నాకు విశ్రాంతి లేదు

నాకు విశ్రాంతి లేదు

ఈ కరోనా కాదు కానీ, నా పని మాత్రం కడగడం, వండడం అవుతునే ఉంది. నా పనికి మాత్రం సెలవు లేదు అందరికీ అన్ని సెలవులు, విశ్రాంతి కావాలి. కానీ, నాకు మాత్రం విశ్రాంతి లేదు.ప్రొద్దున్న లేచింది మొదలు రాత్రి పన్నెండు వరకు నా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఎలాగంటారా చెప్తాను వినండి నా బాధ..

ప్రొద్దున్నే అయిదు గంటలకు లేచి నా కాల కృత్యాలు తీర్చుకొని, బయటకు వెళ్లి కడిగి ముగ్గు పెట్టీ వస్తాను. ఆ తర్వాత బియ్యం పెట్టీ కూరగాయలు కోసెంతలో నీళ్ళు వస్తాయి. బిందెలు అన్ని కడిగి ఫ్రెష్ గా వాటర్ పట్టాలి. నిన్నటి నీళ్లు ఉన్నా అవి పారబోయాలి.

అందరికీ ఫ్రెష్ వాటర్ కావాలి మరి ఈలోపు అన్నం అవ్వగానే దించేసుకుని ఒక ప్లేట్ లో ఆరబెట్టాలి, నీళ్లు పట్టడం అవ్వక ముందే కూరగాయలు కోసి కూర చెయ్యాలి. నీళ్లు పట్టాక పక్కన బెట్టి టిఫిన్ కోసం రెఢీ చేయాలి.

Beautiful brunette mother multitasking with working arms doing different actions

ఈ లోపు పిల్లలు లేచి టీవీ ముందు కూర్చుంటే వాళ్లను బ్రెష్ కు పంపి ఇల్లు ఉడ్చాలి. దోశల్లోకి, ఇడ్లీలోకి కొత్తరకం చట్నీలు చేయాలి. ఆవకాయ, నిమ్మకాయ పచ్చళ్లు నచ్చవు మరి.

ఇక పిల్లలకు పాలు ఇవ్వటం అయ్యాక. బట్టలు నానపెట్టి ఉతకాలి. అవి అయ్యాక శ్రీవారు కేకలు, బ్రష్ పేస్ట్ ఇచ్చి స్నానానికి వేడి నీళ్లు ఇచ్చి, పిల్లలకు టిఫిన్ పెట్టె బాక్స్ లో లంచ్ పెట్టి జడలు వేసేసి రెడీ చేసి వాళ్ళని పంపిన తర్వాత శ్రీవారికి కూడా బాక్స్ పెట్టి నాకు బాక్స్ పెట్టుకుని బట్టలు అరేసి, నేను టిఫిన్ కుక్కుకుని ముందు శ్రీవారిని పంపిన తర్వాత, మళ్ళీ ఒక సారి ఇల్లంతా చూసుకుని వీలుంటే సర్దుకుని, టిఫిన్ ప్లేట్ లు అన్ని సింక్ లో వేసేసి ఇంటికి తాళం పెట్టేసి అదరా బాదరగా బస్ కోసం వెళ్ళాలి.

కిక్కిరిసిన ఆ బస్ ఎక్కి ఎలాగో సర్కస్ ఫీట్లు చేసి ఆఫీస్ కు వెళ్తే, అక్కడ బాస్ గారి కోపాలు, తిట్లు, తట్టుకుని బండ చాకిరీ అంతా చేసినా అందులో తప్పులు వెతికి మరీ తిడుతూ, లేని కోపాన్ని నాపై చూపిస్తూ ఉండే బాస్ ను తట్టుకుని చాకిరీ అయ్యాక, అందరూ వెళ్ళాక కూడా నాకు అప్పగించిన పని పూర్తి చేసి  లేట్ గా వస్తె అదే శిక్ష  ఆ పని చేసి బాస్ ముందు పెడితే అంత సేపు నాపై శాడిజం చూపించి అరె ఇది అయిపోయింది అయ్యో నేను చూసుకొలేదని వెర్రి నవ్వు నవ్వుతాడు.

