నోట్స్

నోట్స్

అరేయ్ చిన్నా. నాకు కొన్ని తెల్ల కాగితాలు కావాలిరా అంటూ నేను మా బాబు ను అడిగాను, దానికి వాడు సరెనమ్మ తెస్తాను సాయంత్రం అంటూ రెడీ అయ్యి ఆఫీస్ కు వెళ్ళాడు.

నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ, చెప్పక తప్పడం లేదు. నేనొక చిన్నపాటి రచయితను నాకు ఏవేవో ఊహలు వస్తూ ఉంటాయి వాటిని కాగితం మీద పెడుతూ ఉంటాను.

కొన్ని రాతలు నాకు నచ్చేవి నా అనుభవాలు, అనుభూతులు, సమాజంలో జరిగే సమస్యలను తీసుకుని వాటికి కాస్త ఊహ జోడించి రాయడం నాకు వచ్చినవి. నేను రాసిన వాటికి ఎలాంటి బహుమతులు రాకున్నా, నాకు బాధ లేదు.

ఎందుకంటే మనకంటే బాగా రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి, మనకు రాకపోయినా ఏమీ ఇబ్బంది లేదు. నా రచనలు చదివి ఒక్కరయినా మారితే చాలు అని అనుకుంటాను. నేను పంపిన రచనలకు బహుమతి రాకపోతే పెద్దగా బాధ పడను.

Note Flat Paper - Free image on Pixabay

 

నా కొడుకు సాయంత్రం పేపర్స్ తెస్తాను అనడంతో ఆరోజు ఉన్న పేపర్లోనే ఒక చిన్న కథ రాశాను. రోజూ ఏదో ఒకటి రాయక పోతే నాకు తోచదు. అందుకే ఉన్న వాటిలోనే రాశాను.

సాయంత్రం బైక్ చప్పుడు కాగానే ఆత్రంగా వెళ్ళాను పేపర్స్ కోసం వాడు నన్ను చూడగానే షట్ అబ్బా అమ్మా మర్చిపోయాను అన్నాడు తల కొట్టుకుంటూ…

నేను నొచ్చుకోకుండా పర్లేదులే రేపు తీసుకురా అంటూ లోపలికి నడిచాను. మరి వాడి పని ఒత్తిడిలో ఈ చిన్న విషయం ఎలా గుర్తు ఉంటుందిలే అనుకుంటూ సర్ది చెప్పుకున్నాను…

అలా మూడు రోజులు గడిచాయి అయినా, పేపర్స్ తేవడానికి వాడికి కుదరలేదు. నాకు ఏమో పేపర్స్ లేకపోవడం వల్ల చేయి విరగొట్టుకున్నట్టుగా అనిపించ సాగింది. ఏం చేయాలి అర్దం కావడం లేదు. బాధ పడుతూ కూర్చున్నాను.

ఆరోజు శనివారం కావటంతో వాడికి ఆఫీస్ లేదు కాబట్టి లేట్ గా లేచాడు. బయటకు వచ్చిన వాడికి నేను కోపంగా ఉండడం గమనించినట్టు ఉన్నాడు. అమ్మా టిఫిన్ ఏం చేశావు అన్నాడు దగ్గరికి వస్తూ… వాడికి నచ్చని ఉప్మా చేశాను అదే చెప్పాను.

Taking notes | Free SVG

సరే అమ్మా. నాకు ఇష్టం లేని ఉప్మా చేశావు అంటే నీకు కోపం వచ్చింది అని నాకు అర్థం అయింది. కానీ, అమ్మా ఇంకా పేపర్స్ లో రాయడం ఎందుకమ్మా దాని కన్నా మంచిది నీకు నేను చెప్తాను. ఇలారా అంటూ గదిలోకి తీసుకుని వెళ్లి ఇదిగో నీ కోసం కొత్త ఫోన్ తెచ్చాను అంటూ ఫోన్ డబ్బా ఇచ్చాడు.

అది చూసి నాకు కొంచం సంతోషంగా అనిపించినా నాకు ఆ ఫోన్ ఎలా వాడాలో తెలియదు కదా అన్నాను.

వాడితో అమ్మా పెద్ద, పెద్ద కథలు రాసిన దానివి నికు రాకపోవడం ఏమిటి నేను ఉన్నది ఎందుకే నీకు నేర్పించడానికి కదా అంటూ ఆ రెండు రోజులు ఫోన్ ఎలా వాడాలోఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాడు.

అవును అంతా బాగానే ఉంది కానీ, మరి నా పేపర్స్ అన్నాను అమాయకంగా అమ్మా, ఈ ఫోన్ ఉంటే ఇక పేపర్స్ తో పనిలేదు నువ్వు ఇందులోనే రాసుకోవచ్చు అన్నాడు.

