ఒక చీకటి రాత్రి పార్ట్ ౩

ఒక చీకటి రాత్రి పార్ట్ ౩

కానీ ఇంతలో దుప్పటి లాగసాగింది ఆకారం. ఇంకా గట్టిగా బిగించాడు. అయినా గట్టిగా లాగుతుంది ఏదో శబ్దం చేస్తోంది. ఇంకా గట్టిగా బిగించాడు. లే…. లే… లే… అంటున్న శబ్దం వినిపించింది చేతనకి.

వామ్మో ఇది, ఇది నన్ను లేవమని అంటుంది ఏంటి అని భయపడ్డాడు చేతన్. లే….. లే….. లే…. అన్న శబ్దం ఇంకా గట్టిగా వినిపించ సాగింది.

వామ్మో ఇది నన్ను ఏదో చేసేలా ఉంది ఎలా భగవంతుడా… వద్దు నేను లేవను, నేను లేవను. అంటూ ఇంకా దుప్పటి ముసుగు పెట్టాడు చేతన్.

ఓరి నీ యబ్బ లేరా అంటే ఏంట్రా ఇంకా పడుకున్నావ్…? ఏంట్రా పరీక్షకు టైం అవుతుంది సిగ్గు లేదు? ఇంకా ఎంతసేపు పడుకుంటావు అంటూ ఇద్దరు స్నేహితులు కలిసి దుప్పటిని లాగేశారు.

గబుక్కున కళ్ళు తెరిచి చూసిన చేతన్ కి ఎదురుగా ఇద్దరు స్నేహితులు కనిపించేసరికి సంతోషంగా అనిపించింది. చుట్టూ చూస్తూ, దయ్యం దయ్యం ఏది అంటూ చుట్టూ చూశాడు. ఏంట్రా ఏంటి దయ్యం నీకు కూడా కనిపించిందా?

నీ జన్మ ధన్యం అయినట్లే రా చేతన్ అది నీకు కనిపించడం ఏంటో కానీ నువ్వు పరీక్ష పాస్ అయినట్టే… నక్కని తొక్కి నావు రా చేతన్ అన్నారు ఇద్దరు స్నేహితులు ఒకేసారి.

ఏంట్రా మీరు అనేది దయ్యాన్ని చూస్తే నక్కను తొక్కినట్టు అంటారేంటి? మీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఆ దెయ్యం గురించి మీకు ముందే తెలుసా?

నేను నాకు నా ఒక్కడికే కనిపించింది ఏమో అనుకున్నాను. ఏంట్రా మీరు ఇంత జోక్ గా చెప్తున్నారు? ఏంటి దెయ్యం కథ? నాకు కూడా కాస్త చెప్పండి భయపడి చచ్చాను అన్నాడు కొంచెం భయంగా కొంచెం చిరాగ్గా చేతన్.

అదే చెప్తాను రా ఈ గదిలోకి వచ్చినప్పుడు మేము కూడా ఆ దయ్యాన్ని చూసి ఇలాగే భయపడ్డాము. కానీ అది మనల్ని ఏమీ చేయదు. జస్ట్ వచ్చి కాసేపు కూర్చుని అటు ఇటు తిరిగి వెళ్ళిపోతుంది. మొదట రూమ్ లోకి వచ్చిన రోజు ఆ దయ్యం ఇలాగే వచ్చింది.

అయితే ఆరోజు కూడా నేను నీలాగా భయపడ్డాను. కానీ, అది ఏమీ అనకుండా అటు ఇటు తిరుగుతూ ఉంది. తెల్లారి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అదే రోజు నాకు ఉద్యోగం వచ్చినట్టు కాల్ వచ్చింది.

దాంతో ఈ గది నాకు అదృష్టం గా అనిపించింది. అందుకే ఖాళి చేయలేకపోయాను పైగా రెంట్ కూడా తక్కువే. ఇంత మంచి సెంటర్లో రేటు తక్కువగా ఉన్న గది దొరకడమే గగనం. అలాంటిది ఇప్పుడు ఖాళీ చేస్తే ఎలా అని అనుకునే సమయంలో ఉద్యోగం వచ్చింది.

