ఒక ఉద్యోగి ఆవేదన పార్ట్ 1

ఒక ఉద్యోగి ఆవేదన పార్ట్ 1

పద్దెనిమిదేళ్ళ వయసులో నాన్న సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. అప్పటికే అక్కకు పెళ్లి అయ్యింది. కానీ బావ వేధించడం వల్ల విడాకులు తీసుకుని మళ్ళీ ఇంటికే వచ్చింది బాబుతో పాటుగా… అమ్మ, నాన్న, అన్న, అక్క ఇది నా కుటుంబం. ఆనందంగా సాగిపోతున్న సమయంలో నాన్న చనిపోవడం పెద్ద శూన్యంగా తోస్తుంది.

అప్పటి దాకా అన్ని నాన్నే చూసుకుంటూ ఉండేవారు. కానీ ఇంటి యజమాని చనిపోతే ఎవరూ రారు, ఎవరు పట్టించుకోరు. సంపాదన, యజమాని లేని ఇల్లు ఎంత నరకమో తెలిసి వస్తుంది.

నాన్న ఉద్యోగంలో వుండగానే చనిపోవడం తో పాటు తనకు వచ్చే డబ్బులు కూడా రావడానికి చాలా సమయం పడుతుంది అని తెలిసి, అన్న హైద్రాబాద్ లో  కంపెనీలో చేరిపోయాడు.

సొంత ఇల్లు వదిలి మేము పక్క నున్న ఊరికి మకాం మర్చాము, పనులన్నీ అక్కడే అవుతాయి అని. నేను పొద్దున్నే పేపర్లు వేయడానికి కుదురుకున్నా, అప్పటి వరకు నాన్న తిరిగిన ప్లేస్ లో నాన్న తో పని చేసిన వాళ్ళు ఉన్న స్థలం లో, వాళ్ళ ఇళ్లకు నాన్న తో పాటూ గా వెళ్లి వాళ్ళు ఇచ్చిన టీ తాగిన నేను ఇప్పుడు అదే గల్లీలో వాళ్లకు పేపర్లు వేయడం చూసి వాళ్ళు ఎగతాళి చేసినా, నవ్వుకున్నా, ఏడుపును దిగమింగి నవ్వుతూ నా పని చేసుకుంటూ ఉన్నాను.

పొద్దున పేపర్లు వేయడం, పది గంటలకు ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ నాన్న కు వచ్చే డబ్బుల కోసం ప్రయత్నాలు చేయడం, తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి మొబైల్ షాప్ లో పనికి వెళ్లడం. ఇదే దినచర్యగా మారింది.

ఒక్కోసారి ఇంట్లో ఏమీ లేక స్నేహితుల దగ్గరకు వెళ్తే అప్పటి వరకు నాకు విలువ ఇచ్చి చూసిన వాళ్ళు నన్ను చూడగానే ఇళ్ళల్లో లేము అని చెప్పించే వారు. బంధువులే కాక పోయాక ఇక స్నేహితులు ఎందుకు దగ్గరికి వస్తారు?

అక్క బళ్ళో పని చేసేది. తనకు వచ్చే 1200 పన్నెండు వందలు మేము ఇల్లు కిరాయి కడుతూ, ఒక పూట తిని తినక పస్తులు ఉన్న రోజులు ఎన్నో… అదే సమయంలో నాన్నకు రావాల్సిన డబ్బు కోసం యాభై రూపాయల లంచం నుండి లక్ష రూపాయలు వరకు అప్పుచేసి పెట్టవలసి వచ్చింది.

నాన్న డబ్బు వచ్చినా అవన్నీ అప్పులకే సరిపోయాయి. ఒక్క రూపాయి కూడా మిగలలేదు. నాన్న తన వారి కోసం చేసిన అప్పులు అవి. తన వాళ్ళు అంటే అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముల కోసం చేశారు. అందుకే అప్పులు అన్ని కట్టేసి తనఖా లో ఉన్న ఇల్లును విడిపించాము. కానీ అందులో ఉండలేక పోయాము.

****************

కొన్ని రోజుల తర్వాత నాన్న ఉద్యోగం లో ఉండగా చనిపోవడం వల్ల అమ్మకు అనుకోకుండా ఉద్యోగం వచ్చింది. కానీ పెద్దలు మా మంచి కోరే కొందరు ఆమె చెప్రాసి పని చేయలేదు అంటూ ఉద్యోగం నాకు వచ్చేలా చేశారు. కానీ అది రావడం అంత సులభం కాలేదు.

