ఓ నాన్నా నీ మనసే వెన్నా

మేము ఆరుగురం ఆడపిల్లలము. అయినా, నాన్న మమల్ని చాలా ప్రేమగా చూసేవారు. ఇది పాతికేళ్ల నాటి మాట యు.డీ.సి.గా పని చేసే నాన్న జీతం తక్కువ అయినా, మమల్ని ఆ డబ్బుతోనే మా అవసరాలన్నీ తీర్చే వారు.

ఆడపిల్లలు పరాయి ఇంటికి వెళ్ళే వారని అక్కడ వారికి ఎలాంటి సమస్యలు వస్తాయి తెలియదు కాబట్టి, ఇక్కడ అమ్మాయిలను మంచిగా చూడాలి అనుకునే వారో ఏమో కానీ, మేము ఏది అడిగినా కాదని అనకుండా తెచ్చి పెట్టేవారు.

అలా, మా అక్క పెళ్లి తర్వాత నా పెళ్లి కూడా చేశారు. అత్తారింట్లో బాగానే గడిచింది కొన్నాళ్ళు, తర్వాత మామూలే కదా పెద్ద సంసారం, ఆడపడుచుల పెళ్ళిళ్ళు, పురుళ్లు వగైరాలు చేయడంలో తల మునకలు అయ్యేలా మునిగి పోయాను. అదే సమయంలో నేను నీల్లోసుకున్నాను అని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది.

Father Daughter Piggyback - Free photo on Pixabay

కానీ, కడుపుతో ఉన్న నాకు ఏవో తినాలని ఉంటుంది కదా, ఇక్కడ అన్నం తినాలి అంటే వికారం గాను, వాంతి వచ్చినట్లు అనిపిస్తూ ఉండేది. దాంతో ఏమి తినాలని అనిపించేది కాదు.

పనంతా చేసి, లంకంత కొంప, వాకిలి ఉడ్చి, అలికి ముగ్గులు పెట్టే సరికి తల ప్రాణం తోకకు వచ్చేది. పైగా కడుపుతో ఉండి పని చేస్తుంటే కానుపు సులభంగా అవుతుందని పెద్దలు ఎవరూ పనిలో సహాయానికి వచ్చేవారు కాదు.

పని అంతా చేసి అలసిపోయి ఒక ముద్ద తిన్నా వెంటనే బయటకు వచ్చేది అయిదో నెలలో ఇక నాకు సీమంతం చెయ్యాలని మా అత్తగారు వాళ్ళు మా పుట్టింటికి చెప్పక తప్పలేదు. ఎందుకంటే, సీమంతం ఆచారం కాబట్టి అప్పటి వరకు చెప్పకున్నా ఇక చెప్పక తప్పదు అని ఒక కార్డు ముక్క రాసి పాడేసారు. నాకు చాలా బాధగా అనిపించినా ఏమి చేయలేని నిస్సహాయత.

విషయం తెలియగానే నాన్న ముందుగా నాకు ఇష్టమైనవి అన్ని చేయించి, ఎవరెవరి దగ్గరో అడిగి తీసుకుని అమ్మ కన్నా ముందే వచ్చారు. అమ్మ, చెల్లెళ్ళు తర్వాత నిందానంగా వచ్చారు. బట్టలు అవి తీసుకుని, వాళ్ళు వచ్చాక ముందుగా చెప్పలేదని మా అత్తగారిని, మామగారిని అడిగారు.

కానీ, వాళ్ళు పని హడావుడిలో మర్చిపోయాము అంటూ చెప్పడంతో ఇక ఏమి చేయలేక మౌనంగా ఉన్నారు నాన్న.

అత్తగారు, ఆడబడుచులు మా వాళ్ళు తెచ్చిన బట్టలు చూసి ముక్కు విరిచారు, వాళ్ళు తెచ్చిన పళ్ళు, ఫలాలు, అన్ని నాకన్నా ముందే తీసుకుని తిన్నారు. సరే పోనీ చిన్న పిల్లలు అని అనుకున్నాను. ఇక సీమంతం రోజు పనులన్నీ నాకే పురమాయిస్తూ అత్తగారు ఉపిరి సలపనివ్వలేదు.

