పగలు, ప్రతీకారాల విస్ఫోటనం

పగలు, ప్రతీకారాల విస్ఫోటనం

కొందరి పుస్తకాలు సమీక్షించాలంటే స్థాయి సరిపోదు. శక్తి చాలదు. అలాంటి రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్ ముఖ్యులు.

టాక్ తో సంబంధం లేకుండా మాస్ సినిమాకు కలెక్షన్లొచ్చినట్టు ఆయన పుస్తకమేదైనా హాట్ కేకులా అమ్ముడుపోవాల్సిందే.

ఈమధ్య ఎక్కువ నాన్ ఫిక్షన్ రచనలపై దృష్టిపెట్టిన ఆయన ఓ నవలను ఈమధ్యే పాఠకులకు కానుక చేశారు. ఆ నవల *నిశ్శబ్ద విస్ఫోటనం*.

అప్పుడే రెండో ఎడిషన్ కూడా వచ్చేసింది. విమర్శకులెప్పుడూ యండమూరిని సీరియస్ గా తీసుకోలేదు. ఆయనా వీరిని పట్టించుకోలేదు. పాఠకుల అభిప్రాయాలే గీటురాయిగా ఆయన భావిస్తారు.

ఆశ్చర్యంగా *నిశ్శబ్ద విస్ఫోటనం* నవలపై పాఠకుల నుంచి మిశ్రమ స్పందనలొచ్చాయి. అవేమీ రెండో ఎడిషన్ ని ఆపలేకపోయానుకోండి.

అది వేరే విషయం. ఆయన నవలలు వెండితెరపై చూడటానికన్నా చదువుకోవడానికి హాయిగా ఉంటాయి. ఈ నవల కూడా ఆ కోవకు చెందిందే.

యండమూరి నవలల్లో హీరోయిన్ ‘ఐక్యూ’ ఎక్కువ. ఇక్కడ కూడా హీరోయిన్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉంటుంది.ఆ ఎత్తులన్నీ నవలలో రాజకీయ వ్యవస్థతో ఉంటాయి.

ఈ నవలలో కొన్ని పాత్రల పేర్లు గమ్మత్తుగా ఉంటాయి.నాయిక వేదరవళి, విలన్ కూతురు సుమద్యుతి, మరో విలన్ మీసాల్రాజు, ఒక వ్యవస్థతో పోరాడే ఒక యువకుడి పేరు బాలారిష్ట.

కథలోకి వెళితో ముఖ్యమంత్రి బావమరిది అతని గ్యాంగూ ఆరంభంలోనే రాజధానికి సమీపంలో ఉండే ఆదిత్యపురం అనే ఊరితో ఆడిన వికృతకీడ అతని అవమానానికి దారితీయటం..

తనను అవమానించిన స్థానిక నాయకుడు యలమంద పై ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుడి ద్వారా హత్యా చేయించి, దానిని స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడైన హీరోయిన్ తండ్రిపై నెట్టివేయడంతో
రాజకీయ థ్రిల్లర్ దిశగా నవల సాగుతుంది.

ఇందులో ప్లేస్మెంట్స్ పేరుతో విద్యార్థులను మోసగించిన ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ట్రయాడ్ మాఫియా ఎలా ఆపరేట్ చేస్తుందన్న వివరాలున్నాయి.

వీటన్నిటికి మించి అకారణంగా తన తండ్రిని ముందు జైలుపాలు తర్వాత హాస్పిటల్ పాలు చేసిన విలన్లకు శిక్ష వేయటం అంశంతో సాగిన నవల ఇది.

చాలాచోట్ల కథనుంచి పక్కకు జరిగి రచయిత కావ్యాలను,యుద్ధనీతి అంశాలను రిఫరెన్స్ తో సహా స్పృ శిస్తాడు. కొన్నిచోట్ల కొన్నిపదాల పుట్టుకను చర్చిస్తాడు.

ఇది సినిమా స్క్రిప్ట్ లా సాగే నవల.సాధ్యాసాధ్యాలను ప్రశ్నించలేం.తెరపై దృశ్యం మనలను లాగేసినట్టు ఇక్కడ యండమూరి వాక్యాలు మన కళ్ళను అతుక్కుపోయేలా చేస్తాయి.

కొన్నిచోట్ల బలహీనమైన నేపథ్యాలు కనిపిస్తుంటాయి. ఇవన్నీ రీడబిలిటీ అనే అంశంలో కొట్టుకుపోతాయి..

ఇదే స్క్రిప్టును సినిమాగా తీస్తే అంతగా నప్పకపోవచ్చు.అనేక అభ్యంతరాలు చెబుతాం. రీడింగ్ ఒక వ్యక్తిగత అనుభూతి. సినిమా ఒక సామూహిక ఉన్మాదం.

అందుకే దృశ్యపరికల్పన సినిమాకో సున్నితమైన అంశం. నవల ఆ పరిమితి నుంచి తప్పించుకోగలదు. మన యువత ఇంగ్లీషుభాషలోని పల్ప్ ఫిక్షన్ ఎక్కువ ఇష్టపడుతుంది.

*నిశ్శబ్ద విస్ఫోటనం* ఆ ఫీల్ ను తెలుగులో తెచ్చింది.ఇంతకుముందు రచనల్లోలేని ఫూట్ నోట్స్ వంటి అంశాలు ఈ నవలలో అనేకం.

కొన్నిచోట్ల కధనం బలహీనంగా ఉన్నా ,అన్నీ సినిమాటిక్ ట్విస్ట్ లే అయినా యండమూరి మార్క్ రైటింగ్ తో కొంత సరిపెట్టుకుంటాం.

సామాజిక స్ప్రహ, రచన ప్రయోజనం వంటి అంశాలతో సంబంధం లేకుండా చదువుకునే నవల నిశ్శబ్ద విస్ఫోటనం.

హింస,సెక్స్ వంటి అంశాలు సమాజాన్ని ఎలా చీడపురుగులై బాధిస్తున్నాయో చెప్పే ప్రయత్నం చేస్తుందీ రచన.

ఎలాంటి ఎక్స్పెక్టేషన్సూ లేకుండా చదవండి. ఎంజాయ్ చేస్తారు. సినిమాల కన్నా యండమూరి విజయవంతమయిన నవలా రచయిత ఎందుకయ్యారో అర్థమయింది.

ఆయన డీటెయిలింగ్ తెరపై చూడటానికి కన్నా చదువుకోవటానికి ఎందుకు బావుంటుందో కూడా చెప్పే నవల *నిశ్శబ్ద విస్ఫోటనం*

– సి.యస్.రాంబాబు

Related Posts