అప్పుడు నాకు  వాడిని చంపాలి అన్నంత కోపం వచ్చినా వాడి శాడిజానికి బలై పోతూ దాన్ని అదిమి పట్టి వెర్రి నవ్వు ఒకటి నవ్వి, ఇంటికి వెళ్ళాలని, మళ్లీ బస్ స్టాండ్ కి వచ్చి ఆ చెమట కంపులో మళ్లీ సర్కస్ ఫీట్లు చేసి, ఇంటికి చేరితే, స్కూల్ నుండి వచ్చిన పిల్లలు బాక్స్ లు ఒక దగ్గర సాక్సులు ఒక దగ్గర వేసేసి టీవీ చూస్తూ కూర్చుంటే, అవ్వన్నీ తీసి సర్ది ప్రొద్దున గిన్నెలు అన్ని కడిగేసి ఫ్రెష్ అయ్యి, ఒక పొయ్యి మీద రైస్ పెట్టి, మళ్లీ కొత్తగా కూర చెయ్యాలి.

అందులోనూ పిల్లలకు నచ్చింది చేసి, ఇంతలో శ్రీ వారు వస్తే అతనికి టీ పెట్టి ఇచ్చి, అతని సేవ చేసి బయట ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెట్టి అవసరం అయితే అవి ఐరన్ చేసి, అన్నాలు తిన్నాక అన్ని సర్దుకుని కడుక్కుని మళ్లీ ప్రొద్దటికి కూరగాయలు సర్ది పెట్టుకుని, ఐరన్ బట్టలు ఎవరికీ వారివి సపరేట్ గా పెట్టి, పిల్లలను నిద్ర పుచ్చి, నేను మంచం మిద వాలే సరికి గడియారం గంటలు కొడుతుంది. మళ్లీ ప్రొద్దున షరా మామూలే..
ఇదంతా కరోనాకు ముందు. మరి ఇక కరోనా వచ్చిన కొత్తలో హాయిగా లేట్ గా లేవొచ్చు అనుకుంటే, అబ్బా చాలా రోజుల తర్వాత రెస్ట్ దొరికింది. కాస్త నాకు బొబ్బట్లు చేసి పెట్టవూ అని శ్రీవారు. ఇది ఇలా ఉంటే, అమ్మా అబ్బా నాకు మురుకులు చేసి పెట్టావా అంటూ పిల్లలు, ఒక్కొక్కరికి ఒక్కో రకం చేసి పెట్టడం. పోని చేయడం మానేద్దామా అనుకుంటే పాపం అడగక అడగక అడిగారు కదా అని చేయడం. పోనీ దానికైనా ఎవరైనా సహాయం చేస్తారా అనుకుంటే నో ఛాన్స్.

నాకు విశ్రాంతి లేదు

 

అబ్బా, టీవీలో నేను చూడాలనుకున్న సినిమా వస్తుందని శ్రీవారు. అమ్మా ఆన్లైన్ క్లాస్ ఉందని పిల్లలు రారు. అవ్వన్నీ నేనే చేసుకుని, నేనే గొలించి, నేనే చేయాలి, ఆ గిన్నెలు కూడా నేనే కడగాలి. పైగా అన్నం కూర వేరుగా చేసి వేరుగా పెట్టాలి. మళ్లీ అన్ని చేసి పెట్టిన తర్వాత, టీవీ చూస్తూ అవి తింటూ అమ్మా ఇందులో కారం తగ్గిందే అని పిల్లలు, ఇందులో ఇంకాస్త తీపి పడలేమో అని శ్రీ వారు వంకలు పెట్టడం, పోని తీపి కారం ఎక్కువ వేస్తే అదో బాధ అవన్నీ బాగా తిని అరగడం లేదని ఏడుపు.

తిండి లేక జనాలు అల్లాడుతూ ఉంటే, వీళ్లది ఇంకొక వేషం. ఖర్మ రా బాబు చేసుకున్న పాపానికి నాకు తప్పదు కదా..! ఇక పండగలు, పబ్బాలు వస్తె అదొక పెద్ద లంపటం అన్ని ముందుగానే వండి పెట్టుకుని ఆ తర్వాత పిల్లలను ఆయన్ను రెడీ చేసి పూజ దగ్గర కూర్చో పెట్టీ వాళ్ళతో అన్ని సరిగ్గా చేయించడం.

