నాన్న నేను ఐస్ క్రీమ్…

నాన్న నేను ఐస్ క్రీమ్…

పదో తరగతి పూర్తి అయ్యాక, నలందా కాలేజీలో బై.పీ.సీలో జాయిన్ అయిన మొదటి రోజులు అవి. మొదటి సంవత్సరంలో బస్ పాస్ తీసుకుని రోజు కాలేజీకి వెళ్లడం, రావడం చేసేదాన్ని. నాన్న నాకు పాకెట్ మనీగా రొజూ అయిదు రూపాయలు ఇచ్చేవారు.

అమ్మ పొద్దున్నే వంట చేసి, నాకు బాక్స్ లో పెట్టీ ఇచ్చేది. నేను ఎనిమిది గంటలకు కాలేజీ అయితే ఏడు గంటల బస్ కు వెల్లేదాన్ని, అంతా ముందుగా ఎందుకు అంటారా! అయ్యో రామ అప్పుడు బస్ లు ఎక్కువగా ఉండేవి, వచ్చేవి కావు. టైంకి వెళ్ళకపోతే అటెండెన్స్ ఉండేది కాదు. దాంతో, ముందుగా అయినా సరే తొందరగానే వెళ్ళేవాళ్ళం అందరం.

అయితే, ప్రొద్దున ఏమీ తినకుండా వెళ్ళిన మాకు పది కాగానే ఆకలి వేయడంతో బ్రేక్ లో బాక్స్ సగం తినేసే వాళ్ళం. మధ్యాహ్నం ఉన్న కొంచం తినేసి సాయంత్రం వరకు ఉండేవాళ్ళం. కానీ, సాయంత్రం అయ్యేసరికి బాగా ఆకలి వేసేది.

నా మిత్రులు వాళ్ళు తెచ్చుకున్న డబ్బుతో ఏవేవో కొనుక్కుని తినేవారు. నా దగ్గర డబ్బులు తక్కువ ఉండడం వల్ల నేను కనుక్కోలేక పోయేదాన్ని. వాళ్ళు కొన్న దాంట్లో కొంత పెట్టేవారు. కానీ, రోజూ పెట్టరు కదా, మనకు అడగాలి అంటే సిగ్గు. పైగా, భోజన ప్రియురాలిని కాబట్టి అక్కడ హోటల్స్ లో ఉన్నవి చూడగానే నోరు ఉరిపోయేది. ఇక మా స్నేహితులం అందరం బస్ స్టాండ్ కి రాగానే తలా ఒక ఐస్ క్రీమ్ కానీ, కప్ ఐస్ క్రీమ్, పెప్సీ ఇలా ఒక్కొక్కటి కొనుక్కుని తినేవారు.

Father and Daughter - Free Image by Tharun Teja Reddy on PixaHive.com

నాకు ఐస్ క్రీం అంటే ఒక్క గీతా ఐస్ క్రీమ్ తెలుసు. మొదటి సారి కప్ ఐస్ క్రీమ్ తినగానే దానికి ఫిదా అయ్యాను. అది కూడా వాళ్ళే ఇప్పించారు. తెల్లారి మళ్లీ నాన్న నాకు ఇచ్చిన అయిదు రూపాయలతో ఒక్కరోజు ఒక ఐస్ క్రీమ్ కొనుక్కుని తిన్నాను.

నాన్న నేను ఐస్ క్రీమ్…

ఇలా రోజు నాన్న ఇచ్చిన అయిదు రూపాయలతో ఐస్ క్రీమ్ తినడం, నేస్తాలతో నేనూ కొనుక్కొగలను అని గొప్పగా చూపిస్తూ ఉండగా… నా దగ్గర నోట్స్ అయిపోయాయి. కొనడానికి డబ్బులు లేవు. దాంతో నాన్నను అడగవలసి వచ్చింది.

నెలాఖరు కాబట్టి నాన్న దగ్గర డబ్బులు నిండుకున్నాయి. దాంతో, నీకు రోజూ అయిదు రూపాయలు ఇస్తున్నా కదా అవన్నీ ఏం చేశావు, వాటితో ఈ సారికి కొనుక్కో అన్నారు. దాంతో, నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.

ఇప్పుడేం చేయాలి డబ్బు లేదు ఐస్ క్రీమ్ తిన్నాను అంటే ఏమంటారో అని భయపడుతూ అలాగే అని అన్నాను.