అలాగే నా జీవితంలో కొన్ని మంచి పనులు కూడా జరిగాయి ఇదంతా ఆ దయ్యం రావడం వల్లే అనేది నాకు స్పష్టం అయింది. దాంతో వచ్చిన దయ్యాన్ని చూస్తూ ఉండడం తప్ప నేను ఏమీ అనలేక పోయాను భయపడటం కూడా మానేశాను.

బ్రతికి ఉన్నప్పుడు ఆ దయ్యం కూడా మనిషే కదా ఎందుకు భయపడడం అని నేను భయపడడం మానేసిన తర్వాత మా ఇంట్లో కానీ నా విషయంలో కానీ చాలా మంచి జరిగిందే తప్ప చెడు ఏమీ జరగలేదు.

అప్పట్నుంచి ఈ రూమ్ లో ఎవరికి ఆ దయ్యం కనిపించినా వాళ్ళ జీవితంలో మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆ దయ్యం మాకు ఫ్రెండ్ కానీ ఆ ఫ్రెండ్ మాట్లాడదు, ఏమీ అనదు కేవలం వచ్చి అటు ఇటు తిరిగి కూర్చొని పోతుంది మేము తనతో మాట్లాడాలని కూడా ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు.

మాట్లాడాలని ప్రయత్నం చేస్తే అది మాయమైపోతుంది. మాకు మంచి జరిగింది కాబట్టి ఇప్పుడు నీ విషయంలో కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నా.

ఏదైనా మనం చూసే చూపు లోనే ఉంటుంది. బ్రతికి ఉన్నప్పుడు మంచిగా మాట్లాడిన ఆత్మీయులు కూడా చనిపోయాక దయ్యమని, భూతం అని పిలుస్తూ భయపడుతూ హేళన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళూ మనుషులే కదా…

మనలాగే అన్ని కష్టాలు పడుతూ చదువుకుని తల్లిదండ్రులను, భార్యను, పిల్లల్ని, బాగా చూసుకోవాలని అనుకున్న వాళ్లే కదా… ఏదో ఆవేశంలోనో, అనుకోకుండానో చనిపోయి ఇలా దయ్యాలుగా మారతారు.

అయినా దయ్యాల అంటూ వాటికి భయపడడం కాకుండా కాస్త మంచిగా మాట్లాడితే అవి కూడా మనుషులలాగే ఉంటాయి అవీ మనుషులే కదా.

బ్రతికి ఉండి పిశాచాల పీక్కుతినే మనుషుల కన్నా ఈ దెయ్యాలే నయం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏరా కాదంటావా అంటూ పక్కనున్న స్నేహితుని అడిగాడు రఘు. అవున్రా నువ్వు అంత చెప్పింది నిజమే పీకు తినే వాళ్ళ కన్నా ఈ పిశాచాలు మంచివి అనిపిస్తుంది అని తేల్చేశాడు అతను.

మరి దయ్యం ఎవర్రా మీకేమైనా తన గురించి తెలుసా? అంటూ అడిగాడు చేతన్. లేదురా తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేశాం కానీ మాకు కుదరలేదు.

అయినా దెయ్యం గురించి తెలుసుకోని నువ్వు ఏం చేస్తావ్ రా? ముందు ఈరోజున్న పరీక్ష బాగా రాయి అది చాలు. పరీక్షకు టైం అవుతుంది లే లేచి ఫ్రెష్ అవ్వు…

అయినా నువ్వు ఎలా రాసిన పాస్ అవుతావ్ లే అంటూ స్నేహితులు చెప్పడంతో దెయ్యం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉన్నా అప్పటికి మాత్రం పరీక్ష సమయం అవుతుందని ఇంటికి వెళ్ళాడు చేతన్.

చేతన్ అనుకున్నట్టే పరీక్ష బాగా రాశాడు. ఇంతలో తండ్రి నుంచి ఫోన్ వచ్చింది. ఒక స్నేహితుడు తన సొంత కంపెనీలో మీ అబ్బాయికి ఉద్యోగం ఇస్తాను అని అన్నారు మరి నువ్వేం అంటావు? అని అడిగాడు.