ఓ నాన్నా నీ మనసే వెన్నా

dad, father, child, kid, family, people, park, trail, forest, woods | Pxfuel

ఆరోజు నాకు చాలా అలసటగా ఉంది. అయినా, వంట వార్పు నాదే కాబట్టి పనులన్నీ ఒక్క దాన్ని చేసుకున్నా, మా అమ్మగారు నాకు సాయం రాబోతూ ఉంటె, ఆ మాత్రానికే నీ కూతురు అలసిపోదులే అంటూ అత్తగారు అమ్మను ఆపుతూ ఉన్నారు, పైగా, మీ అమ్మగారితో చేయించేవు ఆవిడ చేస్తే నేను ముద్ద ముట్టను అని అత్తగారి ఆర్డర్ తో వంటంతా చేసి ముందు గదిలో పెట్టి, వంట గదిలో కొంగు పరుచుకుని పడుకున్నా… అలసిపొయానేమో మాగన్నుగా నిద్ర పట్టింది…

ఇంతలో చల్లని రెండు చేతులు నా కాళ్ళు నొక్కుతూ ఉండగా చటుక్కున మెలకువ వచ్చి లేచి చూసాను నా మసక కళ్ళకు మసక, మసకగా నాన్నగారి రూపం అస్పష్టంగా కనిపించడంతో గబుక్కున లేచి కూర్చుని ఏంటి నాన్న ఇది అంటూ కాళ్ళు వెనక్కి లాకున్నా …

నాన్న నవ్వుతూ పర్లేదమ్మ ఒక బిడ్డను కనబోతున్న నువ్వు నాకు అమ్మతో సమానం తల్లికి సేవ చేయడం తప్పేమీ కాదు కదమ్మా అంటూ కాళ్ళు పట్ట బోయారు. కానీ నాన్న పెద్ద వారు అలా చేయకూడదు అంటూ లేవబోయాను మీ అత్తగారు లేరు లే కాసేపు నొక్కి వెళ్తాను. మా తల్లివి కదూ అంటూ వెనక్కి లాగిన కాళ్ళను మెల్లిగా ముందుకు తీసి  నొక్కారు. నిజం చెప్పొద్దూ నాకు హయిగా అనిపించింది అలాగే నిద్ర పోయాను.

శ్రీమంతం అయ్యాక పుట్టింటికి కాన్పు కోసం తీసుకుని వెళ్ళారు, అక్కడికి వెళ్ళాక కూడా నాన్న నా కాళ్ళు పట్టడం ఆపలేదు. అది చూసి మా అమ్మ ఆశ్చర్య పోతే, మా అక్కలు చెల్లెళ్ళు మాకిలా ఎందుకు చెయ్యలేదు నాన్న అంటూ అలగడం.

నాన్న వారికి మీకు అన్ని విధాల మంచిగా చూసి చేసాను కాని తనకు మాత్రం మంచి సంభంధం చేయకున్నా నోట్లోంచి ఒక్క మాట రాకుండా మౌనంగా కాపురం చేస్తున్న నా తల్లి నిజంగా భూదేవి నే అంటూ వారికి నచ్చ చెప్పడం తో ఇక వాళ్ళు ఏమి మాట్లాడేవాళ్ళు కాదు.

ఓ నాన్నా నీ మనసే వెన్నా

Father And Daughter Love Family - Free image on Pixabay
నా గురించి ఇంతగా ఆలోచించిన నాన్న నా కోసం మామిడి పళ్ళు తేవడానికి వెళ్ళి, చెట్టు పై నుండి జారి పడి నా కొడుకుని చూడకుండానే కన్ను ముయాడం నా దురదృష్టం  ఇప్పటికి అమ్మకు మొహం చూపాలంటే నాకు అదోలా ఉంటుంది, కాని అమ్మ మాత్రం నా నుదుటి రాత ఇలా వుంటే నీ తప్పేం ఉందమ్మా మహాను భావుడు ఏమి చేయించుకోకుండా వెళ్లిపోయాడు అని అనుకుంటూ నాన్నగారిని తల్చుకుంటుంది.

నిజమే నాన్నగారు మహానుభావులు …

ప్రతి కూతురికి ప్రతి తండ్రి ఒక మహానుభావుడే కదా అలాంటి మహానుభావులందరికి పితృ దినోత్సవ శుభాకాంక్షలు…

                                                                                                                 — వసుధ 

Related Posts