న్యాయదేవత కళ్లకు గంతలు.!

న్యాయదేవత కళ్లకు గంతలు.!

కామాంధుల‌ రాక్షస క్రీడా వినోదానికి నాశనమైన ఓ స్త్రీ
న్యాయం కోసం‌ న్యాయస్థానంలో మొరపెట్టుకుంటే..
సూధుల్లాంటి ప్రశ్నలతో..న్యాయమూర్తి ఎదుటే హింసిస్తే
చట్టం‌ కొందరిచుట్టమని సరిపెట్టుకోమనడం‌ న్యాయమా

కన్నవారి కలలపంటగా పుట్టి..బతుకుపై ఎన్నో అశలతో
కాయకష్టం చేసి తల్లిదండ్రులు కడుతున్న ఫీజులతో..
కళాశాలకు వెళ్లి శ్రద్ధగా చదువుకునే ఆడపిల్ల తప్పేంటి,
మృగాల్లా మారిన మనుష్యరూప పశువులకు శిక్షేంటి

రెక్కాడితేగాని డొక్కాడని‌ నిరుపేద కుటుంబంలో పుట్టి
రోజంతా ఎండనకా, వాననకా పనిచేసే మహిళలు..
కార్యాలయాలు, దుకాణాల్లో కష్టపడుతున్న పడతులు
మగాళ్ల కళ్లకు ఆటవస్తుల్లా కనిపిస్తుంటే ఆపేదెవరు

ముక్కుపచ్చలారని పసి గుడ్డును సైతం చిదిమేస్తున్నా..
తరతరాలకు సేవలు చేసిన అవ్వనూ వదలకపోయినా
ఎందరో స్త్రీ మూర్తుల‌ ఆర్తనాదాలకు న్యాయం జరగదా
కోర్టులో న్యాయదేవత కళ్లకు కట్టిన గంతలు తెగిపడవా

– ది పెన్

Related Posts