ముసుగు

ముసుగు

మనుషుల్లో మంచితనం ముసుగు
వేసుకున్న రాబంధువులు ఎన్నో
వెకిలిగా నవ్వుతూ వెంట పడే వాడొకడు
ప్రేమ నటిస్తూ ముంచే వాడొకడు
సీటు కింద నుండి కాళ్ళు రాసే వాడొకడు
రద్దియైన బస్సులో భుజాలు రాసే వాడొకడు
కాలేజీ లో వెంట పడే వాడొకడు
బాగున్నావామ్మ అంటూ కన్ను గిటే వాడొకడు
ఆటో అద్దం లోంచి చూస్తూ వస్తావా అని అడిగే వాడొకడు,
అన్నా అని పిలిచినా చున్ని లాగే వాడొకడు
మీ అమ్మాయి బాగా చదువుతుంది అంటూ
బుగ్గలు పిండే వాడొకడు, ఆరేళ్ల పసి పాపను
ఆడిస్తున్నా అంటూ మీద కి వచ్చే వాడొకడు
తాతయ్య నంటూ శరీరాన్ని నలిపే వాడొకడు
మీ పాప చాలా తెలివి గలది అంటూ భుజాలు నొక్కే వాడొకడు.
ప్రమోషన్ కావాలా అంటూ పళ్ళు ఈకిలించే వాడొకడు
జీతం పెంచాలంటే ఇంకేదో ఇవ్వాలనే వాడొకడు
ఉద్యోగం కావాలని వస్తె అన్ని పనులూ చేయాలనే వాడొకడు
ఇంటి పనులయ్యక ఒంటి పని కూడా చెయ్యాలనే వాడొకడు.

వీళ్లేవరూ ఎవరి కంటికి కనిపించరు
ఎందుకంటే అందరూ మంచితనం అనే
ముసుగు వేసుకుంటూ మంచివారుగా
సమాజం లో పేరున్న వారే…
వారి ముసుగు తీసేస్తే కనిపించే అసలు రూపం
అంద వికారమే….

– అర్చన

Related Posts