నేటిభారతం

నేటిభారతం

“ఏవండోయ్ శ్రీవారు, మీ ఫోన్ ఆగకుండా మోగుతుంది” అంటూ డిస్ప్లే మీది నెంబర్ చూసి, తెచ్చి భర్త పక్కనే ఉన్న బల్ల మీద ఉంచింది గీత. “అబ్బా.. గీతా..! ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరో చూడు” అంటూ ఒంటిమీద ఉన్న దుప్పటిని ఇంకాస్త పైకి జరుపుకుని మొహం వరకూ కప్పుకొని పడుకున్నాడు గోవింద్. “అయ్యో.. నా కెందుకొచ్చిన గొడవ, లేచిన తరువాత మీరే మాట్లాడండి” అంటూ వడివడిగా వంటగదిలోకి అడుగులు వేసింది. అప్పటికే ఫోన్ మోతకి నిద్ర చెడడంతో ‘ఛీ..! ఎవడ్రా వీడు, ఆదివారం కూడా ప్రశాంతంగా పడుకోనివ్వకుండా!’ అనుకొంటూ కప్పుకున్న దుప్పటి తొలగించి కళ్ళు నలుపుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి  “హలో ఎవరు?” అన్నాడు.

“హలో బావా! నేను వర్ధన్ ని ఫోన్ అక్కకి ఇస్తారా, అమ్మ ఏదో మాట్లాడాలట” అన్నాడు గీత తమ్ముడు. ఆ మాట విన్న గోవింద్ కళ్ళునలుపుకొని ఫోన్ వైపు చూసి “గీతా గీతా ! మీ అమ్మ నీతో ఏదో  మాట్లాడాలంట అదేంటో చూడు” అంటూ ఫోన్ గీత చేతిలో పెట్టి బాత్రూం లోకి వెళ్ళాడు. “అవునూ!! ఇందాక ఫోన్ చేసింది మీ తమ్ముడు అని నీకు తెలుసుకదా..! అయినా ఎందుకు లిఫ్టు చేయలేదు?”  బాత్రూంలో నుండి బయట వస్తూ అడిగాడు గోవింద్, ఏదో గుర్తొచ్చిన వాడిలా. “అలాగైనా నిద్ర లేస్తారేమో అని..!” అంది గీత వస్తున్న నవ్వుని ఆపుకుంటూ…”అంటే! ఇదంతా కావాలనే చేశావన్న మాట, ఉండు నీ పని చెప్తాను” అంటూ మెడమీద ఉన్న టవల్ తో భార్య నడుముని చుట్టి వెనక్కి లాగి తన కౌగిలిలో బంధించాడు.

“మరి.. గంటనుంచి నా గొంతు పోయేలా అరుస్తున్నా వినిపించుకోకుండా నిద్ర పోతున్నారుగా, అందుకే అలా అయినా లేస్తారేమో అని” అంది చిలిపిగా నవ్వుతూ. “నీకెందుకు, నేనంటే అంత కక్ష? ఆదివారం కూడా ఉదయమే లేచి ఏమి చేయాలి?” అడిగాడు భార్య కళ్ళలోకి సూటిగా చూస్తూ. “ఏమి చేయాలా!? ఈరోజు మన పాపకి గుడిలో అక్షరాభ్యాసం కదా మరచిపోయారా?” అంది భర్త చేతులని విడిపించుకుంటూ. “అవును కదూ! ఆ విషయమే మరచిపోయాను, అయితే ఇప్పుడే తయారయ్యి వస్తాను, ఆలోగా నువ్వు, పిల్లలు కూడా తయారుకండి” అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు.

గోవింద్ తయారయ్యేలోగా గీత పిల్లళ్ళిద్దర్నీ తయారుచేసి తను కూడా తయారయ్యి సిద్ధంగా ఉంది. గోవింద్ క్యాబ్ బుక్ చేసాడు. అందరూ గుడికి చేరుకున్నారు. కార్ దిగి అందరూ లోపలికి నడిచారు. వీళ్ళు వెళ్ళేసరికి గుడిలో పూజారిగారు పూజా సమగ్రితో సిద్ధంగా ఉండడంతో ఆలస్యం చేయకుండా వెంటనే అక్షరాభ్యాస కార్యక్రమం జరిపించారు. అనంతరం గుడి ఆవరణలోని మెట్ల దగ్గర కూర్చొని ప్రసాదం తింటుండగా పిల్లలు ఇద్దరూ అక్కడే మెట్లకి ఒక పక్కగా ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటూ ఉన్నారు.

