నాన్నగారి కథలు

నాన్నగారి కథలు

మా నాన్నగారి గురించి చాలా చెప్పాలి అని ఉంది. అందుకే ఒక్కొక్క కథ మీకు చెప్తాను. ఈ శీర్షిక ద్వారా మీరు కూడా మీ నాన్నగారి గురించి నాకు చెప్పండీ.. మరి మనం మా నాన్నగారి కథ లోకి వెళ్దామా…

అవి మా నాన్న గారి చిన్నప్పటి రోజులు అన్నమాట. ఒక రోజు మా నాన్నగారు వాళ్ళ అక్కగారింటికి వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా బయలు దేరారు.

మా నాన్నగారు వెళ్తున్నారని తెలిసి మా నానమ్మ గారు తన కూతురి కోసం దసరా పండగకు చేసిన అప్పాలు, మురుకులు లాంటివి ఒక మూట గా కట్టి ఇచ్చారు. మరి ఉత్త చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది కదా అందుకని పిండి వంటలు కట్టి ఇచ్చారు.

ఆ మూటను మా నాన్నగారు అద్దె సైకిల్ పైన కట్టుకున్నారు. మరి ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు తక్కువ అయితే ఎడ్ల బండి లేదా ఎప్పుడో వచ్చే బస్ లేదా సైకిల్. సైకిల్ పైనే ఎంత దూరం అయినా వెళ్ళేవారు. షార్ట్ కట్ లో వెళ్తే తొందరగా వెళ్ళేవారు. అందుకని బస్ ను నమ్ముకొలేక సైకిల్ ని నమ్మేవారు. 

**********

ఇక నాన్నగారి ప్రయాణం మొదలైంది. ముందుగా చిన్న చిన్న పల్లెలు దాటుతూ మెయిన్ సిటీ లోకి వచ్చారు. అప్పటికి సాయంత్రం అవడం వల్ల అక్కడ కొందరు మిత్రులు కూడా ఉండడంతో వాళ్లను కలిసి మళ్లీ ప్రయాణం అయ్యారు.

వాళ్ళు మాత్రం చీకటి అవుతుంది రా వద్దు అన్నారు. కానీ నాన్నగారు మాత్రం ఏం పర్లేదు ఇంకో పది కిలోమీటర్లు అంతేగా వెళ్తాను, గంటలో ఇంట్లో ఉంటాను అంటూ బయలు దేరారు అంట.

ఇక సిటీ దాటాక అడవి స్టార్ట్ అయ్యింది. నాన్నగారు చిన్న రేడియో ని సైకిల్ కి కట్టి పాటలు వింటూ వెళ్తున్నారు. అయితే నాన్నగారి సైకిల్ కి లైట్ లేకపోవడం తో తాను వెళ్తున్న దారి సరి అయినదే అనుకున్నారు.

ఇంతలో దూరంగా లైట్ వెలుగులు కనిపించాయి. దాంతో అరే తొందరగానే వచ్చాను అనుకుంటూ లైట్ వెలుగు లు కనిపిస్తున్న దిశగా సైకిల్ తొక్కడం మొదలు పెట్టారు.

కానీ ఎంత సేపు తొక్కినా ఆ లైట్ వెలుగుల దగ్గరికి వెళ్ళలేక పోయారు. అలా అవి వెనక్కు వెళ్తూనే ఉన్నాయి. నాన్నగారు కూడా వాటిని చూస్తూ వెళ్తున్నారు.

అలా ఎంత దూరం వెళ్లారో గానీ చాలా రాత్రి అయినట్టు అనిపించింది. దాంతో నాన్నగారికి అనుమానం వచ్చి టక్కున సైకిల్ అపేసీ ఒక్క రెండు నిమిషాలు ఆలోచించారు.

అప్పుడు నాన్నగారికి ఆ రోజు అమావాస్య అని గుర్తొచ్చి, ఈ రోజు అమావాస్య పైగా చీకటి సైకిల్ కి లైట్ లు లేవు. నాకు దూరంగా వెలుగు కనిపిస్తుంది అంటే ఇదేదో దెయ్యం పని లాగా ఉందని అనుకుని వెంటనే సైకిల్ నీ వెనక్కి తిప్పారు.

