నక్క తోక తొక్కడం నిజంగా అదృష్టమూ?

నక్క తోక తొక్కడం నిజంగా అదృష్టమూ?

 

ఇక్కడ ఒక తమాషా ఉంది. ఈ జాతీయంలో నక్క అంటే మనలో చాలామంది ఊహిస్తున్న జంతువు (Jackal లేక జంబుకం) కాదు. పులి.

పెద్ద నక్క, అదే పులి.

అడవితో పరిచయం ఉన్న తెలుగు సమూహాల్లో చాలామంది ఇప్పటికీ పులిని నక్క అంటూ ఉంటారు. నేను చెప్పే అర్థాన్ని ఎలా సమర్థించుకోవాలి అంటే నా దగ్గర సాహిత్య ఆధారం ఉంది చూడండి:-

కొండపొలం నవలలో కథ ప్రకారం గొర్రెల్ని తోలుకుని వెళ్ళే కాపరులకు దారిలో ఒక మేక చాలా బీభత్సంగా చనిపోయి సగం తినబడి కనిపిస్తుంది. పులివల్ల చనిపోయిందేమో అని భయపడ్డ కథానాయకుడు రవి ఇతరులతో ఆ మాట ఇలా కదుపుతాడు:

“మనమొచ్చే దావలో మెగం పట్టినట్టుంది. బర్రె పడ్డనేమో…” అన్నాడు (రవి) అందరికీ వినిపించేలా.

“కడితినిలే… నక్క… పెద్ద నక్క పట్టింది,” కళ్ళు మూసికొనే చెప్పాడు పుల్లయ్య.

“నక్కా?”

“ఆ… పెద్దది… చారలు చారల్ది…”

అర్థమైంది రవికి. పులినే ‘నక్క’ అంటున్నాడు.

గొర్రెల కాపరుల నోటి నుంచి తను ఆ మాట చాలాసార్లు విని వున్నాడు. వాళ్లు పులిని పులి అనరని తెలిసివొస్తూ వుంది. గొర్రెల్ని కూడా ‘నక్కనోటి జీవాలు’ అంటారు.

(సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, కొండపొలం, తానా ప్రచురణలు (2021 ముద్రణ), పే. 63, 64)

నక్క అన్న మాటకు పులి అన్న అర్థం ఉందని తేలింది కదా. ఇప్పుడు ఈ జాతీయం వెనుక అసలు అర్థం ఏమిటో చూద్దాం.

“నక్క తోక తొక్కి వచ్చినవారు అదృష్టవంతులు” అంటుంది ఈ జాతీయం. అంటే పులితోక తొక్కి వచ్చినవారు అదృష్టవంతులు అని అర్థం చేసుకోవాలి.

అసలు ఒక్కోసారి పులి మనిషికి ఎదురుపడితేనే బ్రతికి బట్టకట్టడం కష్టం. అలాంటిది అనుకోకుండానో, మరెందుకనో “పులి తోక” తొక్కి దానికి కోపం రప్పిస్తే బ్రతకడం సామాన్యమా?

అలా ఒకరు బ్రతికివస్తే అదృష్టవంతులు అనే కదా అనాలి. అలా పుట్టింది ఈ జాతీయం. అందులో నమ్మకమూ, అపనమ్మకమూ వంటివాటికి తావు లేదు.

– రవి కృష్ణ

Related Posts