“అఖిరా జాగర్త అమ్మా..! అన్నయ్య దగ్గరే ఉండు, ఎక్కడికీ వెళ్ళకు” అని అఖిరాకి జాగ్రత్తలు చెప్తుంది గీత. ఆకాష్ కొంత దూరం పరిగెత్తి వెనక్కి తిరిగి తన రెండు చేతులు ముందుకు చాచి “అఖిరా నేనిక్కడున్నాను, రా..! వచ్చి నన్ను పట్టుకో” అంటూ చెల్లిని పిలుస్తున్నాడు. అన్నయ్య పిలుపుతో నవ్వుకుంటూ ఆ వైపుగా పరుగు తీసింది అఖిరా. అఖిరా అలా పరిగెత్తే కొద్దీ ఇంకాస్త దూరంగా వెళ్తున్నాడు ఆకాష్. అలా ..అలా గుడి వెనుక భాగానికి వెళ్ళిపోయారు ఇద్దరూ. కనుచూపుమేరలో ఉంటూ పిల్లళ్ళిద్దర్నీ గమనిస్తున్న గీత కూడా అటుగా పరుగుతీసింది.

అలా గుడి వెనకవైపుకి వెళ్ళిన గీతకి అక్కడ కనపడిన దృశ్యంతో కళ్ళు బైర్లుకమ్మాయి. అక్కడ కూర్చొని ఉన్న ఒకతను గీత రాకను గమనించి పక్కనే ఉన్న పాపని ఒడిలో కూర్చోబెట్టుకొని సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అతనిని చూస్తున్న గీతకి ఏదో అనుమానం కలిగింది. ‘ఇంత పెద్ద గుడి ఆవరణ వదిలేసి, ఇలా వెనక్కి వచ్చి, చాటుగా ఫోటోలు తీసుకోవడం ఏంటి..! అందులోనూ నన్ను చూసి ఎందుకు భయపడ్డాడు?’ అనుకొంటూ మరికొంత ముందుకు నడిచి, ఉన్నట్లుండి వెనక్కి చూసింది. గీతని చూసికూడా చూడనట్లు నటిస్తూ తన జేబులోని చాక్లెట్ ఆ పాప చేతికి అందించాడు. ఆ పాప “థాంక్యూ అంకుల్” అంది నవ్వుతూ.

‘థాంక్యూ అంకులా? అంటే ఆపాప అతని పాప కాదన్నమాట’ అని నిర్ధారించుకొన్న గీత తనకి కలిగిన అనుమానం మరికాస్త బలపడడంతో, వెంటనే భర్త దగ్గరకి వెళ్ళి “నేను ఇందాక గుడి చుట్టూ ప్రదక్షణలు చేయడం మరిచాను. పిల్లల్ని చూసుకోండి నేను వెళ్ళి చేసుకొని వస్తాను” అని పిల్లల్ని గోవిందుకి అప్పగించి మెల్లిగా అడుగులు వేసుకుంటూ గుడి వెనకవైపుకి చేరింది. ఆ క్షణం అక్కడ చూసిన దృశ్యం గీతలో క్రోధాగ్నిని రగిల్చింది. గీత రాకను పసికట్టిన ఆ కుర్రాడు వెంటనే తన ఒడిలో కూర్చొని ఉన్న పాపని కిందకి దించి మెల్లిగా అక్కడి నుండి తప్పించుకొనే ప్రయత్నం చేసాడు.

అది గమనించిన గీత, కట్టలు తెంచుకున్న ఆవేశంతో పరుగు పరుగున వెళ్ళి ఆ యువకుడి చొక్కా పట్టుకొని వెనక్కిలాగి చెంప పగలకొట్టింది. “నువ్వసలు మనిషివేనా? ఏంటి నువ్వు చేసిన పని..? అసలు ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు ఆ పాపని?” అని కోపంతో రగిలిపోయింది.