అదయ్యక భోజనాలు చేసిన గిన్నెలు, కంచాలు కడగడం, పండగ కదా అని నాలుగు రకాలు ఎక్కువ చేయడం వాళ్లకు నచ్చినవి చేయకపోతే అదొక రామాయణం. బ్రతిమాలి, బామలి తినిపించడం. అబ్బో అదొక ప్రహసనం బాబోయ్.  ఇవ్వన్నీ అయ్యాక ఉన్న ఆకలి కూడా చచ్చిపోయి ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి సగం ఆకలితో లేవడం. చెప్తూ పోతే ఇదొక రామాయణం అవుతుంది.

మీరు ఒక విషయం గమనించారా? యంత్రంకు అయినా ఛార్జింగ్ పెట్టి కాసేపు మూలన పెడతారు. కానీ, ఆడవాళ్ళకు అది కూడా లేదు. ఈ వయసులో అనే కాదు ఏ వయసు అయినా అబ్బా నువ్వు చేస్తే బాగుంటది చేయవా అమ్మ, నీ చేతి వంట తినక చాలా రోజులు అయ్యింది అమ్మమ్మా అంటూ , నానమ్మ, నువ్వు చేసే కంద బచ్చలి కూర అంటే నాకు ఇష్టం చేయవా అంటూ పండు ముసలి అయినా కూడా చేయించుకుని తింటారు..

నాకు విశ్రాంతి లేదు

ఇవన్నీ కాకుండా ఇల్లు కడగడం,  దులపడం, బాత్రూంలు కడగడం, పిల్లల ముడ్డి కడగడాలు ఇవ్వన్నీ మీ జన్మ హక్కు అన్నట్టుగా మాట్లాడాలు, ఆ మాత్రం అయినా చేసుకోలేరా అంటూ దెప్పి పొడుపులు, ఒక్క రోజు చాత కాక పోయి పడుకుంటే ఇక ఇల్లు రణరంగం అవుతుంది. గిన్నెలు మాడుతాయి, బట్టలు అన్నీ ఇల్లంతా పరుచుకుంటాయి, ఒక్క వస్తువు ఒక్క చోట ఉండదు. అవన్నీ మళ్లీ సర్దుకునే సరికి తల ప్రాణం తోకకు వస్తుంది.

Mom holding son's hand | Free SVG

ఇవ్వన్నీ ఒక ఎత్తు అయితే ఇక ఇంటికి వచ్చి పోయే బంధువులకు వంటలు, పెట్టిపోతలు, వారికి మర్యాదలు, మన్ననలు వారికి నచ్చినవి వండి వార్చడాలు, పెళ్ళిళ్ళు, శుభ కార్యాలు, ఏవి జరిగినా ఇంతకు రెట్టింపు పనులు చేస్తూ మా శరీరాలను, మనస్సును నాశనం చేసుకుంటూ ఉంటే? మీకేం తక్కువ అంటూ సూటి పోటి మాటలు మాట్లాడుతూ, మనసు చిద్రం చేస్తూ కొందరు కేవలం ఆడవాళ్ళని కించచపరచడానికే పుట్టాము, అన్నట్టుగా మాటలు అంటూ మా మనసును నొప్పిస్తు ఉంటారు.

మీకు అర్దం అయ్యింది కదా ఇంతకు యంత్రం అన్న పేరు కూడా నాకు లేదు. ఇవ్వన్నీ చెప్తే మీకేం తక్కువ? మీ నోరు మీ ఇల్లు చేసుకుని తినాలి అంటారు. కానీ, ఆడవాళ్ళు అందరికీ చేసి పెట్టి అలసిపోయి ఎవరైనా చేసి పెడితే బాగుండు కూర్చున్న దగ్గరికి తెచ్చి పెడితే బాగుంటుంది అని అనుకుంటారు.

కానీ చచ్చే దాకా ఆ ఛాన్స్ రాదు పైగా, మీకు సహనం, ఓర్పు, పట్టుదల ఎక్కువ అంటూ పొగిడి అందలం ఎక్కించినట్టు నటించి చివరికి కాటి కి పంపుతారు. కాటికి వెళ్ళినా కూడా మా గురించి ఎన్నో మాటలు మాట్లాడుతూ మమల్ని అవమానిస్తూ ఉంటారు.

అందుకే నాకు విశ్రాంతి లేదు. ఒక మహిళ ఆత్మ ఘోష . . .

-భవ్యచారు

Related Posts