దాంతో చేతన్ తండ్రి చెప్పినట్టుగా మీ ఇష్టం నాన్న గారు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను అని చెప్పాడు ఫోన్ లో… రాత్రి దయ్యం దెబ్బకి తల్లిదండ్రుల విలువ తెలిసి వచ్చిన చేతన్ కి.

ఇప్పుడు బుద్ధిగా చెప్పినట్లుగా వింటాను అన్నాడు. దానికి తండ్రి కూడా చాలా సంతోషించాడు కొడుకు లో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయాడు.

ఇక పరీక్ష అయిపోయిన తర్వాత ఆ దెయ్యం గురించి తెలుసుకోవాలని ఉత్సాహంగా మళ్లీ స్నేహితుని రూమ్ కి వెళ్ళిన చేతన్ కి గది తలుపులు తాళం వేసి కనిపించాయి. అరే ఏమైంది పొద్దున్నే వచ్చారు కదా ఇప్పుడు ఎటు వెళ్లారు అని అనుకుంటూ ఫోన్ చేశాడు.

హలో చేతన్ ఏంటి అంటూ ఫోన్ లిఫ్ట్ చేసాడు రఘు. ఏం లేదురా మీరు ఎక్కడికి వెళ్లారు? నేను మీ రూమ్ దగ్గరే ఉన్నా అంటూ అడిగాడు చేతన్.

అరే చేతన్ సారీ రా ప్రొద్దున చెప్పడం మర్చిపోయాను. నాకు, నా లవర్ కి పెళ్లి ఫిక్స్ అయింది అందుకే రూమ్ ఖాళీ చేసి నేను మా ఊరికి వెళ్ళిపోయాను. ఇంకో వారంలో పెళ్లి నువ్వు మా పెళ్లికి తప్పకుండా రావాలి.

ఇక ఆ రూమ్ లో ఎవరు ఉండరు రా… నువ్వు పరీక్ష హడావిడిలో ఉన్నావ్ అని పొద్దున చెప్పలేదు. కాని పెళ్లికి మాత్రం మీ వాళ్ళతో నువ్వు తప్పకుండా రా మళ్లీ చెప్పలేదు అని అనకు మర్చిపోకు అన్నాడు అవతల నుంచి రఘు.

ఓ అవునా కంగ్రాట్స్ రా తప్పకుండా వస్తాను నువ్వు రావద్దు అన్నా కూడా వస్తాం లే కానీ నాకు ఒక విషయం చెప్పు, ఆ దయ్యం గురించి తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి రా అన్నాడు ఆసక్తిగా చేతన్.

ఒరేయ్ రాత్రంతా భయపడ్డ వాడివి, ఇప్పుడు తెలుసుకోవాలనే ఆసక్తి ఎందుకు? అయినా తెలుసుకొని మాత్రం ఏం చేస్తావ్ చెప్పాను కదా మేము తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా అది కుదరలేదు. నాకేం తెలియదు రా సరే బాయ్ పెళ్లికి మాత్రం తప్పకుండా రా అంటూ ఫోన్ పెట్టేసాడు రఘు.

హా అంటూ నీరసంగా ఫోన్ కట్ చేశాడు చేతన్. ఎంతో ఆసక్తిగా దయ్యం గురించి తెలుసుకోవాలని వచ్చిన చైతన్యం చాలా నిరాశ పడిపోయాడు. ఏం చేయాలో తెలియక ఆ గది ముందు ఉన్న మెట్ల పై కూర్చున్నాడు దిగులు పడిపోతూ…

ఇంతలో చల్లని గాలి అతని మొహాన్ని తాకింది ఆ వెంటనే ఫోన్ మోగింది. చేతన్ ఫోన్ తీసి చూశాడు కాల్ వస్తున్నట్లు ఏమీ కనిపించలేదు మరి ఫోన్ ఎవరు చేస్తున్నారో కూడా కనిపించలేదు రింగ్టోన్ వినిపిస్తుంది.

