ఓదార్పు వాక్యం

ఓదార్పు వాక్యం

బడిబాట లేదు వారికి
తలపై బరువు మాత్రం ఉంది
బాల్యం అనుభూతులు లేవు
భయపెట్టే ఆకలి భూతం మాత్రమే ఉంది

బాలల హక్కులు తెలీవు వారికి
చాకిరీ రక్కసి మాత్రమే తెలుసు
మద్యానికి బానిసయిన నాన్న వేధింపులతో
అనారోగ్యం అమ్మ భుజాలెక్కగా
బువ్వపెట్టే దిక్కులేదు వారికి
అక్షరాలు దిద్దించాల్సిన వేళ్ళే
బొచ్చెను పట్టుకోవడం నేర్పాయి

రక్షణ ఇవ్వలేక ‘బేటీ పడావో బేటీ బచావో’ నినాదం
సిగ్గుతో తలవంచుకుంది
మారని బతుకులు మారని రాతల
కుటుంబాలెన్నో ఈ భాగ్యసీమలో
ఓటమి అంచునున్న జీవితాలకు సాయపడని ఓదార్పు వాక్యమై
మనసు క్షోభిస్తోంది

– సి.యస్.రాంబాబు

Related Posts