కానీ, అమ్మ నా అవస్థ కనిపెట్టి ఏమైంది అంటూ అడిగింది. దాంతో, నేను చేసిన ఘనకార్యం చెప్పాను. దాంతో, అమ్మ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, ఇంకోసారి తినకు అంటూ క్లాస్ పీకింది. అమ్మ నన్ను తిట్టింది నాన్నగారు విన్నట్టు ఉన్నారు. అప్పటికి ఏమీ అనలేదు కానీ, జీతాలు వచ్చిన తెల్లారి ఒక పూట స్కూల్ చేసుకుని నేను చదువుతున్న కాలేజీకి వచ్చారు.

నాన్న వచ్చారు అని తెలిసి కొంత భయం, కొంత సంతోషం ఎందుకంటే మొదటి సారి నాన్న నా కోసం రావడం అది కాలేజీకి, దాంతో గబగబా వెళ్ళాను.

కాలేజీ అయ్యేవరకు పక్కనున్న హోటల్ లో కూర్చుంటాను రమ్మని అన్నారు నాతో, నేను సరే అని మళ్లీ క్లాస్ కి వచ్చాను. కాలేజీ అయ్యేవరకు అక్కడే ఉండి టీలు తాగుతూ ఎదురు చూసారు నాన్న నా కోసం.

ఇక కాలేజీ అయ్యాక వెళ్లి నాన్నను కలిశాను. టీ తాగుతావా అన్నారు. నేను వద్దు అనగానే సరే పద పోదాం అన్నారు.

నాకు కాస్త భయంగా ఉంది. దేనికి వచ్చారు అసలు ఏం అడుగుతారు, ఏమీ మాట్లాడడం లేదు నేను ఏదైనా తప్పు చేశానా అనుకుంటూ ఉన్నాను కానీ, బయటకు ఏమీ అనకుండా వెనకాలే నడిచాను.

బస్ స్టాండ్ కి వెళ్ళాక అక్కడ ఓ పక్కగా ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి నడిచారు, నేను అనుసరించాను.

Little girl in the park giving ice-cream to hеr father | Young fathers, Photo, Stock images free

ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు అన్నారు. అతను ఇవ్వగానే నాకు ఇచ్చి తిను అన్నారు. నేను భయంగానే తీసుకుని తింటూ కాస్త పక్కకు వచ్చి నిలబడ్డాను. నాన్న అతనితో మాట్లాడుతున్న మాటలు నాకు వినిపిస్తున్నాయి. చూడు బాబు నేను ఫలానా ఊర్లో టీచర్ గా పని చేస్తున్నాను.

ఈ అమ్మాయి నా కూతురు, ఇక ముందు మా అమ్మాయి ఎప్పుడు వచ్చి ఐస్ క్రీమ్ అడిగినా ఇవ్వు, నెల కాగానే మా బడికి వచ్చి ఎంతైంది చెప్పు ఆ డబ్బు నేను ఇస్తాను. రోజు ఎన్ని ఇచ్చావు అనేది ఒక బుక్ లో రాసి పెట్టు అంటూ వంద రూపాయలు అతనికి ఇచ్చారు.

అతను అయ్యో సార్ మీరు నాకు తెలుసు, మా తమ్ముడు మీ దగ్గరే చదువుకున్నాడు అని అంటూ పర్లేదు సార్ ఇస్తాను డబ్బు వద్దు అన్నారు. కానీ, నాన్నగారు మాత్రం నువ్వు కూడా బ్రతకాలి కదయ్యా అంటూ డబ్బు ఇచ్చి మరొక్కసారి నన్ను చూపించారు.

ఇక నా సంతోషానికి అవధులు లేవు. రోజు ఐస్ క్రీమ్ తినొచ్చు అది కూడా ఎన్నంటే అన్ని అని అనుకుంటూ అప్పుడే వచ్చిన బస్ ఎక్కాము. కిటికీ పక్కన నన్ను కూర్చోబెట్టిన నాన్న బస్ స్టార్ట్ అయ్యి వెళ్తుండగా..

చూడమ్మా, నీకు ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా దాచుకో, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టకు, అలాగే నువ్వు ఐస్ క్రీమ్ తిని తప్పు చేయలేదు. కాబట్టి, నువ్వు నాకు నిజం చెప్పాల్సింది. కానీ, చెప్పకుండా దాచావు అది తప్పు. తప్పు చేసి ఒప్పుకుంటే, కొంచం అయినా తప్పు చేసిన బాధ తగ్గుతుంది. నీకు ఇష్టమైన ఆహారం నువ్వు తిన్నావు అది తప్పు కాదు. డబ్బును జాగ్రత్తగా దాచుకుని ఖర్చు పెట్టుకోవాలి.

ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది, రేపు ఇంకేదో కావాలి అనిపిస్తుంది కదా అప్పుడు డబ్బులు ఉంటే నువ్వే కొనుక్కుని తినొచ్చు. అందుకే డబ్బు పొదుపుగా దాచుకోవాలి, నీకు ఏదైనా కావాలి అనిపిస్తే నన్ను అడుగు మొహమాట పడకు, భయపడకు అంటూ చెప్పారు.