అందరూ లంచం ఇస్తేనే ఉద్యోగం వస్తుంది అనడంతో లంచం ఇచ్చాను అప్పులు చేసి. సంవత్సరం తిరిగిన తర్వాత కారుణ్య నియామకాలలో భాగంగా లంచం కూడా పెట్టడం వల్ల ఉద్యోగం వచ్చింది. కానీ డిపార్ట్మెంట్ వేరు. నేను చదివింది ఇంటర్ కావడం వల్ల జూనియర్ అసిస్టెంట్ గా ఇచ్చారు.

దాంతో మాకు ఆనందంగా అనిపించింది. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలువ లేదు. నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఏదైనా సమస్య వచ్చినా గట్టిగా అడగను, నాన్న ఉండడం వల్ల బయటి ప్రపంచంలో ఎలా బతకాలో తెలియదు.

అంటే నేను నాన్న పోయాక లోకాన్ని చదవడం నేర్చుకున్నా, నాన్న పోయేసరికి ఇప్పుడే ప్రపంచం లోకి వచ్చిన చిన్న ప్రాణిని నేను. అందువల్ల అందరూ నన్ను ఆడుకున్నారు. ఎవరూ నాకు ప్రశ్నించడం నేర్పలేదు. అదే నాకు పెద్ద మైనస్ లాగా మారింది.

జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అనుకున్నా, ఇష్టమైన చదువు దక్కలేదు. మంచి చెప్పేవారు కరువు అయ్యారు. ఏది చేస్తే ఏమవుతుందో అనేది ఎవరు నేర్పించలేదు.

కొత్తగా ఉద్యోగం లో చేరాక అంతా గందరగోళంగా అనిపించింది. నాకు అక్కడ ఏం చేయాలో తెలియదు. ఏం రాయాలి తెలియదు అంతా కొత్త మనుషులు, కొత్త వాతావరణం, కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టాను. అక్కడ పని నేర్పిస్తాను అంటూ నన్ను దగ్గరికి తీశారు ఒక పెద్ద మనిషి.

కానీ, నాకు అతను ముందే చెప్పారు. నేను నీకు పని నేర్పిస్తా కానీ నాకు డబ్బు ఇవ్వాలి. నీకు అన్నీ ఎలా చేయాలో, ఏం చేయాలో దగ్గర ఉండి నేర్పిస్తాను. ఇప్పుడే నీ జీవితం మొదలు అయ్యింది.

నువ్వు ఇంకా ముందుకు వెళ్లాలి కాబట్టి పని జాగ్రత్తగా నేర్చుకో అంటూ ప్రొద్దున ఆఫీస్ లోనూ, సాయంత్రాలు ఇంటి దగ్గర పని నేర్పించే వారు. అయితే అతనికి డబ్బు ఇవ్వాలి అంటే నేను అప్పుడే ఉద్యోగం లో చేరడం వల్ల నాకు ఇంకా సాలరీ వచ్చేది కాదు. పే స్కేల్ కాలేదు.

2011 లో జాయిన్ అయితే 2015 నుండి నాకు జీతం రావడం మొదలు అయ్యింది. మిగిలిన పీరియడ్ అంతా ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట.

నేను జీతం లేకుండా పని నేర్చుకోవడం కోసం అపులు చేస్తూ అతనికి ఇవ్వడం మొదలు పెట్టాను. అతనికి పొద్దున టిఫిన్ దగ్గరి నుండి రాత్రి డిన్నర్ వరకు అన్ని నేనే చూడాలి, చివరికి అతన్ని బైక్ మీద ఇంట్లో కూడా దింపేసి వచ్చేవాడిని. అప్పుడప్పుడే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు మొదలు అయ్యాయి. దాంతో నేను వాటిని తీసుకుని వాడడం మొదలు పెట్టాను.

ఇంట్లో డబ్బు అడగకుండా ఉంటూ రోజు బైక్ లో పెట్రోల్ కొట్టించుకుని ఆఫీస్ కు వెళ్తూ వస్తూ ఉండే వాడిని .

**********

అలా కొన్ని రోజులు పని నేర్చుకున్న తర్వాత నాకు పని ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ ఒక్కొక్కసారి అందులో తప్పులు వస్తూ ఉండేవి. దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాక ఇంకొక కొలీగ్ ని సలహా అడిగాను.

అతను ఇంకొక వ్యక్తి నీ చూపించి ఇతను నీకు పని చేయిస్తాడు కానీ అతన్ని అన్ని విధాలా అర్సుకోవాలి అని చెప్పాడు. దానికి నాకు అర్దం తెలిసింది రెండో రోజు అతనికి సిగరెట్ దగ్గరి నుండి రాత్రి తాగే బ్రాండ్ సీసా వరకు అన్ని ఇప్పించాలి.

