నిర్ణయం

నిర్ణయం

ఏ బట్టలు కొనాలా? ఏ రిసార్ట్ కి వెళ్ళాలా? ఏ బ్రాండ్ మందు ఆర్డర్ చేయాలా? ఎలాంటి ఫుడ్డు తినాలా? ఎక్కడైతే బాగుంటుంది? గంజాయి కొట్టాలా? పబ్బుకి వెళ్లాలా లేదా ఇంట్లోనే బిర్యానీలు వండుకొని మందు ముందు పెట్టుకుని తాగుతూ పాటలు పెట్టుకుని డాన్స్ చేయాలా? అని ఆలోచిస్తూ రోడ్లమీద తిరుగుతూ కొత్త సంవత్సరం కోసం రకరకాల బట్టలు, మందు కొంటూ కొత్త సంవత్సరాన్ని బాగా ఎంజాయ్ చేయాలని పాత సంవత్సరానికి వీడుకోలు పలకాలనే ఉద్దేశంతో రోడ్లన్నీ కిటకిట లాడుతూ ఉన్నాయి.

బట్టల దుకాణాలు బంగారం దుకాణాలు హోటల్లు, రిసార్ట్స్, పబ్బులు అన్నీ ముందే రిజర్వ్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు జనాలు. ఎంతమంది జనాలు వస్తే అంత లాభం అనుకుంటూ షాపుల వాళ్ళు రండి రండి అంటూ ఆఫర్స్ మీద ఆఫర్స్ పెడుతూ ఉన్నారు. అసలు ఇప్పటికే తాగే వాళ్ళు తాగుతున్నారు ఊగే వాళ్ళు ఊగుతున్నారు తినేవాళ్లు తింటూ ఉన్నారు ఎక్కడ చూసినా హైదరాబాద్ అంతా జనంతో కిటకిటలాడిపోతూ నిండిపోయింది ట్రాఫిక్ జాములు చాలా ఎక్కువ అయ్యాయి మందు షాప్ ముందు లైన్లు కట్టారు కాటన్లుగా ఎత్తుకుపోతున్నారు.

ఇంకాస్త బాడా బాబుల బిల్లలైతే మార్కెట్లోకి ఏ కొత్త డ్రగ్ వచ్చిందా? ఎలాంటి కొత్త గంజాయి రకాలు వచ్చాయా ఎలాంటి కొత్త మందు వచ్చిందా అని ప్లాన్ చేసుకుంటూ కనుక్కుంటూ అది తెప్పించుకుంటూ లేదా ఇవన్నీ తీసుకుని ఏ గోవాకు లేదంటే ఇంకా ఏదైనా రిసార్ట్స్ కు వెళ్లాలని ఫోన్ల మీద ఫోన్లు చేసుకుంటూ హడావిడి పడుతూ ఉన్నారు. మరికొందరు కొత్త సంవత్సరం గుడికి వెళ్తే మంచి జరుగుతుంది దర్శనం చేసుకుంటే దేవుడు అంతా మంచే చేస్తాడు అని నమ్ముతూ గుడిలకు ప్రయాణం అవుతూ ఉన్నారు.

ఇదంతా ఒకవైపు…

ఇదే హైదరాబాదులో మరొకచోట ఒక చిన్న కాలనీలో ఖాళీ సీసాలు, పేపర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, తాగి పడేసిన వాటర్ డబ్బాలు ఏరుకుంటూ నాకంటే నాకు ముందు దొరికిందని గొడవ పడుతూ కొత్త సంవత్సరమైనా పాత సంవత్సరమైనా సంవత్సరాలు గడుస్తున్నా రోజులు మారుతున్నా తమ తలరాతలు మారని చిన్నారి చేతులు గాజు పెంకులు గుచ్చుకుపోతున్నా ఆ పూటకి అవి దొరికితే చాలని అవి అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక్క పూట అయినా కడుపు నిండుగా తినాలని ఆలోచిస్తూ ఒకరినొకరు తోసుకుంటూ వాటిని వెతుకుతూ సంచిలో వేసుకుంటున్నారు.

