నల్లంచు తెల్ల చీర
అబ్బా ఎంత బాగుందో ఆ చీర ,అక్కడ ఉన్నవారి కళ్ళన్నీ ఆ చీర మీదనే ఉండడం నా కళ్ళు దాటి పోలేదు. ఒక్క నేనేనా అక్కడున్న వారి అందరి కళ్ళు దాని వైపే ఉన్నాయి. నిజంగా ఎంత బాగుంది.
తెల్లని చీర మిద చిన్న చిన్న పువ్వులు అక్కడక్కడ నల్లని పువ్వులతో ,నల్లని అంచు తో కళ్ళు జిగేలు మనేలా, చూసిన వారి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న అ చీర అంటే అక్కడున్న వారి అందరికి ఏంతో ఇష్టంగా అనిపిస్తుంది.
దాన్ని సొంతం చేసుకోవాలని అందరికి అనిపిస్తుంది... నిజానికి చీరలు అంటే ఇష్టం లేని ఆడవాళ్లు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎన్ని చీరలు ఉన్నా ,ఎన్ని నగలు ఉన్నా మళ్ళీ మాకు మంచిది కనిపిస్తే చాలు అది కావాలని అనిపిస్తుంది.
అలా మేము కొంటున్న వాటికీ అందరూ కొంటున్నారు. కానీ కట్టుకోరు అంతగా ఎందుకు కొంటున్నారు అంటూ మమల్ని తిట్టు కుంటారు కానీ వాటిని మేము కొనేది మా భర్తల కోసమే అని మాత్రం తెలుసుకోలేరు.
మా కోసమా ,మా కోసం అయితే మాకు కొనాలి కానీ మీరెందుకు కొనడం అంటారా ,అవునండి మీ కోసమే… ఎందుకంటే మీకు బంధువుల్లో, చుట్ట పక్కల వాళ్ళు మిమల్ని మంచి వాళ్ళు అనుకోవాలి అని.
భార్యని బాగా చూసుకుంటాడు అనే పేరు మీకు రావాలి అని మేము బట్టలు కొనుక్కోవడానికి ఇష్ట పడతాము. మీరు మాకు కొనివ్వడం వల్ల మీకు అలా మంచి పేరు తెస్తాం అన్న మాట.
ఇంతకీ ఈ నల్లంచు తెల్ల చీర చాల బాగుంది దాన్ని చూడగానే నాకెంతో నచ్చింది. నేను మా వారి వైపు చూసాను ఆయనకి కూడా ఆ చీర బాగా నచ్చినట్టు ఉంది.
చూపంతా దాని వైపు ఉండడం చూసి కొట్టు వాడు సర్ దాన్ని చూస్తారా అని అడిగాడు. అది మన రెంజులో ఉందా ,లేదా తెలుసుకోవాలనే ఆశ నాలో కలిగింది. కనీసం కొనకున్నా, ఒక్కసారి అయినా ముట్టుకోవాలనే కోరిక అయినా తీరుతుంది అని అయన వైపు చూసాను.
చూద్దాం అన్నట్టుగా సరే తియ్యండి అన్నారు మా వారు కొట్టు అతను ఆ చీరని అపురూపంగా తీసి అన్ని చీరలు పడవేసినట్లు కాకుండా నెమ్మదిగా కింద పెట్టాడు. అతను ఆ చీరని తియ్యడం లోనే తెలిసింది ఆ చిర మిద ఎందరి కన్ను ఉందో నని….
దాన్ని నేను ఒక్కసారి మెల్లిగా తాకి చూసాను చాలా మెత్తగా ,ముట్టుకుంటే మాసిపోయేలా ఉంది ఆ చీర. అలా అ చీరని ముట్టుకుని చూసాను. అ చీరకు అందమంతా నల్లని అంచు తోనే వచ్చింది.
మొత్తం అంతా ప్లెయిన్ గా ఉండకుండా చిన్నవి కానీ కనిపించకుండా ఉండే విధంగా ఉన్న చిన్న పువ్వులు ఉండడం వల్ల తెల్ల చీర మిద చుక్కలు మెరిసినట్టుగా అనిపిస్తుంది.
దాన్ని చూస్తూ ఎంత అని అడిగారు మా ఆయన. మూడు వేలు సర్ అని చెప్పాడు కొట్టు వాడు… అమ్మో మూడు వేలా ఒక్క నెల రోజులు మా ఇంట్లో తిండి ఖర్చు అది ఆ మూడు వేలు ఉంటె తిండికి లోటు లేకుండా ఉంటాము అందరం.
ధర వినగానే నేను ఆ చీరని చేతిలోంచి వదిలేసా, ఇక వీళ్ళు కొనరు అని అనుకున్నాడెమో కొట్టు వాడు దాన్ని తీసి మడత పెట్టి ,మళ్ళి రాక్ లో పెట్టేసాడు.
నిజం చెప్పొద్దూ నాకు చాలా అవమానం అనిపించింది. ఏడుపు కూడా తన్నుకుంటూ వచ్చింది. అయినా మనకు అందని దానికోసం చూడొద్దు అని, పిల్లల కోసమని బట్టలు తీసుకుని బయటకు నడిచాము.
బయటకు వచ్చిన తర్వాత బైక్ కీస్ మర్చిపోయాను అని మా వారు మళ్ళీ లోపలికి వెళ్ళారు తేవడానికి, ఆయన వచ్చే వరకు అక్కడే నిలబడ్డాము మేము. అయన రాగనే దొరికాయా అని అడిగాను ఆత్రంగా…
ఎక్కడికి పోతాయి మనకు రాసి పెట్టి ఉంటె అది ఎలాగైనా వస్తుంది అని అన్నారాయన… వాటికి అర్దాలు వెతికే ఓపిక లేక నవ్వేసాను నేను ,మనసు అంతా బాధ తో నిండినా కూడా…
ఇది జరిగిన నెల రోజులకు ఆ రోజు నా పుట్టిన రోజు పొద్దునే తలంటుకుని గుడికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. స్నానం చేసి వచ్చి, బీరువాలో ఉన్న చీరలోంచి నాకు నచ్చిన చీర కట్టుకుందామని బీరువా తీసాను.
మనసు బాధగా ములిగింది ఒక్క క్షణం ఆ నల్లంచు తెల్ల చీర కొని ఉంటె ఈ రోజు కట్టుకునే దాన్ని అనే ఆ బాధ ,కానీ మళ్ళీ మనసు లోంచి ఆలోచనని తీసేసా… ఆశకు హద్దు కూడా ఉండాలి అని అనుకుంటూ.
ఇంతలో ఇయన వెనక నుండి వచ్చి కళ్ళు ముసారు అమ్మో పిల్లలు చూస్తారు అంటూ వెనుదిరగ బోయా, నా మెడ చుట్టూ చిరని కప్పారు ఆయన.
నేనా చిరని చూసి ఆశ్చర్యం తో కళ్ళు పెద్దవి చేసి చూసా ఆయన వైపు ఈ నెల రోజులు ఈ చీర కోసం ఆయన తెల్లార్లు డ్యూటీ చేసారా అని కళ్ళ నిండా కన్నీళ్ళతో ఆయన్ని చూసాను…
పిచ్చి ఏడవకు పుట్టిన రోజు ఏడుస్తారా అంటూ నన్ను దగ్గరి కి తీసుకుని నుదుటి మిద ముద్దు పెట్టి త్వరగా రెడీ అవ్వు ,గుడికి అందరం కలిసి వెళ్దాం అని బయటకి నడిచారు ఆయన… నేనా చిరని కట్టుకుని ,రెడీ అయ్యి అయన కాళ్ళ కి నమస్కరించాను తృప్తి నిండిన హృదయం తో ……
– భవ్య చారు