ఊపిరి

ఊపిరి

నా ఉనికి తను.
నా మనికి తను.
మట్టిలో కలిసే వరకు చెరగని చిరునామా తను.
ఉదయకాల సమీరం శుభోదయ సుప్రభాతం.
ప్రకృతిలో పయనించిన ప్రతిసారి నను మరిపించే చెట్ల ఊసులతో పలకరింపుల పరిమళం.
చల్లని సాయంత్రం చిరునవ్వుల కబురులతో మైపూతల చందనం.
పండు వెన్నెలలో నిండుగ తోడైన సహవాసం.
శిశిర సాయంత్రాన కృత్రిమ యంత్రాలను తలదన్ను శీతల తుషారం.
సాగర తీరాన తన కౌగిలిలో మనసు ఎగురుతున్న స్వేచ్ఛా విహంగం
బాధలో వేడి నిట్టూర్పు తను.
ఆనందంలో ఉచ్ఛ్వాసల ఆస్వాధం తను.
నాలో తను.
తనలో నేను.
నా చుట్టూ రక్షణ కవచమై అల్లుకున్న అనురాగబంధం. విడదీయలేని అనుబంధం.
తను లేని మరుక్షణం నా తనువు ప్రేమించిన వారికి సైతం దుర్గంధ భూయిష్ఠం.
అనాదిగా అనుక్షణం నాకై తాపత్రయపడే నేస్తమా!
నా ప్రియ నిచ్చెలీ చిరుగాలి,
మానవాళికి నువ్వు ఒక దివ్యమైన వరం.
నీ సేవకు వెల కట్టడం ఎవరితరం? అటువంటి నీకు కోపాన్ని తెప్పించేది నేనే
నీ విలయతాండవాన్ని తట్టుకోలేక విలపించేదీ నేనే
కృతఘ్నత చూపి నిన్ను మాలిన్యం చేసేది నేనే
కర్కశమైన రోగాల పాలై రోదించేదీ నేనే
నాలో నిన్ను బంధించ యోగిని కాదు
నిన్ను అవసరాలకు వాడుకుంటున్న భోగిని
నీలో దైవత్వాన్ని చూడలేని రోగిని
నిన్ను స్నేహానికి ప్రతీకగా గుర్తించని మూర్ఖత్వాన్ని.
వెరసి కృతజ్ఞత ఎరుగని మనసులేని మనిషిని.

– సలాది భాగ్యలక్ష్మి

Related Posts