పండగొచ్చింది
ప్రతి ఉగాది లాగానే ఈ ఉగాది పండుగను కూడా బాగా జరుపుకోవాలని ప్రసాద్ నిర్ణయం తీసుకున్నాడు. అంతకు ముందు రెండు సంవత్సరాలు ఈ కరోనా మహమ్మారి వల్ల సరిగా జరుపుకోలేకపోయాడు. కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. వారికి సేవ చేయటం, తనను తాను కాపాడుకోవటం ఇవే అతనికి ముఖ్యమయిన పనులు అయ్యాయి.
ఇప్పుడు మాత్రం హాయిగా పండుగ చేసుకోవాలి అని ప్రసాద్ అనుకున్నాడు. జాతకం ప్రకారం అతనిది ధనుస్సు రాశి. ఏల్నాటి శని పోయి ఈ ఉగాది నుండి మంచి
ఫలితాలు ఉంటాయి అని పంచాంగంలో ఉంది. ఏడు సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పెడుతున్న శని ఈ ఏడాది వదిలిపెట్టడం వలన సంతోషంగా ఉంటుంది అని అతను భావించాడు.
కష్టాలు అతనికి అలవాటు అయిపోయి ఇప్పుడవి అతన్ని పెద్దగా బాధ కలిగించలేదు. భార్యా పిల్లలకు మంచి బట్టలు కొందామని ఒక షాపుకు వెళితే ఆ షాపతను చూపిన బట్టలు ప్రసాదుకి ఏ మాత్రం నచ్చలేదు. ప్రసాదుకి నచ్చిన బట్టలు ఎక్కువ ధర ఉండటంతో అవి కొనే డబ్బు లేక ప్రసాద్ విచారంగా షాపు బయటకు నడిచాడు.
కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి నడిచి విచారంగా ఇంట్లోకి వెళ్లిన మన ప్రసాద్ మనసు ఆనందంతో నిండిపోయింది. అతని భార్య అతనికి మంచి భోజనం పెట్టి ఆ తర్వాత కొత్త బట్టలు తెచ్చి ప్రసాదుకి ఇచ్చింది. పిల్లలకు కూడా బట్టలు, మిఠాయిలు తెచ్చి పెట్టింది. ప్రసాద్ చాలా ఆశ్చర్యపోయాడు.
అప్పుడు ప్రసాద్ భార్య రాజి, “చూడండి, మీ కోసం, మన పిల్లల కోసం బట్టలు కొన్నాను. మిఠాయిలు కూడా కొన్నాను. ఆ డబ్బులు ఎక్కడివి అని మీ అనుమానం కదా. నేను ఖాళీ సమయంలో ఆన్లైన్ కోర్సులు చేసాను. కోర్సు చేసిన తర్వాత ఆన్లైన్ ఉద్యోగం చేస్తున్నాను. నేను మనందరి కోసం పని చేస్తున్నాను. నాకు
మీరే ప్రేరణ” అని అంది.
ఆమె మాటలు విన్న ప్రసాద్ మనసు ఆనందంతో నిండిపోయింది. అర్థం చేసుకునే భార్య ఉంటే కష్టాల్లో కూడా హాయిగా ఉండ వచ్చు అని అతనికి బాగా అర్థం అయ్యింది. ఆనందంగా భార్యా పిల్లలను దగ్గరకు తీసుకొన్నాడు. నిజంగా ఈ ఉగాది అతని జీవితంలో ఒక మధురానుభూతి కలిగించింది. ఇలాంటి ప్రసాదులు,రాజీలు మన మధ్యలో ఎందరో ఉన్నారు. వారందరికీ ఈ పండుగ రోజు మంచి జరగాలని ఈ ప్రసాద్ కోరుకుంటున్నాడు.
– వెంకట భాను ప్రసాద్