అలా అయితేనే తప్పులు లేకుండా ఫైల్ చేసి ఇస్తాడు. ఇక్కడ కూడా నేను పని నేర్చుకోవాలి అనుకున్నా కానీ పని ఎగ్గొట్టలని అనుకోలేదు. ఇక ఫైల్ లు రాయడం మొదలు పెట్టాక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

నాకు టైపింగ్ రాదు, అది నేర్చుకోవడానికి ఆఫీసు లో ఉన్న టైపిస్ట్ ను అడిగాను సార్ నాకు నేర్పించరా అని అడిగితే నేనెందుకు నేర్పిస్తా నాకు ఎవరు నేర్పలేదు కష్టపడి నేర్చుకున్నా, నాకేం అవసరం రా బై నీకు నేర్పనీకి అన్నాడు.

దాంతో దిమ్మ తిరిగి పోయింది నాకు. నేను అందర్నీ నమ్మాను. కానీ, అతను అలా అనేసరికి నాకు ఏడుపు వచ్చింది. అయినా అతన్ని ఏం అడగాలి నన్ను ఇలా అన్నందుకు అయినా నేను టైప్ నేర్చుకోవాలి, సిస్టం వర్క్ తెలుసుకోవాలి అని అనుకుంటూ వేరే చోట డబ్బులు పెట్టీ మరి నేర్చుకున్నా పట్టుదలతో…

అటు ఫైల్స్ పని నేర్చుకుంటూ ఇటూ టైప్ కూడా నేర్చుకుంటూ, మరో వైపు ఇంకో సార్ దగ్గర ఎవరెవరికి ఎలా లెటర్స్ రాయాలి అనేది మొత్తం నేర్చుకున్నా, కొత్త కొత్త పదాలు ఇంగ్లీష్ కూడా రాకపోయేది నాకు అందుకే లెటర్స్ రాస్తూ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నా, ఇలా అన్ని పనులు నేర్చుకునే సరికి నాకు చాలా అప్పులు అయ్యాయి.

అయినా భయపడలేదు. ఎలాగైనా తీర్చుకుంటూ ఉంట అని అనుకుంటూ ఫైల్స్ రాయడం మొదలు పెట్టాను. ఏ.డీ. గారు పని ఇవ్వడం మొదలు పెట్టారు. నేను రాస్తున్న కూడా కొన్ని తప్పులు దోర్లేవి వాటిని మళ్లీ రాయాల్సి వచ్చేది. ఇలాగే పని నేర్చుకున్నా నేను, కానీ నా పై అధికారి నన్ను బాగా తిట్టేవారు.

తప్పులు రావడం వల్ల దాంతో నేను మళ్లీ ఆ డబ్బులు తీసుకున్న సార్ పై ఆధారపడాల్సి వచ్చింది. ఆఫీస్ లో ఫైల్ ఇవ్వగానే నేను దాన్ని తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళేవాడిని, అతనికి డబ్బు తో పాటు టిఫిన్స్, లంచ్, డిన్నర్ అంటూ మందు అంటూ అన్ని తెప్పించే వాడిని ఇప్పించే వాడిని.

ఇన్ని చేశాక ఇక అప్పులు కాకుండా ఉంటాయా? నాన్న చేసిన అప్పులకు ఉన్న డబ్బు అయిపోయింది. ఇక నేను పని నేర్చుకోవాలి అనే తొందరలో చాలా డెబిట్ కార్డులు వాడడం మొదలు పెట్టాను.

కొన్నాళ్ళు గడిచాక నాకు పని పర్ఫెక్ట్ గా వచ్చింది. దాంతో ఫైల్ లు రాయడం మొదలు పెట్టాను. చేసేది రెవెన్యూలో కాబట్టి భూముల లెక్క లు అన్ని తెలుసుకున్నాను. ఏది ఎలా రాయాలి అని తెలుసుకున్న తర్వాత నాకు పని ఈజీగా తెలిసి పోయేది. నేను రాయడం మొదలు పెట్టాను.

***********

చాలా బాగా రాస్తున్నావు అంటూ అందరూ మొదట్లో మెచ్చుకున్నారు. నేను ఆఫీస్ ను నా సొంత ఇల్లులా భావించాను. మంచి పేరు తెచ్చుకోవాలని చాలా కష్టపడ్డాను. మొదట్లో ఆఫీస్ టైం అయిపోయినా కూడా పని చేస్తూనే ఉండేవాడిని అంత ప్రాణం పెట్టాను పని మీద. నాకు ఫైల్ లు అప్పగించి చేయమని చెప్పి అందరూ వెళ్ళిపోయేవారు.