1,047 Dad And Daughter Ice Cream Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

అలాగే నాన్న అని మాత్రం అనగలిగాను. ఆ సమయంలో క్లాస్ పికుతున్నరు అనిపిస్తుంది కదా, నాకూ అలాగే అనిపించింది. ఇక రోజూ నేను ఐస్ క్రీమ్ తినడం మొదలు పెట్టాను. నెల రోజులు తృప్తిగా అన్ని తిన్నాను. బాగా అనిపించింది.

నెల రోజుల తర్వాత నాన్న జీతం డబ్బులు తీసుకుని వచ్చి, లెక్కలు వేసుకుంటూ ఉండగా నాన్న గారు ఈ నెల నాకు టీ డబ్బులు వద్దు అని అమ్మతో అన్నారు. ఎందుకండీ మీరు స్కూల్ లో రెండు సార్లు తాగుతారు కదా అన్నది. లేదు, ఈ సారి వేరే అవసరం పడింది వాళ్లకు ఇచ్చాను అని అన్నాడు.

నాకు విషయం కొంచం అర్దం అయ్యింది కానీ అమ్మ నాన్నను రెట్టించి అడిగినా కూడా నాన్న ఏమీ చెప్పలేదు. కానీ, నా మనసుకు మాత్రం తెలుసు అసలు విషయం ఏమిటో అని. నాకు ఐస్ క్రీమ్ కొనివ్వడం కోసం నాన్న టీ తాగడం మానేశారు అని బాధగా అనిపించింది.

తెల్లారి కాలేజీ అయ్యాక బస్ స్టాండ్ కి వచ్చాను. ఐస్ క్రీమ్ అతను నన్ను చూసి నవ్వూతూ రా బుజ్జి ఐస్ క్రీమ్ తీసుకో అని కప్ తీసి ఇచ్చాడు. కానీ, నేనది తీసుకోకుండా ఇంతవరకు ఎన్ని డబ్బులు అయ్యాయి అంకుల్ అని అడిగాను.

దానికి అతను నవ్వుతూ ఎంతమ్మ వెయ్యి రూపాయలు అంతే, నాన్న గారు నిన్ననే ఇచ్చారు అయినా నీకెందుకు? దా తీసుకో అన్నాడు. అమ్మో వెయ్యి రూపాయలా అంటే నాన్న ఎన్ని రోజులు టీ మానేయాలి అని అనుకుంటూ వద్దు అంకుల్ ఇక నాకు ఐస్ క్రీమ్ ఇవ్వకండి అని అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను.

Father And Son Walking At Sunset Stock Photo - Download Image Now - iStock

ఇక కాలేజీ అయ్యేంత వరకు అంటే రెండేళ్లు నేను ఐస్ క్రీమ్ తినలేదు. నాన్న ఫీజు కట్టడానికి వచ్చినప్పుడల్లా నాకు కొనిస్తాను అన్నా కూడా నేను వద్దు అని అనేదాన్ని…

ఇదండీ నాన్నగారు నేను ఐస్ క్రీమ్ తినడానికి తాను టీలు తాగడం మానేశారు. స్కూల్ అంటే ఎన్నో తలనొప్పులు ఉంటాయి. టీచర్స్ అందరికీ ఆ విషయం తెలుసు. కానీ, కూతురు కోసం ఆ తల నొప్పిని కూడా భరించాలి అని అనుకున్న మా నాన్న నాకు హీరో కంటే ఎక్కువ… మా నాన్నే నా హీరో…

కానీ, ఆయన నాకు చెప్పిన పొదుపు సూత్రాలు నేను ఉద్యోగం చేసినప్పుడు ఎప్పుడూ పాటించలేదు. దానివల్ల ఇప్పుడు బాధ పడుతున్నా. కానీ, ప్రయోజనం ఏమి లేదుగా.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం…

కానీ, నాన్న నాకు నేర్పిన పొదుపు పాఠం ఇప్పటికైనా పాటించాలి అని అనుకుంటున్న… నాన్న కోసం ఒక రోజు కాదు, రోజు మొదలయ్యేది నాన్న జ్ఞాపకాలతోనే…

నాన్నే నా హీరో…

Related Posts

1 Comment

  1. కధ బాగుంది. తల్లిదండ్రులు చెప్పిన మాట పాటించాలి అని చెప్పారు. తండ్రి పిల్లల కోసం కొన్ని త్యాగం చేస్తారు. గొప్పగా చెప్పారు.

Comments are closed.