గీత చేతిలో నుండి చొక్కా విడిపించుకొని పారిపోతుండగా, “పట్టుకోండీ…. పట్టుకోండీ” అని అరుస్తూ వెనకే పరుగుతీసింది గీత. గీత గొంతు విన్న గోవింద్ ఆ వ్యక్తిని ఆపి గట్టిగా పట్టుకున్నాడు. “ముందు పోలీసులకి ఫోన్ చేయండి” అంది గీత. కోపంగా అతని వైపు చూస్తూ. “అసలు ఏమైంది గీతా? ఏం చేశాడు వీడు? ముందు అది చెప్పు?” అడిగాడు గోవింద్. అప్పటికే ఆ గుడిలోని అందరూ అక్కడికి చేరిపోయారు. “వీడు ఈ నీచుడు అసలు ఏమి చేసాడో తెలుసా?” అంటూ కసిగా వాడిని కొట్టడానికి ముందుకు వచ్చింది గీత. “గీతా! ఒక్క నిముషం నీ ఆవేశం తగ్గించుకొని అసలు విషయం చెప్పు” అన్నాడు గోవింద్, చేతిలోని ఆ యువకుడిని పారిపోకుండా గట్టిగా పట్టుకొని.

నేటి భారతం
నేటి భారతం

“వీడు, ఆ పాపని….” అంటూ చెప్పలేక ఒక్క నిముషం ఆగి గట్టిగా కళ్ళు మూసుకొని “ఈ మానవ మృగం పశువుగా మారి చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ పాపకి చాక్లెట్ ఆశ చూపించి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆపాప శరీరం పై ఎక్కడెక్కడో తాకుతూ రాక్షసానందాన్ని పొందుతున్నాడు. అంతే కాకుండా ఆ పాప ని కూడా ఛీ, నీచుడా నువ్వు చేసిన ఘోరం చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు రా” అంటూ కన్నీరు పెట్టుకుంది. “ఇలాంటి నీచులని వదిలిపెట్టకూడదు అండీ, వీడికి తగిన శాస్తి జరగాలి” అంటూ గుంపులో నుండి అరిచింది ఒక మహిళ.

“అసలు ఎవడు రా నువ్వు? ఈ పాప ఎక్కడ దొరికింది నీకు? చెప్పు రా, చెప్పు” అంటూ గోవింద్ వాడిని కొట్టడం మొదలుపెట్టాడు. “ఆ పాప మా యజమాని కూతురు? అండి” అని సమాధానమిచ్చాడు వాడు. “మరి నువ్వెవరు?” అడిగాడు గోవింద్. “నేను వాళ్ళ కార్ డ్రైవరుని” అని సమాధానమిచ్చారు. ” డ్రైవరువి అయితే పాపతో నీకేం పని? అయినా పాపని నీతో ఒంటరిగా గుడికి ఎందుకు పంపారు?” అడిగాడు గోవింద్.

“పాప ని రోజూ నేనే స్కూల్ కి తీసుకెళ్ళి తీసుకొస్తుంటాను” అంటూ వివరించాడు. ఆ మాట విన్న గోవింద్ “వాళ్ళు స్కూల్ కి తీసుకెళ్ళమంటే నువ్వు గుడికి ఎందుకు తీసుకొచ్చావు? గుడిలో ఏం పని రా నీకు?” అంటూ వాడి చొక్కా పట్టుకొని చెంప పగలకొట్టాడు. అన్యం పుణ్యం ఎరుగని ఆ చిన్నారి పాప గోవిందుకి అడ్డుపడి “ఎందుకు మా అంకుల్ని కొడుతున్నారు?” అంటూ గోవింద్ వైపు కోపంగా చూస్తూ ఆ డ్రైవర్ దగ్గరకి వెళ్ళి నించుంది. ఆ పాప మాటలు విన్న గీత మనసు దుఃఖంతో నిండిపోయింది. మంచి – చెడు తేడా తెలియని ఆ పాప అమాయకత్వాన్ని చూసి అక్కడి వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి.

