పంతులు కథ

పంతులు కథ

అనగనగా ఒక రాజు ఉండేవాడు. చాలా పరాక్రమ వంతుడు. ఎంతటి రాజ్యాన్నైనా కూడా గెలిచి తన రాజ్యాన్ని విస్తరించేవాడు. అట్లా ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఎదురులేని శక్తిగా నిలబడ్డాడు. తనకు మరో గుణం ఉంది. ఎంతటి చిన్న ప్రాణి ఆపదలో ఉన్నా విలవిలలాడిపోతాడు. వాటికి పూర్తి సహాయాన్ని అందిస్తాడు. అంతటి మంచితనం తనది.

రాజులు అంటే రాజ్యాలు ఆక్రమించడమే కాదు. వేటకు పోవాలి. అట్లా ఆ రాజు ఒకరోజు ఒక అంగరక్షకుడితో అడవికి వేటకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు. అంతలో తనకు అద్భుతమైన సంఘటన తన కండ్ల ముందు సాక్షాత్కరించింది. *అదేంటంటే ఒక బొంతపురుగు సీతాకోక చిలుకలా రూపాంతరం చెందబోతున్నది.* *కానీ పాత రూపం నుండి కొత్త రూపంలోకి రావడానికి వర్ణించలేని వేదన పడుతున్నది.*

అది చూసి రాజు తట్టుకోలేకపోయాడు. వెంటనే తన ఒరలోని కత్తితో బొంతపురుగు పొర చీల్చి సీతాకోకచిలుక బయటికి రావడానికి మార్గం సుగమం చేశాడు. మంచి పని చేశానని సంబరపడిపోయాడు.

మనకు అట్లనే సంతోషంగా ఉంది కదా. ఎవరికుండదు స్వేచ్చని చూస్తే సంతోషం. సీతాకోకచిలుక పైకి స్వేచ్ఛగా ఎగిరింది. ఏమైందో తెల్వదు కానీ సీతాకోకచిలుక కింద పడిపోయింది. మనలాగే రాజు కంగారు పడ్డాడు. దానికి గాయం ఏమి లేదు. మళ్ళీ ఎగురవేశాడు. మళ్ళీ ఎగురడం ప్రారంభించింది. మళ్ళీ ఏమైందో ఏమో కింద పడిపోయింది.

రాజుకు అర్థం కాలేదు. అంగరక్షకుని వైపు చూశాడు. తను చెప్పలేకపోయాడు. తెలియక కాదు చెప్తే ఏమనుకుంటాడో అని చెప్పలేదు. అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కొన్ని సున్నితమైన, సహజమైన విషయాలు రాజులకు అర్థం కావు. దానికి ఏమైందని రాజు తీవ్రంగా ఆలోచించసాగాడు. మళ్ళీ రెండో సారి అంగరక్షకుడి వైపు ఏమై ఉంటుందని ప్రశ్నలా చూశాడు.

అప్పుడు అతను మాట్లాడుతూ… అయ్యా రాజు గారు సీతాకోకచిలుక రూపాంతరం చెందేటపుడు తన రెక్కల శక్తినంతటిని కూడగట్టుకొని తన జన్మాంతం ఎగురాలనుకుంది. తన రెక్కలకు బలాన్ని కూడగట్టుకుంటున్నది. బలమైన రెక్కలను నిర్మించుకుంటున్నది. అది చూసి మీరు తను బయటికి రావడానికి కష్టపడుతున్నది అనుకున్నారు. సహాయం చేశాను అనుకున్నారు. కానీ దానిని తన జీవితాంతం స్వేచ్ఛగా ఎగురకుండా చేశారు. మీరిది తెలియక చేసిన తప్పు. జీవితాంతం సీతాకోకచిలుకకు తలపెట్టిన ముప్పు.

*సహాయమెప్పుడూ సహజమైన మార్పుకు అడ్డు రాకూడదు*

*విద్యార్థులరా…* !

*స్వంత ప్రయత్నాలు చేయకుండా ఉపాధ్యాయులు సహాయం చేయాలని కోరుకోవద్దు…*
*ఉపాద్యాయులను మాత్రమే నిందితుల చేయవద్దు…*

– అమృతరాజ్

Related Posts

1 Comment

  1. సొంతంగా ఎదగాలని విద్యార్ధుల కు మీరు వివరించిన విధానం చాలా బాగుంది..

Comments are closed.