ఇందులోనా ఎలా అంటూ అడిగాను, అమ్మా ఇదిగో నీకు ఇందులో నోట్స్ అనే యాప్ డౌన్ లోడ్ చేస్తున్నాను అందులో, అంతా తెల్లగా ఉంటుంది నువ్వు రాయాలి అనుకున్న కథ పేరును టైటిల్ అనే దగ్గర రాసి కింద, నీ కథ రాసుకుంటూ వెళ్ళవచ్చు అలా నువ్వు ఎంత పెద్ద కథలు అయినా రాసుకోవచ్చు, వేరే పేపర్ అవసరం లేదు.

ఒక వేళ ఎవరికైనా కథ పంపాలి అనుకుంటే దాన్ని సెలక్ట్ చేసి కాపీ చేయాలి అంటూ నాకు నోట్స్ లో ఎలా రాయలో, ఎలా కాపీ చేయాలి దాన్ని వేరే చోట ఎలా పేస్ట్ చేయాలి అంటూ, మొత్తం నా దగ్గర కూర్చుని అంతా వివరంగా వివరించాడు చిన్నోడు.

అవునురా ఇందులో సగం రాసి అపేసాక అది ఉంటుందా? పోతుందా? అనగానే నువ్వు ఎంత రాసిన ఎన్ని రాసినా అలాగే ఉంటుంది అమ్మా, ఎక్కడికి పోదు నీ అంతట నువ్వు తీసేస్తే తప్ప అది ఎవరు చూడరు, ఎవరూ తీసేయ్యరు అంటూ చెప్పాడు.

అంతా బాగానే ఉంది కానీ, అలా రాయాలి అంటే నాకు ఇంగ్లీష్ రావాలి కదా నాకు అంతగా రాదు కదా అన్నాను మళ్ళి. అమ్మా కథలు రాయాలి అంటే ఇంగ్లిష్ రానక్కర లేదు, నువ్వు తెలుగులో చెప్పినా అదే రాస్తుంది అన్నాడు చిన్నోడు. అవునా, ఎలారా? అని ఆశ్చర్యంగా అడిగాను.

ఇదిగో నీ కోసం ఇందులో వాయిస్ రికార్డర్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్తూ వెళ్లొచ్చు దాన్ని సరి చేసుకోవచ్చు.

మంచిగా వచ్చిందా రాలేదా చూసుకుని బాగా రాకపోతే మళ్ళీ చెప్పుకోవచ్చు. కాగితం మీద అయితే, కొట్టి వేతలు ఉంటాయి కాబట్టి నీకు కష్టం కాని, ఇందులో అలా ఉండదు అంటూ వివరంగా వివరించి చెప్పేసరికి నాకు మొత్తం అర్దం అయ్యింది.

దాంతో నేను ఆ ఫోన్ ను నేర్చుకోడంలో పడి పోయాను. అలా కొన్ని రోజులు గడిచాక ఊరికే ఫోన్ పట్టుకోవడం వల్ల నా చేతుల్లో, మెడ దగ్గర, వెన్ను దగ్గర నొప్పి రావడం మొదలు అయ్యింది. ఇదంతా, ఊరికే కూర్చోవడం వల్ల వస్తుందేమో అనుకుని కొన్నిరోజులు నిర్లక్ష్యం చేశాను.

నోట్స్

Free photo Notes Book Notes Note Address Book Book Drawn - Max Pixel

కానీ, నొప్పి మరి ఎక్కువ అయ్యేసరికి డాక్టర్ వద్దకు వెళ్ళక తప్ప లేదు. ఆవిడ నన్ను చూస్తూ ఏమైంది అంటూ అడిగింది. నేను జరిగింది అవిడకు చెప్పడంతో, ఈ నొప్పులకు కారణం ఏమి లేదు మీరు కొన్ని రోజులు రాయకుండా ఉండండి.

అలాగే ఫోన్ కూడా పట్టుకోకండి ఒక వేళ పట్టుకున్నా అయిదు నిమిషాల కన్నా ఎక్కువ వాడకండి అంటూ సలహాలు, మందులు ఇచ్చేసి ఇంటికి పంపింది.

ఇప్పటికీ నేను డాక్టర్ సలహా పాటిస్తూ నోట్స్ లో కథలు రాసుకుంటూ ఉన్నాను. పేపర్స్ తెమ్మని మా వాడిని అడగడం మానేశాను…

ఎందుకంటే కాలంతో పాటు మనం కూడా ఆధునిక కాలాన్ని ఎంజాయ్ చేయాలి కదా ఏమంటారు???

ఈ ఆధునిక కాలంలో అందరితో మనం మారాలి మనకు అందుబాటులో ఉన్న వాటిని వాడుకుంటూ పాత తరానికి విలువ గౌరవం ఇస్తూ, కొత్త తరాన్ని స్వాగతించాలి.

Related Posts