నేనూ నా కాశీ యాత్ర

నేనూ నా కాశీ యాత్ర

2019 అక్టోబర్ నెల నా పుట్టిన రోజున మావారు ఒక కొత్త ప్రతిపాదన తెచ్చారు. అదేంటంటే కాశీకి వెళ్దాం అని ఆయన అలా అనగానే నాకు వింత గానూ, కొత్తగా అనిపించింది.

ఎందుకంటే ఎవరైనా వయసు అయ్యాక  కాశీ ని చూడాలని, అక్కడ మోక్షం పొందాలని అనుకుంటారు.

ఈయనేంటి ఇలా అంటున్నారు అనే ఆశ్చర్యం తో పాటూ, ఎప్పుడూ పూజలు అంటూ విరామం లేకుండా తిరిగే ఇయన గుడి, పూజలు వదిలేసి వెళ్ళాలనుకోవడం వింతగా అనిపించింది.

మా వారి తో, ఇప్పుడేం కాశి యాత్ర అండి, దానికి ఇంకా చాలా సమయం ఉంది. మెల్లిగా వెళ్లొచ్చు, అసలే పిల్లలకు పరీక్షలు ఉన్నాయి.. ఇప్పుడు ఈ చలికాలంలో అంతదూరం వెళ్లడం అవసరమా అంటూ ఆయన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేశాను.

ఎందుకంటే అప్పటికే మేము గానుగాపూర్, శ్రీశైలం, తిరుపతి, మంత్రాలయం, వంటి యాత్రలకు ఎన్నో సార్లు వెళ్లివచ్చాం. ఇంకొకటి ఏంటంటే ఈ యాత్రల వల్ల డబ్బులు ఖర్చు. దేవుడి దగ్గరకు వెళ్ళడానికి డబ్బు చూసుకుంటారా అనకండి.

పిల్లల ఫీజులు, బట్టలకు, ఎంతో ఖర్చు అవుతుంది. వెనక ఏమీ ఆస్తులు లేవు. పూజలు వస్తేనే ఆదాయం కాబట్టి కాస్త భయపడ్డాను. ఆయన ఎక్కడికైనా వెళ్తే వెనకా ముందు చూడకుండా ఖర్చు చేస్తారు. పిల్లలు ఏది అడిగినా వెంటనే కొంటారు. భోజనానికి అసలు వెనకాడరు.

ఖర్చు చేసి అయినా మంచి భోజనం తినాలని అనుకుంటారు. ఇంట్లో చేసుకుని వెళ్దాం అంటే వినరు. నీకెందుకు నేను చూసుకుంటాను కదా అంటూ అప్పు చేసి మరీ తీసుకుని వెళ్తారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్దాం అనడం ఆలస్యం వెంటనే రెడీ అయిపోతారు.

ఖర్చు అంతా ఆయనదే అందుకే వెనక్కి లాగాలని ఎంతో చూసాను. కానీ అయన పట్టు ఆయనదే అసలు వినరే. ఛట్ వెళ్లాల్సిందే అంటూ పట్టుబట్టారు.

మరి అప్పుడేం జరిగిందో, మేము కాశీ కి వెళ్ళమో? లేదో? మళ్లీ చెప్తాను అండి. బాయ్….

– అర్చన

Related Posts