నిన్ను చేరని నిశీధి.!

నిన్ను చేరని నిశీధి.!

వీధి చివరన… ఓ మూలన ముడుచుకుని కూర్చున్న ముదుసలి, రాత్రిలో గత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా గడిచిన తన బాల్య స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. జీవన సమరంలో తానోడినా నిలబడ్డ తీరును తలుచుకుంటున్నాడు.

కన్నవారి కలల పంటగా పుట్టి కలత లెరుగక ఎదిగి.. ఓ పడతిని మనువాడి.. బిడ్డలకు తండ్రిగా మారి.. వారి ఉన్నతికి పరిశ్రమిస్తూ ఉన్నదంతా ఖర్చు చేసినా.. రెక్కలొచ్చిన బిడ్డలు ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు. ఆ వృద్ధ తండ్రిని భారమంటూ నడి వీధిలో వదిలేశారు..

చావలేక, చావురాక వీధి చివరన గుప్పెడు మెతుకుల కోసం దేహీ అని పరుల ముందు చేయి చాచాల్సిన దుస్థితిని మరిచిపోయి ప్రశాంతంగా కూర్చున్నాడతడు. తనలాంటి వారెందరో తనతో ఉన్నారన్న ధైర్యమే తోడుగా..

అవును‌, సంస్కృతికి నిలయమైన.. సంప్రదాయాల సంగమమైన మన ఈ సమాజంలో సంపదకు కొదవలేకున్నా.. నేటికీ గూడులేక, నిలువ నీడ లేక.. నడి రోడ్డును అంపశయ్యగా మలుచుకుని నిదురిస్తున్నారెందరో అతనితోనే..

బతుకు తెరువు కోసం ఉన్న ఊరిని, అయినవారిని వదిలి సుదూరం నుంచి వలస వచ్చిన వారు.. ఏ క్షణాన పని దొరుకుతుందోనని ఆశగా ఎదురు చూసేవారు.. ఏ ఊరూ వెళ్లలేక, ఉన్న ఊరు వదలలేక అయిన వారు గెంటేస్తే అనాధలైన వారెందరో ఉన్నారతనితోనే.

చలిని ధిక్కరిస్తూ, దోమలు, విష కీటకాలతో సావాసం చేస్తూ.. చాలీచాలని చిరుగుల దుప్పటి కప్పుకుని మూసి ఉన్న దుకాణాల ముందు, నడిరోడ్డు డివైడర్లు, ఫుట్ పాత్ లపైన నిద్ర కోసం ఎదురుచూస్తూ ప్రతినిత్యం బతుకు సమరం చేస్తున్నారతనితోనే..

దుకాణాలు మూసేసరికి.. వాహనాలు ఇంటికి చేరి రణగొణ ధ్వనులు తగ్గేసరికి.. ధర్మాత్ములెవరైనా దుప్పటి సాయం చేస్తారేమోనని, పుణ్యాత్ములెవరైనా ఆ పూటైనా తిండి పెడతారేమోనని కలలు కంటూ హాయిలేని నిద్రకోసం పడిగాపులు కాస్తున్నారతనితోనే..

మేముండగా.. ఈ నిశీధిలో అలుముకున్న కష్టాల చీకటి ఎన్నటికీ నిను చేరదనే నమ్మకాన్ని ఆ ముదుసలికిస్తూ.!

– ది పెన్

Related Posts