ఏంటిది నా ఫోన్ ఏమైనా పాడైందా? రింగ్ వస్తుంది ఎవరో కనిపించడం లేదు కాల్ కూడా కనిపించడం లేదు ఇదేం మాయ అంటూ ఆశ్చర్యంగా తన ఫోన్ ను చూస్తూ ఉండి పోయాడు.

ఇంతలో ఫోన్ లో నుంచి హలో అంటూ వినిపించింది. అమ్మో ఇదేంటి ఫోన్ రాకుండా కాల్ కనిపించకుండా హలో అని వినిపించడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇంతలో అందులోనుంచి స్పష్టంగా మాటలు రావడం మొదలైంది.

హలో చేతన్ నేను రాత్రి నీతో ఉన్న దయ్యాన్ని నా మాటలు నీకు వినిపిస్తున్నాయి కదా. ఇన్ని రోజులు నేను ఎవరితో మాట్లాడలేదు మీ స్నేహితులు కూడా నన్ను మాట్లాడించాలి అని నా గురించి తెలుసుకోవాలని చాలా సార్లు ప్రయత్నం చేశారు కానీ నేను ఎవరితో పెద్దగా ఏమీ మాట్లాడలేదు.

ఇప్పుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నువ్వు కూడా నా లాగే ఉన్నావు. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. అందుకే నేను నీకు కనెక్ట్ అయ్యాను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను.

నా కథ నీకు చెప్పాలని అనుకుంటున్నాను. జాగ్రత్తగా విను భయపడకు అంటూ వస్తున్న మాటలు ఒక్క సారిగా ఆగిపోయాయి. మాటలు ఆగిపోవడంతో ఉలిక్కిపడిన చేతన్ చెప్పు వింటున్నా వింటున్నా అన్నాడు గాబరాగా ఎక్కడ చెప్పకుండా వెళ్ళిపోతుందో అనే అత్రం తో…

చెప్తాను చేతన్… నేనూ నీ లాంటి ఒక యువకుడిని అమ్మ నాన్నలకు ఒక్కగానొక్క కొడుకును నేను ఆడింది ఆట, పాడింది పాటగా గారాబంగా పెరిగాను. కాలేజీ కి వచ్చేసరికి నాకు ఖర్చులు కూడా పెరిగాయి.

అయితే నాన్న మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చినవారు కాబట్టి మాకు పెద్దగా ఆస్తి పాస్తులు లేవు వచ్చిన జీతంతోనే బ్రతకాలి. దాంతో నేను తీర్చుకోవాలి అనుకున్న కోరికలు అన్ని తీర్చుకోలేకపోయాను.

ఆ కోరిక తీర్చడం కోసం మా నాన్నని కష్టపడుతూ ఉండేవాడిని. అప్పుడే నా కోసమే పుట్టిందా అన్నట్టుగా అన్నట్టుగా ఒక అమ్మాయి కనిపించింది. కాలేజీలో ఆమెతో నేను ప్రేమలో పడిపోయాను.

ప్రేమలో పడి పోయి ఎన్నో బహుమతులు ఇచ్చాను. పరీక్షలకు ఫీజు కట్టమని మా నాన్న డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో తనను బైక్ మీద సినిమాలకు, షికార్లకు తిప్పాను. కానీ నన్ను వాడుకుని ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.

నాకు బ్రేకప్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఇంకొకరితో తిరగడం చూసి నా గుండెలు మండిపోతున్నాయి. అదే సమయంలో నాలో ఉన్న కవి మేల్కొన్నాడు.

విరహ బాధతో గుండెలు పగిలిన దుఃఖంతో నేను ఎన్నో రాత్రులు ఏడుస్తూ మంచి మంచి కవితలు ఎన్నో రాశాను, ఆ బాధ లోంచి వేదనలోంచి వచ్చిన కవితలన్నీ రాస్తూ ఉండేవాడిని అలా రాస్తున్న సమయంలో ఆ కవితలు చూసిన నా స్నేహితులు కొన్ని పత్రికల కి పంపించడం జరిగింది.

పత్రికల్లో అది రావడం చూసి నేను నా ప్రేయసి బాధలో నుంచి బయటికి వచ్చాను. అలా పత్రికలో వస్తుంటే నాకు ఎంతో మంది అభిమానులు ఏర్పడడం మొదలుపెట్టారు.

