పోలు పోయని కాడుగా…!!!
గమనింపు చేసుకో…
రాజ్యాధికారాలను సాధించాలనే
తృష్ణలు… వీరుల సన్నిధానపు
భోగభాగ్యాలు మిరుమిట్లు గొలిపే
ప్రభలతో జీవితరథాలు ఎంతటి
పోకడపోయినా…దాటని హద్దుగా
పోలు పోయని కాడుగా ఒలుకుల మిట్ట
వరకే…
ఒంటరిగా వచ్ఛావు…
ఒదిగివుండే బతుకు చక్కధనాలను
నేర్చుకో…బతికిన నీ చివరి వరకు
ఏదీ వెంటరాదని ఒక్కడిగా సాగనంపే
రోజులకు మనుషులను కూర్చుకో…
ఇది స్వార్థం పూయని ధర్మాలతో
మనిషికి జరిగే అంతిమ యాత్రని తెలుసుకో…
నిండిన చ్ఛాయల గర్వంతో
నిజాలు దాగలేవు వెతకబూనే చేయికి
కాలం తగలదని…
పెంచుకొన్న ప్రేమాప్యాయతలు
పెలుసులుగా విరిగిపోతు…
చూపని మమతల విడ్డూరం నిట్టూర్పులై
బదులురాని బంధాలు కళ్ళముందే
తెగిపోతు…ఆశల మగ్గంలో పెంచుకొన్న
పలుకులు పిలుపు కాలేక ఎద కుంపటిలో
కాలిపోతాయి…
తోడవని నీడలతో
ఇన్నాళ్ళు నువు కదిలించిన దేహం
ఎముకల గూడని అది చేసే ప్రతిది
ఒక నటననే నని…నిర్మాణం కాలేని ఆత్మకు
కదిలే రూపాలపై విశ్వాసం లేదని…
బోధపడిన నాటికి నడిచిన ఆ నలుగురితో
పిలిచిన చివరి పిలుపు దింపుడు గల్లమై
పలుకుతుంది వల్లకాడుకై…
తలువకు ఏది శాశ్వతం కాదు….
– దేరంగుల భైరవ