అయినా రాత్రంతా కూర్చుని అవన్నీ ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళేవాడిని. ఒక్కోసారి రాత్రి ఒంటిగంట కూడా అయ్యేది. కానీ ఆ ఫైల్ లో చాలా డబ్బులు వచ్చేవి ఆ విషయం నాకు తెలిసేది కాదు అయినా నాకు లంచం అంటే చాలా భయం వచ్చింది కొత్తగా అవడం తో చాలా భయపడే వాడిని.

కొన్ని రోజుల తర్వాత మా సార్ డబ్బులు నాకివ్వమని వాళ్లకు చెప్పేవాడు. నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ సార్ కి ఇచ్చేవాడిని. ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి జీతం లేదు డెబిట్ కార్డ్ లు ఉపయోగిస్తూ ఉండేవాడిని. అయితే అప్పుడే నాకు పే స్కేల్ మొదలు అయ్యింది.

మూడేళ్ల తర్వాత తొమ్మిది వేల రెండువందల పదమూడు రూపాయల (9213 rs) తో…  కానీ ఆ జీతం అంతా కార్డ్ లు కట్టడానికి, ఫైల్ లో తప్పులు వస్తె రాయించడానికి, పెట్రోల్ కు నా తిండి కి ఖర్చు అయ్యేది. పైసా కూడా మిగిలేది కాదు. కొత్త కాబట్టి సార్లు ఏం చెప్పినా చేయడమే జరిగేది. ఎంత సేపు అయినా ఉండి చేసి పోమని అనేవారు. కానీ నాకు ఇక్కడ ఇంకో సమస్య ఎదురయ్యింది.

*******

అప్పటి వరకు ఇంట్లో అమ్మా, అక్కా, అల్లుడు ఉండేవారు. నాకు టైం కు టిఫిన్ కట్టి ఇచ్చేవారు. కొన్ని రోజులకు అక్కకు మళ్లీ పెళ్లి చేశాం. తను వెళ్లిపోవడం తో ఇంట్లో చేసేవారు ఎవరు లేకుండా పోయారు. అమ్మకు మోకాళ్ళ నొప్పులు మొదలు అయ్యాయి.

దాంతో నేను పొద్దున్నే లేచి, వంట చేసి అమ్మకు పెట్టి, ఆఫీస్ కి రావాలి అంటే లేట్ అయ్యేది. మేము హైద్రాబాద్ లో ఉండేవాళ్ళం అక్కడైతే హాస్పిటల్స్ ఉంటాయి అని, అక్కడి నుంచి నేను పని చేసే దగ్గరికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్ కు వెళ్లేసరికి లేట్ అయ్యేది. రిజిస్టర్ లో రోజు నాకు సి. ఎల్. వేసేవారు.

ఆఫీస్ కు లేట్ గా వెళ్ళిన సాయంత్రాలు ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఉండు ఫైల్ లు రాయి అనేవారు. అది నాకు చాలా కష్టంగా మారింది. పొద్దున రానట్టు వేశాక మళ్లీ పని చేయించుకోవడం ఏంటో అర్దం కాలేదు.

ఇలా మూడు నాలుగు నెలలు జరిగింది. తర్వాత నాకు ఇలా సి.ఎల్ వేస్తే జీతం రాదని తెలిసింది దాంతో నేను బిత్తరపోయారు.

అంటే ఇన్ని రోజులు నేను చేసింది వృధానా? పని ఫ్రీ గా చేయించుకున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుని నన్ను వాడుకున్నారు అనే విషయం తెలిసి చాలా బాధ పడ్డాను. తర్వాత ఏం చేసాను అనేది ఇంకొక పార్ట్ లో చెప్తాను. ఇది కేవలం ముందు మాట మాత్రమే… నన్ను చాలా బాధలు పెట్టారు.

ఇదంతా నిజంగా జరిగిన సంఘటన ఇది నా జీవితం కు సంభందించిన విషయం. మీతో పంచుకోవాలని అనిపించి రాయడం జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఉద్యోగి విలువ పెరగలేదు. పై ఆఫీసర్స్ నుండి వేధింపులు తప్పలేదు… మళ్ళీ వస్తాను అంతవరకు సెలవ్… 

– అర్జున్

Related Posts