అలా అభిమానుల్లో నుంచి ఇంకొక అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ నా వెంట పడింది. కానీ నేను ముందే ఒక అమ్మాయిని చూసి ఉన్నాను ఆ అమ్మాయి తో బాధపడ్డాను కాబట్టి ఈ అమ్మాయి ప్రేమను నేను ఒప్పుకోలేక పోయాను అంతే హాయిగా సాగిపోతున్న నా జీవితం ఒక్కసారిగా కుదేలైంది.

నేను ప్రేమను ఒప్పుకోలేదు అన్న కోపంతో ఆ అమ్మాయి తన ఆత్మహత్యకు కారణం నేనే అంటూ సూసైడ్ లెటర్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. దాంతో లోకం కోడై కూసింది.

నేను అమ్మాయి తో మాట్లాడకపోయినా నేను అమ్మాయిని ఏమీ చేయకపోయినా నన్ను నానా మాటలు అన్నది. ఒకసారి మోసపోయిన నా హృదయం ఈసారి ఇలాంటి మాటలను తట్టుకోలేకపోయింది. నాకోసం కష్టపడ్డ నా తల్లిదండ్రులు, నా చుట్టాలు అందరిముందు నా పరువు పోయింది.

నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమించారు. నాకు కావాల్సినవన్నీ కొనిచ్చారు. అవి నాకు ఆ సమయంలో గుర్తు రాలేక లోకం నా మీద నింద వేసిందని ఆవేశంలో నేను ఆత్మహత్య చేసుకున్నాను.

కానీ చేసుకున్న తర్వాత చాలా బాధపడ్డాను నింద వేసిన ఈ లోకాన్ని ఎదిరించి నా తప్పేం లేదు అని ఎలుగెత్తి చాటాలి అని అనుకున్నాను.

కానీ నేను ఆ పని చేయలేదు ఒక పిరికివాడిలా సమాజానికి భయపడి, బాధపడి ఒక పిరికివాడిలా చచ్చిపోయాను కానీ అలా చనిపోయి ఎం సాధించానో ఏమో నాకు ఇప్పటికీ, ఎప్పటికి అర్థం కాదు.

ఇప్పుడు నా తల్లిదండ్రులు ముసలివాళ్లై ఎవరూ తోడు లేక వారిని చూసే దిక్కు లేక అనాధలుగా మిగిలిపోయారు. అప్పుడు నా ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే నేను ఇంకెంతో సాధించే వాడిని.

ఇప్పటికీ ఇంకా బ్రతికి ఉండే వాడిని. అలా చేయలేదు కాబట్టి ఇదిగో ఇప్పుడు ఇలా నీకు చెప్పుకుంటున్నాను. ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు తీసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది.

అందుకే ఈ రూమ్ లో అప్పుడప్పుడు తిరుగుతూ నాలాగా బాధపడుతున్నవారికి సహాయపడుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఇదే రూమ్ లో ఉండి చదువుకునే వాడిని.

చేతన్ ఇది ఈ రచయిత దయ్యం కథ, నేను రచయితను అని నీకు చెప్తున్నాను కానీ నిజానికి అవునో కాదో కూడా నాకు తెలియదు. ఒకవేళ నీకు నా మీద నమ్మకం ఉంటే ఇదే గదిలో బెడ్ కింద నేను రాసిన కవితలు ఉంటాయి.

అవి నేను ఒక పుస్తకం గా వేయించాలని అనుకున్నాను కానీ చచ్చి పోవడం వల్ల అది కుదరలేదు కాబట్టి నువ్వు ఆ పని చేయగలవా నా కోసం నా యొక్క చివరి కోరిక తీర్చగలవా….? అంటూ ఫోన్లో నుంచి వినిపిస్తున్న మాటలు ఒక్క సారిగా ఆగిపోయాయి.

తక్కువ మాటలు ఆగిపోవడంతో ఉలిక్కి పడిన చేతన్ ఈ లోకంలోకి వచ్చి చేస్తాను తప్పకుండా పుస్తకంగా అచ్చు వేయిస్తాం అన్నాడు. మళ్లీ ఒకసారి గాలి వీచింది తలుపులు తెరుచుకున్నాయి.

