నీ కౌగిలి లో…

నీ కౌగిలి లో…

తను నన్ను చూస్తున్నాడని  నాకు తెలుసు. కానీ తెలియనట్టు నటిస్తున్నా, అసలు గమనించనట్టు ఉన్నా, కానీ అదేంటో మనల్ని ఎవరైనా చూస్తే ఆ చూపులు వీపు కు గుచ్చుకుంటాయి.

మనసైన వారు ఎక్కడ ఉన్నా అలా తెలిసిపోతుంది. అందుకే తనను తప్పించుకుంటూ తిరుగుతున్నా లేదంటే ఊరుకుంటాడా అసలే చిలిపి. ఆపై అతని ఆశలకు, కోరికలకు హద్దే లేదు.

ఇంతలో ఫోన్ లో మెసేజ్ టోన్ ఏంటా అని చూస్తే ఇంకెవరు తానే ఎంటా అని చదివి, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు కదా నీ పని చెప్తా, అందరి ముందు నిన్ను కౌగిలించుకోకపోతే నా పేరు వేరే గా పెట్టేసుకుంటా అని.

అమ్మో ఏంటి అంత ధైర్యం అనుకున్నా, ఛా నిజమా అన్నాను. హా నిజమే అంటూ రిప్లై సర్లే చూద్దాం అన్నాను. హా మరి నన్ను పట్టించుకోకుండా వెళ్తవా అన్నాడు.

ఏంటి నాకదే పని అనుకున్నావా అన్నాను. నా పని మాత్రం ఇదే అన్నారు. సరే చూద్దాం అన్నాను. బెట్ కడతవా అన్నారు. అబ్బా ఛా నువ్వు అన్నది చేస్తే, చూద్దాం లే అన్నాను.

సరే ఇక కాసుకో అన్నారు. ఫోన్ సైలెంట్ లో పెట్టిసి పనుల్లో పడ్డాను. కానీ మనసులో ఏదో భయం అనవసరంగా రెచ్చగొట్టానా అని. అంతలోనే ఆ.. చూద్దాంలే ఇంత మంది లో అలా చేయరు.

అయినా ఎలా చేస్తారు. అసలే పెళ్లి మండపం కిట కిట లాడుతుంది. ఇందరి ముందు సిగ్గులేకుండా అలా ఎలా చేస్తార్లే అనే ఒక ధీమా తో పెళ్ళి హడావుడి లో పడిపోయాను.

పిన్ని కూతురు పెళ్లి తను నాకంటే ఒకే నెల చిన్నది. పిన్ని కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మేమే అన్ని విషయాలు చూస్తున్నాం.

అందుకే ఇంత హడావుడి గా తిరుగుతున్నా, నా కళ్ళు మాత్రం అతని కోసం వెతుకుతున్నాయి. కానీ తాను ఎక్కడా కనపడడం లేదు. హా మర్చిపోయి ఉంటార్లే అనుకుని, హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను.

సరిగ్గా తాళి కట్టే వేళ వేద పండితులు మంత్రాలు శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. అందరూ చేతుల్లో అక్షతలు పట్టుకుని ఉన్నారు. అందరి కళ్ళు వేదిక పై ఉన్న వధూవరుల పైన ఉన్నాయి.

సరిగ్గా ఆ సమయంలోనే సడెన్ గా కరెంటు పోయింది. అందరూ హడావుడి గా జనరేటర్ కోసం పరుగులు తీస్తున్నారు.

సరిగ్గా అప్పుడే నన్నెవరో గట్టిగా కౌగలించుకున్నారు. నాకు ఊపిరి ఆడడం లేదు. అతని కౌగిలి వెచ్చగా ఉంది. నా మనసు వశం తప్పుతోంది. అతని ఊపిరి నాకు తగులుతుంది.

వశం తప్పుతున్న నా మనసును అదుపులో పెట్టుకుంటూ అనుకున్నది సాధించారు గానీ జరగండి ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అంటూ చటుక్కున పక్కకు తోసేసాను.

మరీ నాతోనే పందేమా వారం రోజుల నుండీ నన్ను పస్తు పెట్టినందుకు ఇలా అందరి ముందు చేయాలి కానీ పాపం సిగ్గు పడతావు అని ఇలా కరెంటు తీసేసాను అంటూ జేబులోంచి ప్యుజు తీసి నా చేతిలో పెడుతుండగానే జనరేటర్ అన్ అయ్యి, లైట్స్ వెలిగాయి.

వేదిక పైన, కింద కూర్చున్న వారంతా నా వైపే వింతగా చూడడం గమనించి నేను నా చేతిలోనే ఉన్న ప్యూజు, నా పక్కనే ఉన్న మా వారిని చూస్తూ ముసి ముసి గా నవ్వుతున్నారు. సిగ్గుతో నా తల కిందికి వాలింది.

– భవ్యచారు

Related Posts