానే శ్రావణ్ కి పశ్చాత్తాపంతో కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేశాయి. వచ్చి తల్లి కాళ్ళ మీద పడ్డాడు. ఆశ్రమంలో నుండి ఇద్దరు వచ్చి, నీ తల్లి నువ్వు ఇక్కడ వదిలి వెళ్ళిన క్షణం నుంచి నా కొడుకు వస్తాడు నన్ను తీసుకు వెళ్తాడు అని ఇక్కడే కూర్చొని ఉంది. లోపలికి రమ్మంటున్నా ఇక్కడే నా కొడుకు వస్తాడు అనీ నీ కోసం ఎదురు చూస్తూ… నువ్వు ఇక్కడ వదిలేసావని తెలిసి పిచ్చిది అయిపొయింది. ఎంత పెద్ద తప్పు చేసావు బాబు…. నీ తల్లి నిన్ను నవమాసాలు మోసి, కని, పెంచితే, నువ్వు ఇంతవాడివి అయ్యావా? తల్లికి ముసలి తనం రాగానే నీకు బరువైందా? బుక్కెడు అన్నం పెట్టడానికి నీకు కనికరం లేదా? నువ్వు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వయసుకు రావాల్సిందే కదా… అది ఆలోచించకుండా తల్లిని ఆశ్రమం లో వదిలేసావు… అని ఆశ్రమం వారు అన్నారు.

నన్ను… క్షమించండి…. అయ్యో దేవుడా…! నేను క్షమింటాని నేరం చేశాను, అమ్మా… నన్ను క్షమించు…. మూసుకుపోయిన ఉన్న నా కళ్ళు తెరిచుకునేలా చేశారు.  నా తల్లికి ఇప్పటి నుండి ఏ కష్టం రానివ్వకుండా చూసుకుంటాను. అంటూ… శ్రావణ్ జానకమ్మ ను తీసుకు వెళ్ళాడు. తన కొడుకును చూడటంతో…. జానకమ్మ కుదుట పడింది. అప్పటి నుండి శ్రావణ్ తన తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. తొందరలోనే జానకమ్మ మంచి మనిషిలా మారింది. 

– అనూష

 

Related Posts