ఒక్కసారి ఆలోచించండి మీరు ఒక్కరోజు ఖర్చు చేసే డబ్బు ఇలాంటి పేద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక నెల రోజులైనా కడుపు నిండా అన్నం తింటారు కదా, ఒక ఫుల్ బాటిల్ మందుతో మీకు మత్తెక్కవచ్చు కానీ అదే ఫుల్ బాటిల్ ఖరీదు చేసే డబ్బుతో వాళ్లకి కొత్త బట్టలు వస్తాయి. మీరు తాగే, పీల్చే గంజాయి కానీ డ్రగ్స్ కానీ వాటికి ఖర్చు పెట్టే డబ్బును ఏ ఒక్కరైనా ఇలాంటి వారికి దానం చేస్తే వాళ్లు నెల రోజులు కష్టపడకుండా కడుపునిండా అన్నం తినచ్చేమో ఇలా ఎవరైనా ఆలోచిస్తారా?

ఎవరు ఆలోచించరు నిజానికి నేను కూడా ఆలోచించను ఎందుకంటే నా సంతోషం నేనే చూసుకుంటాను తప్ప పక్కోడి గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకునే అవకాశం, సమయం ఓపిక ఎవరికీ లేవు. వాళ్లు అలాగే పుట్టారు అలాగే బ్రతకాలి అలాగే ఉండాలి అలాగే చావాలి అని కొందరు అంటారు.

మేము ఇలాగే పుట్టాం ఇలాగే బ్రతుకుతాం ఇలాగే సంతోషంగా జీవిస్తాం తాగేంత తాగుతాం తినేంత తింటా పారేసే అంత పారేస్తాం అంటూ తమ స్వార్థమే చూసుకుంటున్నారు తప్ప నిజంగా ఈ కొత్త సంవత్సరం రోజు ఒక పేదవారికి సహాయం చేసి చూడండి ఎంత ఆనందం కలుగుతుందో అది మాటల్లో వర్ణించలేం.

నువ్వు ఈ మాటలు చెప్తున్నావు మరి నువ్వు పాటిస్తావా అని నన్ను అనొచ్చు నేను అంత ఉన్నదాన్ని కాదు ఉన్నంతలో ఎవరికైనా చిన్న సాయం అయినా చేయగలను ఒక రూపాయి దానము ఓ ఇరవై రూపాయలు పెట్టి టిఫిన్ ఇప్పించగలరు అంతే తప్ప వాళ్ళ జీవితాలను బాగు చేయలేను కానీ వాళ్ళ జీవితాలను బాగు చేయాలనే ఆలోచన మాత్రం రావడం గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను.

మీరంతా అంటే ఒక్క సంవత్సరం కోసం ఒక్క రోజు కోసం ఎంజాయ్ చేసేవాళ్లంతా ఒక్కసారి ఆలోచించి చూడండి మీ మందు మీ బట్టలకు అయ్యే ఖర్చు వాళ్ళ జీవితాలను నిలబెడుతుందని గమనించండి. మీకు సంవత్సరం అంతా ఇలాగే గడుస్తుంది కావచ్చు కానీ వాళ్లకు ఈ ఒక్క రోజు మీరు సహాయం చేసి చూస్తే వాళ్ళు వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని మర్చిపోలేరు.

మీరు చేసిన ఆ ఒక్క చిన్న పని వాళ్ళ గుండెల్లో మీరు దేవుళ్ళలా ఉంటారు వాళ్ళు వాళ్ళ గుండెల్లో మిమ్మల్ని గుడి కట్టుకొని మరీ పూజిస్తారు. లేదు మేము తాగుతాం మా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాం అంటారా సరే చేయండి కానీ అతిగా తాగకండి అతిగా డ్రైవ్ చేయకండి తాగి ప్రయాణాలు చేస్తే అది మీ ప్రాణాలకే ప్రమాదం కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకోండి అది మంచా చెడా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను కానీ ఒక్క నిమిషం ముందుగా నేను చెప్పిందాని గురించి ఆలోచించి ముందుకు సాగండి ఇది నా విజ్ఞప్తి దయచేసి మారండి. సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎవరి జీవితం మారదు ఒకరికి ఒకరు సహాయం చేస్తేనే ఇంకొకరి జీవితాలు బాగుపడతాయి అనే విషయం మర్చిపోకండి.

ఇది మన అందరికీ వర్తించే విషయం కాబట్టి కనీసం సహాయ పడాలని గుణాన్ని అయినా ఈ సంవత్సరం నిర్ణయంగా తీసుకుంటే నేను చాలా ఆనందిస్తాను ధన్యవాదాలు. 

– భవ్య చారు

Related Posts