కానీ సైకిల్ ముందుకు కదలకుండా మోరాయించడం చూసి నాన్నగారు దెయ్యమే అని కన్ఫర్మ్ చేసుకుంటూ మనసులో కాకుండా బిగ్గరగా గాయత్రి మంత్రాన్ని జపించడం మొదలు పెట్టారు.

దాంతో సైకిల్ కదిలింది. దాని పై ఎక్కేసి తొక్కడం మొదలు పెట్టారు. ఇక చూడండి ఒకటే అరుపులు అంట రేయి రారా రామారావు అరేయి ఇటు రారా నాకు ఆకలిగా ఉంది రా రారా వెళ్ళకు రా అంటూ అరుపులు వినిపించే సరికి నాన్నగారికి చెమటలు పట్టాయి.

ఇక నాన్నగారు ఆంజనేయ దండకం మొదలు పెట్టడంతో అరుపులు ఇంకా ఎక్కువ అయ్యాయి. కానీ ఈ సారి అరుపులు కాకుండా తిట్లు మొదలు అయ్యాయి.

ఒరేయి నాకు ఆకలిగా ఉంది రా అన్నం పెట్టరా, అప్పాలు ఇచ్చిపోరా, ఆంజనేయ దండకం అపురా చదవకురా, నన్ను చూడు రా, వెనక్కి తిరుగు రా అంటూ నాన్నగారి వెనకాలే అరుస్తూ వస్తుంది.

ఇక ఇలా కాదని నాన్నగారు గట్టిగా దండకం తనకు వచ్చిన దేవుని శ్లోకాలు చదవడం స్టార్ట్ చేసి సైకిల్ ఆపకుండా తొక్కుతున్న ఉన్నారు. అలా తొక్కేసి చివరికి ఎలాగో అతి కష్టం మీద ఊర్లోకి వచ్చేసి, ఊరి పొలిమేరల్లో ఉన్న అమ్మవారి గుడి దగ్గర సైకిల్ ఆపెసీ పడిపోయారు.

సైకిల్ శబ్దం విన్న అత్తయ్య వాళ్ళు బయటకు వచ్చి నాన్న గారిని చూసి, అయ్యో అంటూ నీళ్ళు తెచ్చి చల్లడం తో నాన్నగారు తెలివి లోకి వచ్చి జరిగింది మొత్తం చెప్పడం తో మా మేనమామ గారు గుళ్ళోకి వెళ్లి అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు తెచ్చి పెట్టారు.

మూడు రోజులు జ్వరంతో ఉన్న నాన్నగారు జ్వరం తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేసారు. నాన్నగారు ఇంకెప్పుడు సైకిల్ పైన ఆ ఊరికి వెళ్ళలేదు. బస్ లో తప్ప… కానీ నాన్న గారు ధైర్యంగా ముందుకే వెళ్ళారు.  వెనక్కి తిరిగి చూసి ఉంటే ఏం జరిగేదో తల్చుకుంటే ఇప్పటికీ భయం వేస్తుంది.

మాకు మా నాన్నగారు తన జీవితంలో జరిగిన సంఘటనలను కథలుగా చెప్పేవారు. అందులో ఉన్న నీతి, నిజాయితి, అప్పటి పరిస్థితులన్నీ మాకు తెలిసాయి ఆ కథల వల్ల…

అయితే నేను వాటిని మీతో పంచుకోవాలని నాకు గుర్తున్నంత వరకు చెప్పాలని ఇలా కథలుగా రాయలని అనుకున్నాను. అమ్మ గురించి అందరు చెప్తారు. కానీ నాన్న గురించి కొందరే చెప్పుకుంటారు…

కనీసం ఇలాగైనా అప్పటి రోజులను తలచుకోవాలి అని నా ఈ చిన్ని ప్రయత్నం..  ఇంకొక కథ తో మళ్లీ వస్తాను ఉంటాను…

– భవ్య చారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *