ఓ చిన్న తప్పు పార్ట్ 2

ఓ చిన్న తప్పు పార్ట్ 2

భార్య తల దగ్గర దీపం చూసి కుప్ప కూలి పోతాడు రంగనాథ్. “మొన్న విసుక్కోకుండా ఉన్నా బావుండేది, పాపాత్ముని నేను”, అంటూ విలపిస్తాడు. ఏం లాభం………..?

రంగనాథ్ గారు మైక్ చేతిలోకి తీసుకుంటాడు. అప్పటికే రెండు సార్లు ధారగా కారుతున్న కన్నీటిని దస్తీ తోటి తుడుచుకుంటాడు. కానీ ఆ కన్నీటి ధార మాత్రం ఆగలేదు.

“ఆహుతులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు”. అంటూ మళ్ళీ కన్నీళ్లు తుడుచుకుంటాడు.

ఉద్వేగభరితంగా ఉన్న ఆయన శరీరం వణుకుతున్నట్టు తెలుస్తోంది. అలానే వణుకుతున్న చెయ్యి ని జేబులో పెట్టి, ఒక మడిచి ఉన్న ఉత్తరాన్ని తీశాడు రంగనాథ్ గారు.

అందరికీ నమస్కారము! ఈరోజు నా భార్య లక్ష్మి జన్మదినము. మిమ్మల్ని ఇలా ఆహ్వానించినందుకు మన్నించండి. నాలో బడబాగ్ని తో మండిపోతున్న నా తప్పు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది.

ముందుగా నా తప్పు సరిదిద్దుకోవాలి అంటే నా భార్య, లక్ష్మి నాకు రాసిన ఈ లేఖ మీకు వినిపించాలి. అంటూ చదువుతాడు రంగనాథ్ గారు.

**********

ప్రియమైన పతి దేవుడికి మీ లక్ష్మి మీ పాదములను నమస్కరిస్తూ రాయునది..

ఏవండీ, మిమ్మల్ని చూడకుండానే నేను మీకు వీడ్కోలు చెప్తున్నాను. మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారని, మిమ్మల్ని విసిగించడం ఎందుకు అని, ఒక విషయాన్ని మీ ముందు దాచాను.

డాక్టర్లు నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేను దైవ సన్నిధికి వెళ్లి పోతున్నాను. నన్ను క్షమించండి.

సమయానికి భోజనం చేయండి. పిల్లలు జాగ్రత్త. నేను మీకు గుర్తొచ్చినప్పుడల్లా ‘నా కర్ణ కఠోరమైన పాట’, మీకు తీపి గుర్తుగా ఉండిపోతుంది లేండి…..

ఇక వెళ్తాను.

ఇట్లు,
మీ అర్ధాంగి,
లక్ష్మి.

 

***********

 

రంగనాథ్ గారు కన్నీళ్ళు తుడుచుకుంటూ సభనుద్దేశించి, “నేను ఈ ఆస్తులన్నింటినీ పేదవారికి మరియు వారి సంక్షేమానికి ధారాదత్తం చేస్తున్నాను”.

ఇక, ఇవే రంగనాథ గారి చివరి మాటలు..

ఆవిడ మరణానికి గల కారణాలు లేఖ లో ఉన్నప్పటికీ ఆయన చదవలేదు అండి. బహుశా, ‘ఇంకో చిన్న తప్పు’ చేయడం ఆయనకు ఇష్టం లేక నేమో……!

– వాసు

Related Posts