లోపలికి వెళ్ళిన చేతన్ బెడ్ కింద ఉన్న అర లోంచి కాగితాలను తీశాడు. అన్నిటిలోనూ భావ కవితలు చూస్తూ మైమరచి అక్కడే నిల్చున్నాడు.

ఈసారి తన పక్కన ఎవరొ నిల్చున్నట్లనిపించిచడంతో పక్కకు తిరిగి చూశాడు . అక్కడ మసక మసకగా  ఒక ఆకారం కనిపించింది. కానీ ఈసారి చైతన్ కి ఏమి భయమని అనిపించలేదు. చేతన్ ఆ కాగితాలు అన్నిటినీ తీసుకొని బయటకు నడిచాడు.

వారం రోజుల తర్వాత అచ్చయిన ప్రింట్లతో పుస్తకాలని తీసుకొని మళ్లీ అదే బిల్డింగ్ దగ్గరికి వచ్చాడు చేతన్. కానీ అక్కడ ఆ బిల్డింగ్ ని కూల్చేసి వేరే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అయ్యో అనుకున్నాడు చైతన్.

కానీ ఇంతలోనే చల్లగా గాలి తగిలింది. చేతన కి అర్థమైంది వచ్చింది ఎవరు అని. వెంటనే చూడండి ఇదిగో మీ పుస్తకాలు అచ్చు అయ్యాయి. నేను వీటిని ఆన్లైన్లో పెట్టాను.

రెస్పాన్స్ చాలా బాగుంది అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. అన్నాడు చాలా ఎగ్జైటింగ్గా ఫీలవుతూ… తిరిగి ఫోన్ మోగింది చేతన్ ఫోన్ తీసి చెవి పక్కగా పెట్టుకున్నాడు.

చేతన్, చాలా సంతోషంగా ఉంది నా కవితలన్నీ నువ్వు బుక్కు గా తీసుకొచ్చావు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పుస్తకాన్ని తీసుకు వెళ్లి మా అమ్మానాన్నలకు చూపించు వాళ్ళు చాలా సంతోషిస్తారు.

వాళ్ల అడ్రస్ ఇది అంటూ అడ్రస్ చెప్పిందా దెయ్యం. అలాగే తప్పకుండా తీసుకొని వెళ్తాను మీరు బాధపడకండి అన్నాడు చేతన్. చేతన్ నేను బాధ పడటం లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నేను అనుకున్న కోరిక తీరి పోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఇంక నీకు ఎప్పుడూ కనిపించను, వినిపించను నా కోరిక తీర్చిన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు.

నువ్వు నాకు ఎంతో ఆత్మీయుడిని అయిపోయావు నీకు ఎంత ఎంతగానో రుణపడి ఉన్నాను. వెళ్తాను చేతన్ అంది ఆ దయ్యం. సార్ ఒక్క నిమిషం ఇంతకీ మీ పేరు ఏంటి సార్ అంటూ అడిగాడు చేతన్ ఆసక్తిగా…

అప్పుడు ఆ దయ్యం, నా పేరు అమరేంద్ర అని అంది. దాంతో చేతన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు… అమర్ అమరేంద్రా….? అని అంటూ అలాగే నిల్చుండిపోయాడు. 

అసలు అమరేంద్ర ఎవరు? ఆ పేరు వినగానే చేతన్ ఎందుకు షాక్ అయ్యాడు? చేతన్ కి అమరేంద్ర కి ఉన్న సంబంధం ఏంటి? తన పుస్తకం వేయించడానికి అమరేంద్ర చేతన్ నే ఎందుకు ఎంచుకున్నాడు? తెలుసుకోవాలంటే పార్ట్ 4 వచ్చే వరకు ఆగాల్సిందే….

చెడ్డీ గ్యాంగ్ తో జాగ్రత్త Previous post చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్ చెడ్డీ గ్యాంగ్
యజ్ఞోపవీత మహిమ Next post యజ్ఞోపవీత మహిమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *