నాన్నకో లేఖ

నాన్నకో లేఖ

ప్రియమైన నాన్నగారికి ప్రేమతో రాస్తున్న లేఖ ….

నాన్న నువ్వు మాకు ఎంతో జీవితాన్ని ఇచ్చావు. సంపదలు లేకున్నా, ఆస్తులు ఇవ్వక పోయినా, చదువు, సంస్కారం నేర్పావు.

నాన్న నువ్వు మాతో ఎప్పుడూ స్నేహంగా లేవు, మమల్ని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడివి. అప్పుడు మేము చాలా తిట్టుకునే వాళ్ళం. ఎప్పుడూ కొడతావు, తిడతావు అని, కానీ అవన్నీ మా మంచికే అని ఇప్పుడు అర్ధం అవుతుంది.

నాన్న నువ్వు అందరితో కలిసిపోతూ, సాయం చేస్తుంటే అందరికీ మంచి చేస్తావు మాకేం చేయవు అని అనుకునే వాళ్ళం.

అందర్నీ నీ వాళ్ళే అనుకుంటూ వారికి సాయం చేస్తూ, ఉచిత విద్య నేర్పుతుంటె నీకు బతకడం తెలియదని అనుకున్నాం.

పెద్ద ఇల్లు, కారు లేవని సంపాదించే శక్తి లేదనుకున్నాము, తెలివి లేదని తిట్టుకున్నాము. పరోపకారం మిదం శరీరం అన్నట్టు పరోపకారం చేస్తుంటే పసలేని వాడివి అనుకున్నాం.

లెక్కలు రాకుంటే పక్కనుండి మరి కొట్టిస్తుంటే కోరకోర చూసాము. కొట్టి చదువు నేర్పిస్తే, తెల్లారు ఝామున లేపి చదవమని అంటే ఎన్నో మాటలు మనసులో తిట్టుకున్నాము. ఒకానొక సమయంలో నువ్వు చావాలని కూడా కోరుకున్నాము.

కానీ నాన్న మాకిప్పుడు నీ విలువ ఏంటో తెలుస్తుంది. నువ్వు నా వెనక చేసిన త్యాగం కనిపిస్తుంది. 

మాకు ఖరీదైన బట్టలు కొంటూ నువ్వు కేవలం లుంగీ, బనీన్ తో సరిపెట్టుకున్నా చూడలేకపోయాం… కారం తో నువ్వు తింటూ, మా కోసం కూరలు త్యాగం చేయడం చూడలేదు.

కొట్టినా తిట్టినా చదివించిన అది మా భవిష్యత్ కోసమే అని అనుకోలేకపోయాం. అందరికీ సాయం చేస్తుంటే మమల్ని పట్టించుకోలేదు అనుకున్నాం.

నీ మంచితనం విలువ తెలియక, నీ విలువ తెలియక ఎన్నో అనుకున్నాం, ఆస్తులు ఇవ్వక పోయినా సంస్కారం ఇచ్చాను అనే సంతోషం తో నువ్వు వెళ్ళిపోయినా, నీ వల్ల సాయం పొందిన వారే సాయం చేయడానికి వచ్చారు. అదిగో అప్పుడు, అప్పుడు తెలిసింది నాన్న…

నీ మంచితనానికి నిదర్శనం నువ్వు కాలం చేసినప్పుడు వచ్చిన వందల మంది నిన్ను చూడాలని తపించడంతో మాకు అర్దం అయింది నీ విలువ.

నువ్వు చేసింది తప్పు అని మేము అనుకున్నప్పుడు నువ్వు నవ్వే నవ్వు మీరంతా పిచ్చివాళ్లురా అన్నట్టు అనిపించింది. 

నాన్న నువ్వు నన్ను నీతో పాటు స్కూల్ కి తీసుకు వెళ్ళినప్పుడు చెప్పిన మాటలు, మనం కలిసి ప్రయాణం చేసిన చోటు చూస్తుంటే కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి.

ఎదుటి వారికి సాయం చేస్తే కలిగే తృప్తి ఎంతో చెప్పావు. ఎంత చదువుకున్నా ఒదిగి ఉండాలి అని చెప్పావు. చదువుతో పాటు సంస్కారం ముఖ్యం అని నేర్పావు. దెబ్బలు తినిపించి జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకునేలా చేశావు.

సమస్యకు కృంగిపోకుండ ఎదురెళ్ళేలా చేశావు. మాకు ఇన్ని చేసినా, ఏమీ చేయలేదని మేము వేసే నిందలను చిరునవ్వు తో భరించావు. తృప్తిగా వెళ్ళావు.

కానీ నాన్న ఇప్పుడు మీ విలువ మాకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఉంటే ఎంతో బాగుండేది అనుకున్నా, ఒకర్ని అర్దం చేసుకోవడానికి జీవిత కాలం సరిపోదు అన్నట్టుగా, నా కడుపున పుట్టిన మీరు నన్ను అర్దం చేసుకోవడం మీ వల్ల కాదంటూ, నువ్వు రావన్న, లేవన్న నిజాన్ని గొడకున్న మీ ఫోటో తెలియజేస్తుంది. నువ్వు నేర్పిన ఆ విలువలే ఇప్పుడు మమ్మల్ని కాపాడుతున్నాయి నాన్నా…

నాన్న ఇన్ని రోజులూ నీ విలువ తెలియలేదు. ఇప్పుడు తెలిసి ఏమీ చేయలేక పోతున్నాం. అన్ని తెలిసిన మీరు మమల్ని మన్నిస్తారని ఆశిస్తూ…

– మీ కూతురు (భవ్యచారు)

Previous post మనసు మైకం
Next post ప్రేమ లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *