నాన్న డైరీ లో చివరి పేజీ

నాన్న డైరీ లో చివరి పేజీ

మొదటిసారి నేను నాన్న గురించి రాస్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఎందుకో మరి…

కాళ్ళతో తన్నావు అని ఆ రోజు కొప్పడ్డాను. కాటికి నాన్న చేరిన రోజున ఆ కాళ్ళ దగ్గరే పడి నన్ను కొట్టడానికి రమ్మని కన్నీళ్లు ఇంకేలా ఏడ్చాను.. మీతో ఒక్క సారి మనసారా మాట్లాడాలి అని ఉంది నాన్న…

ఇప్పటికీ గుర్తు నాకు నాన్న డైరీ లో చివరి పేజీ అప్పుడే మద్రాసు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకో బెట్టారు. తెలిసి తెలియని వయసు నాది.

పట్టుమని 10 సంవత్సరాలు కూడా లేవు అనుకుంటా, అందరూ వచ్చి నాన్నను చూసి వెళ్తున్నారు. నేను ఆయన మంచం పక్కనే ఉన్నాను.

అందరూ వెళ్లి పోయాక అతికష్టం మీద నాన్న నన్ను దగ్గర కి తీసుకొని ఒక్క సారిగా జలపాతం లా కన్నీటి ధారలు…

బహుశా ఆ కన్నీటికి అర్థం ఆ రోజు నాకు అర్థం కాలేదు అనుకుంటా… ఆ క్షణం తలుచుకుంటే ఇప్పటికీగుండె చివుక్కుమంటుంది.. ఆ మాటలు అర్థం చేసుకొనే సమయానికి ఆయన నా పక్కన లేరు…

నాన్న చెప్పిన చివరి మాట.. నీకు నేను ఏమి ఇవ్వలేక పోయాను.. ఇప్పుడు ఇద్దాం అంటే నా దగ్గర ఏమి లేదు. జాగ్రత్తగా ఉండు అంటూ గుండెలకి హత్తుకున్నారు.. అదే చివరి మాట. ఆ రూం లో నేను నాన్న తప్ప ఎవరు లేరు…

మీరు నాకు ఏమి ఇవ్వక పోవడం ఏమిటి నాన్న….. నాకు జీవితాన్ని ఇచ్చారు. మీ పేరును నాకు ఇచ్చారు. మీ బుద్ధులు. మీ మంచితనం నాకు ఇచ్చారు.

పక్క వాడికి సహాయం చేసే గుణాన్ని ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా పలానా వాళ్ళ అబ్బాయి అని గుర్తింపు ఇచ్చారు. ఇంకా ఏమి కావాలి నాన్న…. అన్ని ఇచ్చిన మిమ్మల్ని ఇంత త్వరగా ఎలా మర్చిపోతాం నాన్న…..

నాకు ఎన్ని సమస్యలు ఉన్నా.. సమస్యను చూసినప్పుడు మీరే నా ఇన్స్పిరేషన్ మీరు నాకు ఎప్పటికి హీరో నే నాన్న నా జీవితం లో ఎప్పటికీ మీరే నా హీరో..

బహుశా మీరు నా పక్కన ఉండి ఉంటే ఈ క్షణం నా లైఫ్ వేరేలా ఉండేది ఏమో…

మీ మనవడు/మనవరాలు నోరారా తాతయ్య అని పిలవడానికి మీరు మా మధ్య లేరు అని అప్పుడు అప్పుడు మనసు లోగిళ్ళలో బాధ..

ఏది ఏమి అయినా మీరు ఎక్కడ ఉన్నా మీ చల్లని చూపు మా మీద ఉంటుంది అని కోరుకొంటూ…

-మల్లిఖార్జున్

Related Posts