వాడి దగ్గర ఓనర్ నెంబర్ తీసుకొని వెంటనే కాల్ చేసి జరిగిన విషయం వివరించారు. అలాగే పోలీస్ లకు కూడా విషయం తెలియజేసాడు గోవింద్. అక్కడ గుడి ఆవరణలో నిలబడి చూస్తున్న వాళ్ళందరూ  అతడిని కొట్టడం మొదలుపెట్టారు. “ఒరేయ్ వెదవళ్ళారా, పసికందులని కూడా వదలట్లేదు కదరా పాపాత్ముల్లారా, మీ లాంటి రాక్షసుల బారి నుండి కాపాడడానికి ఎక్కడని దాచిపెట్టుకోవాలి రా ఆడపిల్లల్ని” అంటూ ఒకరు. “ఇంకా ఎంతకాలం ఆడవారి మీద ఈ అకృత్యాలు” అంటూ ఇంకొకరు. ఆడది కనపడితే చాలు అనుభవించాలి అనుకొనే ఇలాంటి కామాంధులని బ్రతకనివ్వకూడదు” అంటూ మరో తల్లి. “పవిత్ర మైన దేవాలయాలని కూడా వదలట్లేదు కదరా నీచుడా” అని మరొక ఇల్లాలు. “ఇటువంటివి అన్నీ చూస్తుంటే ఆడపిల్లల్ని కనాలంటేనే భయంగా ఉంది” అంటూ ఒక గర్భవతి తన పొట్టమీద చెయ్యి వేసి నిమురుతూ కన్నీళ్ళు పెట్టుకుంది.

ఆ పాప మాత్రం ఏమీ ఎరుగనట్లు చాక్లెట్ తింటూ అక్కడ జరిగేదంతా వింతగా చూస్తూ ఉంది. ఇంతలో వాళ్ళ అమ్మ, నాన్న, పోలీసులు అందరూ అక్కడికి చేరుకున్నారు. కార్ దిగి వడివడిగా నడుచుకుంటూ వచ్చిన తల్లి పాపని సమీపించి చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొని కన్నీరుపెట్టుకుంది. రెండు క్షణాల తరువాత మహిషాసురుడిని సంహరించిన కాళికా దేవిలా మారి కసితీరా ఆ నీచుడి రెండు చెంపలు వాయించింది, చివరకు ఏడుస్తూ “ఎంత పని చేశావురా ద్రోహి” అంటూ నేలకు ఒరిగింది.

పాప వాళ్ళ తండ్రి వాడి వైపు అసహ్యంగా చూస్తూ” సర్ ఇలాంటి వాడు బయట ఉండటం ఎంతో ప్రమాదం, వీడిని వెంటనే తీసుకెళ్ళండి ఇక్కడి నుండి” అంటూ వాడి మెడ పట్టుకొని పోలీసులకి అప్పగించాడు. పోలీస్ లు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. “ఇకనైనా పాపని ఒంటరిగా ఎవరితో బయటకి పంపకండి.” అంటూ ఆ తల్లికి హితబోధ చేసి, ఓదార్చి, ఇంటికి చేరారు గీతా గోవిందులు.

నిద్ర పోతున్న గీతకి గుడిలో చూసిన సంఘటన పదే పదే పీడకలలా వేధించడంతో, నిద్రపట్టక లేచి కూర్చుంది. పక్కనే ఆదమరచి నిద్రిస్తున్న తన 3 సంవత్సరాల పాప అఖిరాని చూస్తూ భయంతో  కన్నీరు కార్చింది. ‘ఆడపిల్ల పుట్టింది అంటేనే చంపేసే కాలం నుండి ఆడపిల్ల అంతరిక్షంలోకి వెళ్ళే స్థాయికి ఆడది ఎదుగుతున్నందుకు ఆనందించాలో లేక స్త్రీ ని గౌరవించే రోజుల నుండి పసికందు అని కూడా చూడకుండా కనపడిన ఆడపిల్లనల్లా కామదృష్టితో చూసే మృగాలు పెరిపోయినందుకు బాధపడాలో అర్ధంకావట్లేదు. ఇలా అయితే ఆడపిల్లని కనడానికి, ఆడపిల్లే భయపడేపరిస్థితి వస్తుంది.’ అంటూ వస్తున్న కన్నీరు తుడుచుకుని ‘అందుకే, అందుకే, అటువంటి పరిస్థితి రాకముందే, నా పాప జీవితం అలాంటి వాళ్ళ చేతిలో పడక ముందే, అంటే, ఇప్పుడే, ఈ క్షణం నుండే, నా కూతురి పట్ల తగిన జాగర్త తీసుకుంటాను, తనకి ఇటువంటి వాటి గురించి తగిన అవగాహన కల్పిస్తాను. ఎప్పుడూ ఎటువంటి పరిస్థితులనైనా ఎదిరించే ఆత్మస్థైర్యాన్ని నింపుతాను’ అని నిర్ణయించుకుంది.

– గౌతమి.సి.హెచ్

Related Posts