నాన్నకు ప్రేమతో

మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం నేనంటే నాన్నకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు కావడం వల్ల నాన్నకి నేనంటే చాలా ప్రత్యేకత, నాన్న గారు నా ఇష్టాన్ని ఏది కాదు అని అనేవారు కాదు.

కానీ, నాన్న ఒక విషయంలో మాత్రం నా ఇష్టాన్ని కాదని అన్నారు, కాకపోతే నాకు అప్పుడు ఏమీ తెలియదు కాబట్టి నాన్న చెప్పిందే వేదం అని నమ్మాను. కానీ, ఆ తర్వాత తెలిసింది నాలాగే నాన్న కూడా మోసపోయాడు అని అంతా అయ్యాక చేసేదేం ఉంటుంది.

కొన్ని రోజులు బాధ పడిన తర్వాత నాన్న నాకు ధైర్యం చెప్పి నీకు నచ్చినట్టు చదువుకో అన్నారు.

Father and daughter | Free SVG

దాంతో నేను చదువును కంటిన్యూ చేశాను, నాన్నతో పాటూగా బడికి వెళ్ళేదాన్ని. మధ్యాహ్నం ఇద్దరం కలిసి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లే వాళ్ళం. నాన్న నాకు చదువు చెప్పారు. అదే స్కూల్ లో నేను మళ్లీ టీచర్ గా జాబ్ చేశాను అదేనండి విద్యా వాలంటీర్ గా…

కొన్ని రోజులకు మా నాన్నగారికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అందరం అక్కడికి వెళ్ళాము. అక్కడే రూమ్ తీసుకుని ఉన్నాం, ఈ లోపు చాలా మార్పులు జరిగాయి. అనుకోకుండా నాన్నగారు పట్నంలో ఇల్లు తీసుకోవడం జరిగింది. అలా రోజులు గడుస్తూ ఉండగా, వేసవి సెలవులు రావడంతో అందరం కలిసి కొత్త ఇంటికి వెళ్ళాం.

కానీ, అక్కడ ఏ సదుపాయాలు లేవు. ప్యాన్, టీవీ, నీళ్లు లాంటి సదుపాయాలు లేవు. బోర్ వాటర్ వస్తుంది కానీ, బాగుండేవి కావు. ఇక మంచి నీళ్ళు అయితే కొనుక్కోవాలి. వేసవి సెలవులు అయినా నాన్న గారికి స్పాట్ వాల్యువేషన్ అదేనండి ఏడవ, పదవ తరగతి పరీక్ష పేపర్లు దిద్దడానికి గాను డ్యూటీ పడింది. అయితే, నాన్నగారు నేను ఎలాగూ టీచర్ నే కాబట్టి నాకు కూడా ఆ డ్యూటీ వేయించారు.

వేసవి కాలం కాబట్టి ఖాళీగా ఉండకుండా ఆ పని దొరకడం నాకు ఆనందంగా అనిపించింది. అమ్మా, తమ్ముళ్ళు కొత్త ఇంట్లో ఉంటే నేను, నాన్నగారు స్పాట్ కి వెళ్ళడం మొదలు పెట్టాము.

Father Daughter Happy Father'S Day - Free photo on Pixabay

మా డ్యుటీ జ్యోతి విద్యాలయం పఠాన్ చెరువులో కాబట్టి మేము ప్రొద్దున్నే వెళ్లాలి. కాబట్టి నేను అయిదు గంటలకే లేచి, రెడీ అయ్యి వంట చేసుకుని మా ఇద్దరికీ బాక్స్ లు కట్టేదాన్ని, ఇద్దరం బ్యాగ్ లు తీసుకుని, రెండు బస్ లు మారి వెళ్ళేవాళ్ళం.

అక్కడ ప్రొద్దున పదిగంటల నుండి, సాయంత్రం అయిదు గంటల వరకు పేపర్లు దిద్ది సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళము. ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటలు అయ్యేది. అయితే అలా వెళ్తున్న క్రమంలో బస్ లు ఫుల్ గా ఉండేవి. నేను ముందు కూర్చుంటే నాన్న వెనకాల నిల్చునే వారు సీటు దొరకక, ఒక్కొక్కసారి సగం దూరం వచ్చాక సీటు దొరికేది. నాకు సీటు దొరకక పోతే నాన్న గారు తన సీటు ఇచ్చేవారు, తాను నిలబడి ఉండేవారు.

అయితే ఇక్కడ ఒక గమ్మత్తు అయిన విషయం జరిగింది. మామూలుగా ప్రొద్దున వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళం టికెట్స్ తీసుకునే వాళ్ళం, బస్ లో నేను తీసుకున్నా అని అరిచి చెప్పలేము కాబట్టి, ముందే అనుకునే వాళ్ళం. ఒక్కోసారి అది తెలుసుకోకుండానే బస్ ఎక్కితే కండక్టర్ రాగానే నేను నాన్న వైపు చూస్తే తను టికెట్ చూపించేవారు.

అలా ఒక రోజు పని ముగిసిన తర్వాత ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ నడిచి వచ్చాము. మా అదృష్టం కొద్దీ బస్ స్టాండ్ లోకి రాగానే బస్ రావడం కనిపించింది. దాంతో, టికెట్ గురించి ఏమీ మాట్లాడకుండానే బస్ ఎక్కాము. ఆరోజు శనివారం కాబట్టి జనాలు ఎక్కువే ఉన్నారు. బస్ మొత్తం నిండి పోయింది.

ముందు నేను, వెనక నాన్న ఉన్నాము. బస్ బయలుదేరింది ఫుల్ జనాలు సీటులో కూర్చున్నా కూడా మీద, మీద పడుతున్నారు. నాకు ఉక్కగా, చిరాకుగా ఉంది. ఇంతలో కండక్టర్ టికెట్, టికెట్ అంటూ వచ్చి ఆడవాళ్ళ మధ్యలో నుండి చేయి పెట్టీ మొహం మీద వేళ్ళు ఆడించాడు.

Free photo: beach, winter, father, daughter, shadows, sand, cold | Hippopx

నేను బ్యాగ్ తీయ్యలేక నాన్న తీసుకుంటారు కావచ్చు అనుకుని నేను తీసుకోకుండా వెనకాల తీసుకుంటారు అని చెప్పాను. అతను వెళ్ళిపోయాడు కాసేపటికి మా స్టేజ్ రావడంతో మేమిద్దరం దిగిపొయాము. నెక్స్ట్ డే ఆదివారం కాబట్టి బాగా రెస్ట్ తీసుకున్నాం, నాన్న బుక్స్ వచ్చాయి అని తెలిసి ఊరెళ్ళారు. సోమవారం నన్ను రమ్మని తాను ఊరి నుండి డైరెక్ట్ గా డ్యూటీ ప్లేస్ కి వచ్చారు.

ఆ రోజు హడావుడిగా గడిచింది. రాత్రి వస్తుండగా మళ్లీ బస్ ఫుల్ అవ్తోవడం నాన్న టికెట్ తీసుకోవచ్చు అని వెనకాల తీసుకున్నారు అని చెప్పాను. అలా మూడు రోజులు గడిచిపోయాయి, ఈ మూడు రోజులు కూడా బస్ అంతా ఫుల్ గా ఉంది. దాంతో, నాన్న తీసుకుంటారని నేను అనుకున్నాను. మూడో రోజు చివరి రోజు కాబట్టి మాకు పేమెంట్ వచ్చింది. సంతోషంలో తిరిగి ఇంటికి చేరుకున్నాం.

నాన్నగారిది, నాది పేమెంట్ ఒక దగ్గర పెట్టి బస్సు కిరాయిలు ఎంత అయ్యాయి, ఎంత మిగిలింది  అని లెక్కలు వేస్తూ ఉండగా నాన్నను ఈ మూడు రోజుల టిక్కెట్లు ఇవ్వమని అడిగాను. అప్పుడు మా నాన్నగారు, అదేంటి నువ్వు తీసుకోలేదా నీ దగ్గరే ఉండాలి కదా అని అన్నారు. నేను ఆశ్చర్యపోతూ, అయ్యో మీరు తీసుకున్నారని అని నేను అనుకున్నాను. నేను తీసుకోలేదు అని చెప్పాను.

Father Daughter Silhouette Holding - Free vector graphic on Pixabay

అయ్యో అవునా, నువ్వు తీసుకున్నావేమో అని నేను అనుకున్నాను అని నాన్న గారు నాతో అన్నారు. అంటే ఇద్దరం నాన్న తీసుకుంటారని నేను, నేను తీసుకుంటానని నాన్నగారు ఇలా అనుకుని ఎవ్వరం టికెట్లు తీసుకోలేదు అన్నమాట… అమ్మో ఇంకా నయం మధ్యలో చెకింగ్ వాళ్ళు రాలేదు చెకింగ్ చేయడానికి అని అనుకున్నాం.

అంటే మేము బస్సులో టికెట్ తీసుకోకుండానే ప్రయాణం చేసాము అన్నమాట… విషయం తెలిసిన అమ్మా, తమ్ముళ్ళు నవ్వుతూ ఉంటే మేమిద్దరం కూడా ఆ నవ్వులో భాగం పంచుకున్నాం . ఏదో లేండి దగ్గర, దగ్గర పోవడానికి ఎనభై , రావడానికి ఎనభై  రూపాయలు అంటే  రోజులకు అయిదు వందలు మిగిలాయి అన్నమాట.

మోసం కావాలని చెయ్యలేదు అనుకోకుండా జరిగింది. దానికి ఏమీ చెయ్యలేము. ఇప్పుడు నాన్న గారు లేకున్నా, ఆ అనుభవాలు, అనుభూతులు తల్చుకుంటూ గడుపుతున్నాము… అసలు మర్చిపోయింది ఎక్కడని ఇప్పటికీ తాను పెట్టిన బిక్ష తింటూ బ్రతుకుతున్నా…

నాన్న నా కోసం ఎంతో చేశారు. కానీ, నాన్న కోసం నేనేమీ చెయ్యలేక పోయాను. తల్చుకుంటే ఏడుపు వస్తుంది. కానీ, ఏడిస్తే నాన్న తిరిగి రారుగా… అందుకే ఈ సందర్భంగా,

నాన్నా నీకు శతకోటి వందనాలు…

-భవ్యచారు

Related Posts

3 Comments

  1. బాగుంది సిస్టర్

Comments are closed.